KGH mortuary
-
శరవేగంగా ‘మోడ్రన్ మార్చురీ’
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): కేజీహెచ్ మోడ్రన్ మార్చురీ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న మార్చురీని ఆధునికీకరిస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం వచ్చే వారి మృతుల బంధువుల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్ నిర్మాణం చేపట్టారు. అనంతరం ఏసీలు ఏర్పాటు చేయనున్నారు. మోడ్రన్ మార్చురీ అభివృద్ధికి కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున రూ.50 లక్షలు మంజూరు చేసిన విషయం పాఠకులకు విధితమే. ఆంధ్రా మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న మోడ్రన్ మార్చురీ ఆధునికీకరణపై ఏఎంసీ ప్రిన్సిపాల్ సాంబశివరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.మైథిలి, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులతో గత నెల 28న కలెక్టర్ చర్చించిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌కు, ఆంధ్రా మెడికల్ కళాశాలకు అనుబంధంగా మార్చురీ ఉంది. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, బీచ్‌లో గల్లంతు, రైలు ప్రమాదాల్లో మృతులకు పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తీసుకు వస్తుంటారు. మృతదేహాలతో పాటు వారి బంధువులు ఇక్కడికి వస్తుంటారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు..మరో వైపు శవ పంచనామా చేసేందుకు పోలీసులు..తరచూ కేజీహెచ్ మార్చురీకి వస్తుంటారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యే వరకు వీరంతా మండుటెండల్లోనో, జోరువానలోనో నిరీక్షించాల్సిన దుస్థితి గతంలో ఉండేది. మార్చురీ అభివృద్ధిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి కేజీహెచ్ మార్చురీ ఆధునికీకరణకు కలెక్టర్ మల్లికార్జున ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మార్చురీ అభివృద్ధికి సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపారు. తక్షణమే పనులు చేపట్టాలని గత నెలలోనే ఆదేశించారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి పోస్ట్ మార్టం కోసం వచ్చే బంధువులు, పోలీసులు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా, మండుటెండల్లో నిరీక్షించకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేక షెడ్డు వేసి, అందులో ఏసీల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడమే గాక ఈ పనుల కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. కొద్ది రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. (చదవండి: బొర్రా గుహలకు మెట్రో గేటు) -
ఒళ్లు జలదరించే ఉద్యోగం
