మలేషియా విమానం పై వింత థియరీ!
అంత పెద్ద విమానం ఆకాశంలో ఆవిరైపోతుందా? అజా అయిపూ లేకుండా పోతుందా? గమ్యం చేర్చాల్సిన మలేషియా ఫ్లైట్ 370, దాని లోని 239 మంది వ్యక్తులు చిరునామా లేకుండా ఎక్కడికి వెళ్లిపోయారు? ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రశ్నలు ఇవి. విమానం దారిమళ్లింపులు, విమానంలో విస్ఫోటనాలు మాత్రమే ఇప్పటి వరకూ ప్రపంచానికి తెలుసు. ఆకాశానికి, అగాథానికి కూడా తెలియకుండా కనికట్టు చేయడం మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు.
విమాన ప్రయాణ భద్రతకు, యాత్రీకుల సురక్షకు సరికొత్త సవాలు విసురుతోంది మటుమాయమైన మలేషియా విమానం! ఇప్పుడు ఈ విషయంలో ఎన్నెన్నో అంచనాలు, ఇంకెన్నో థియరీలు, మరెన్నో ఊహాగానాలకు ఊపిరిపోస్తోంది. ఈ క్రమంలోనే కీత్ లెడ్జర్వుడ్ అనే ఆయన ఒక కొత్త థియరీని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఆ థియరీ హల్చల్ చేస్తోంది.
లెడ్జర్వుడ్ సంచలన థియరీ
లెడ్జర్వుడ్ టంబ్లర్ లో తన వాదనను పోస్ట్ చేశారు. ఆయన హాబీ విమానాలను నడపడం. ఏవియేషన్ రంగాన్ని మధించడం. ఆయన స్కై వెక్టర్ డాట్ కామ్ అనే ఆకాశయాన అధ్యయన వెబ్ సైట్ లో విమానం వెళ్లిన మార్గాన్ని, అది సందేశాలు పంపడం ఆగిపోయిన చోట ఆ సమయంలో నడుస్తున్న ఇతర విమానాల వివరాలను సేకరించారు. స్కై వెక్టర్ డాట్ కామ్ లో ఆ సమయంలో ఆకాశయానంలో ఉన్న విమానాలు, వాటి మార్గాల చిత్రం ఇలా ఉంది.
ఎం హెచ్ 370 వెళ్తున్న మార్గంలో దాని ముందు సింగపూర్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎస్ ఐ ఏ 68 విమానం వెళ్తోందని గుర్తించారు. ఒక్క పావు గంట పాటు ఎస్ ఐఏ 68 వెనక వెళ్లాక సిగ్నల్స్ ఆపేసిందని ఆయన అంటున్నారు. దీనితో ఎం హెచ్ 320 ట్రాన్స్పాండర్లు పనిచేయకుండానే ముందుకు వెళ్తోంది. అంటే ఎస్ ఐ ఏ 68 నీడలో ఎంహెచ్ 320 వెళ్లింది. దీని వల్ల రేడార్ పై ఈ రెండూ ఒకటిగానే కనిపించాయని లెడ్జర్వుడ్ అంటున్నారు. ఈ రెండూ బోయింగ్ 777 విమానాలే.
లెడ్జర్ వుడ్ ప్రకారం ఈ పటంలో చూపించినట్టు విమానాలు ఒకదానికి వెనుక వెళ్లాయి.
ఈ మోసం తోటే మలేశియన్ విమాన పైలట్ భారత, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ల మీదుగా, కిర్గిజిస్తాన్ వరకూ వెళ్లగలిగాడని అంటున్నారు. ముందున్న విమానానికి కూడా వెనక వస్తున్న విమానం ట్రాన్స్ పాండర్ ఆపివేయడంతో దాని కదలికలు తెలియలేదు. ఇలా విమానంలోని ట్రాన్స్ పాండర్ ను ఆపివేయడానికి వీలుంటుంది.
లెడ్జర్ వుడ్ అంచనా ప్రకారం విమానాలు రెండూ ఈ పటంలో చూపిన మార్గంలో వెళ్లి ఉండవచ్చు.
చాలా ప్రమాదకమైన ఆలోచన
ఇదే నిజమైతే ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఒక విమానం వెనుక రాడార్ కు చిక్కకుండా ఇంకో విమానం వచ్చి ఉన్నట్టుండి దాడి చేయవచ్చు. అపార ప్రాణనష్టం జరగవచ్చు. ఇదే టెక్నిక్ ను ఉగ్రవాదులు ఉపయోగించుకోవచ్చు. అందుకే లెడ్జర్ వుడ్ థియరీని ఇంత నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఏవియేషన్ రంగ నిపుణులు కొందరు మాత్రం ఈ థియరీపై పలు సందేహచిహ్నాలు పెడుతున్నారు. ఇలా అవడానికి వీల్లేదని కూడా అంటున్నారు. కానీ లెడ్జర్ వుడ్ థియరీని మాత్రం ఉగ్రవాద వ్యతిరేకపోరులో ఉన్న దేశాలు మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నాయి.
అయితే ఒక ప్రశ్నకి మాత్రం ఇప్పటికీ జవాబు దొరకడం లేదు. ఇంతకీ విమానాన్ని పైలట్ స్వయంగా హైజాక్ చేసినా ఈ పాటికి తన డిమాండ్లేమిటో చెప్పి ఉండాలి కదా! ఏ ఫలితమూ, లక్ష్యమూ లేకుండా ఇన్ని రోజులు ప్రయాణికులకు ఉచితభోజన సదుపాయం కల్పించేందుకు ఆ పైలట్ ఏమీ బిల్ గేట్స్ కాదు కదా!