కేజీహెచ్ మార్చురీలో పోస్టుమార్టం కట్టర్ ఇప్పటి వరకు 25 వేల శవాలకు పైగా కోత 23 ఏళ్లపాటు మార్చురీలోనే సేవలు జూన్‌లో పదవీ విరమణ చేయనున్న రాము.. డాబాగార్డెన్స్: కొందరికి రక్తం అంటే భయం.. మరికొందరికి శవం అంటే వణుకు.. ఇంకొందరికి మృతదేహాన్ని ముట్టుకోవాలన్నా, దహన సంస్కారాల్లో పాల్గొనాలన్నా ఏదో తెలియని భీతి.. నిత్యం శవాలను దహనం/ఖననం చేసే కాటి కాపరి వృత్తి గురించి చెప్పగానే అమ్మో అంటూ నోరెళ్లబెట్టేస్తుంటాం.. ఇంతకంటే భయంకరమైన పని ఏదైనా ఉంటుందా అని ఆశ్చర్యపోతుంటాం.. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే చోట ‘కట్టర్’ అంటూ ఒకరుంటారని, తొలుత ఇతనే శవాన్ని కోస్తాడనే విషయం చాలా మందికి తెలియదు. ఇది ప్రభుత్వ ఉద్యోగమే అయినా, ఈ పని చేయడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. లేదంటే రాత్రిళ్లు శవాలు కలలోకి వచ్చి లేచి కూర్చుంటాయి. అలాంటి వృత్తిలో ఒకటి రెండు కాదు 23 ఏళ్లుగా ఉంటూ 25వేల శవాలను కోసిన రాము కథ ఇది. విశాఖపట్టణం కింగ్‌జార్జి ఆస్పత్రి మార్చురిలో కట్టర్ విధులు నిర్వహిస్తున్న సురపల్లి రాము మరో రెండు నెలల్లో (జూన్) రిటైర్ కాబోతున్నారు. అరుదైన వృత్తిలో ఉంటున్న అతని జీవనశైలి ఆసక్తికరం. అసహ్యానికి అతీతం విధి నిర్వహణలో ఇప్పటి వరకు ఎన్నో శవాలు చూశాడు. పూర్తిగా కుళ్లిపోయి డీకంపోజ్ అయిన మృతదేహాలు, ఉరిపోసుకుని ఆత్మహత్య.. కిరోసిన్న్/పెట్రోలు పోసుకుని తగలబెట్టుకున్న వారి మృతదేహాలు, నాలుగైదు రోజుల పాటు సముద్రంలో ఉండిపోయి ఉబ్బిపోయిన మృతదేహాలు, రైలు ప్రమాదంలో ముక్కలు ముక్కలుగా తెగిపడిన మృతదేహాలు, రోడ్డు ప్రమాదంలో భయంకరంగా ఉన్న మృతదేహాలు.. ఇలా ఏ స్థితిలో ఉన్న మృత దేహం పోస్టుమార్టం కోసం వచ్చినా రాము భయం, అసహ్యం లేకుండా విధి నిర్వహణ పూర్తి చేసి డాక్టర్ల ప్రశంసలు పొందుతాడు. అందుకే ఈ వృత్తిలో రెండు దశాబ్దాలు పైగా కొనసాగాడు. దాదాపు 25వేల మృతదేహాలకు పైగా తన చేతులతో కోత కోశాడు. కేజీహెచ్ మార్చురీలో 23 ఏళ్లుగా అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. 1982లో కింగ్ జార్జ్ ఆస్పత్రిలో మెయిన్ తోటీగా విధుల్లో చేరిన రాము 1994 నుంచి మార్చురీలో నైట్ వాచ్‌మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తోటి పనివారి దగ్గర కట్టర్ (పోస్టుమార్టం)పనులు నేర్చుకుని 1995 నుంచి ఆ విధుల్లోనే ఉన్నాడు. ఆ చేతులతోనే భోజనం.. సాధారణంగా మార్చురీ వద్దకు వెళ్లాలంటే కొంత భయపడతారు.అటువంటిది రాము మాత్రం నిత్యం శవాల గదిలోనే ఉంటూ..అక్కడే భోజనం చేస్తూ..అక్కడే నిద్రిస్తుంటాడు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా..ఆ చీకటి గదిలోనే ఉండిపోయేవాడు. పోస్టుమార్టం కోసం ముందుగా శవాన్ని కోత కోస్తాడు. అనంతరం వైద్యులు పోస్టుమార్టం చేస్తారు. అనంతరం ఆ మృతదేహాన్ని కుట్టి, చాప చుడతాడు. ఆ చేతులతోనే అక్కడే భోజనం చేస్తుంటాడు. విధి విచిత్రం రాము తన వృత్తిని అల్లుడికి నేర్పాడు. కుటుంబ కలహాలో.. అనారోగ్య కారణంగానో ఉరిపోసుకుని అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశేషమేమిటంటే..తన వృత్తి నేర్పిన అల్లుడి మృతదేహానికి కూడా రామే కోత కోశాడు. అలవాటై పోయింది.. ఇందులో ఏముంది. అలవాటైపోయింది. ఎటువంటి శవాన్ని అయినా కోత కోస్తాను. నాకు భయం.. వాసన అనేవి దూరం. భయపడేవాడినైతే ఈ వృత్తిలోకే వచ్చే వాడిని కాను. ఇప్పటి వరకు ఎన్నో మృతదేహాలను నా చేతులతోనే కోత కోశాను. కుట్టాను. శవాల పక్కనే ఉంటాను. అక్కడే తింటాను. విధులు ముగించుకొని ఇంటికెళ్లి చుక్క మందేసి హాయిగా నిద్రపోతాను. నాకు ఎటువంటి కలలు రావు. – సురపల్లి రాము, మార్చురీ కట్టర్