ఒళ్లు జలదరించే ఉద్యోగం | surapalli ramu worked as postmortem cutter in KGH mortuary | Sakshi
Sakshi News home page

ఒళ్లు జలదరించే ఉద్యోగం

Published Sun, Apr 16 2017 9:43 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

ఒళ్లు జలదరించే ఉద్యోగం - Sakshi

ఒళ్లు జలదరించే ఉద్యోగం

కేజీహెచ్‌ మార్చురీలో పోస్టుమార్టం కట్టర్‌
ఇప్పటి వరకు 25 వేల శవాలకు పైగా కోత
23 ఏళ్లపాటు మార్చురీలోనే సేవలు
జూన్‌లో పదవీ విరమణ చేయనున్న రాము..


డాబాగార్డెన్స్‌: కొందరికి రక్తం అంటే భయం.. మరికొందరికి శవం అంటే వణుకు.. ఇంకొందరికి మృతదేహాన్ని ముట్టుకోవాలన్నా, దహన సంస్కారాల్లో పాల్గొనాలన్నా ఏదో తెలియని భీతి.. నిత్యం శవాలను దహనం/ఖననం చేసే కాటి కాపరి వృత్తి గురించి చెప్పగానే అమ్మో అంటూ నోరెళ్లబెట్టేస్తుంటాం.. ఇంతకంటే భయంకరమైన పని ఏదైనా ఉంటుందా అని ఆశ్చర్యపోతుంటాం.. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే చోట ‘కట్టర్‌’ అంటూ ఒకరుంటారని, తొలుత ఇతనే శవాన్ని కోస్తాడనే విషయం చాలా మందికి తెలియదు.

ఇది ప్రభుత్వ ఉద్యోగమే అయినా, ఈ పని చేయడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. లేదంటే రాత్రిళ్లు శవాలు కలలోకి వచ్చి లేచి కూర్చుంటాయి. అలాంటి వృత్తిలో ఒకటి రెండు కాదు 23 ఏళ్లుగా ఉంటూ 25వేల శవాలను కోసిన రాము కథ ఇది. విశాఖపట్టణం కింగ్‌జార్జి ఆస్పత్రి మార్చురిలో కట్టర్‌ విధులు నిర్వహిస్తున్న సురపల్లి రాము మరో రెండు నెలల్లో (జూన్‌) రిటైర్‌ కాబోతున్నారు. అరుదైన వృత్తిలో ఉంటున్న అతని జీవనశైలి ఆసక్తికరం.

అసహ్యానికి అతీతం
విధి నిర్వహణలో ఇప్పటి వరకు ఎన్నో శవాలు చూశాడు. పూర్తిగా కుళ్లిపోయి డీకంపోజ్‌ అయిన మృతదేహాలు, ఉరిపోసుకుని ఆత్మహత్య.. కిరోసిన్‌న్‌/పెట్రోలు పోసుకుని తగలబెట్టుకున్న వారి మృతదేహాలు, నాలుగైదు రోజుల పాటు సముద్రంలో ఉండిపోయి ఉబ్బిపోయిన మృతదేహాలు, రైలు ప్రమాదంలో ముక్కలు ముక్కలుగా తెగిపడిన మృతదేహాలు, రోడ్డు ప్రమాదంలో భయంకరంగా ఉన్న మృతదేహాలు.. ఇలా ఏ స్థితిలో ఉన్న మృత దేహం పోస్టుమార్టం కోసం వచ్చినా రాము భయం, అసహ్యం లేకుండా విధి నిర్వహణ పూర్తి చేసి డాక్టర్ల ప్రశంసలు పొందుతాడు. అందుకే ఈ వృత్తిలో రెండు దశాబ్దాలు పైగా కొనసాగాడు. దాదాపు 25వేల మృతదేహాలకు పైగా తన చేతులతో కోత కోశాడు.

కేజీహెచ్‌ మార్చురీలో 23 ఏళ్లుగా అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. 1982లో కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో మెయిన్‌ తోటీగా విధుల్లో చేరిన రాము 1994 నుంచి మార్చురీలో నైట్‌ వాచ్‌మన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తోటి పనివారి దగ్గర కట్టర్‌ (పోస్టుమార్టం)పనులు నేర్చుకుని 1995 నుంచి ఆ విధుల్లోనే ఉన్నాడు.  

ఆ చేతులతోనే భోజనం..
సాధారణంగా మార్చురీ వద్దకు వెళ్లాలంటే కొంత భయపడతారు.అటువంటిది రాము మాత్రం నిత్యం శవాల గదిలోనే ఉంటూ..అక్కడే భోజనం చేస్తూ..అక్కడే నిద్రిస్తుంటాడు. రాత్రి వేళల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినా..ఆ చీకటి గదిలోనే ఉండిపోయేవాడు. పోస్టుమార్టం కోసం ముందుగా శవాన్ని కోత కోస్తాడు. అనంతరం  వైద్యులు పోస్టుమార్టం చేస్తారు. అనంతరం ఆ మృతదేహాన్ని కుట్టి, చాప చుడతాడు. ఆ చేతులతోనే అక్కడే భోజనం చేస్తుంటాడు.

విధి విచిత్రం
రాము తన వృత్తిని అల్లుడికి నేర్పాడు. కుటుంబ కలహాలో.. అనారోగ్య కారణంగానో ఉరిపోసుకుని అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశేషమేమిటంటే..తన వృత్తి నేర్పిన అల్లుడి మృతదేహానికి కూడా రామే కోత కోశాడు.

అలవాటై పోయింది..
ఇందులో ఏముంది. అలవాటైపోయింది. ఎటువంటి శవాన్ని అయినా కోత కోస్తాను. నాకు భయం.. వాసన అనేవి దూరం. భయపడేవాడినైతే ఈ వృత్తిలోకే వచ్చే వాడిని కాను. ఇప్పటి వరకు ఎన్నో మృతదేహాలను నా చేతులతోనే కోత కోశాను. కుట్టాను.  శవాల పక్కనే ఉంటాను. అక్కడే తింటాను. విధులు ముగించుకొని ఇంటికెళ్లి చుక్క మందేసి హాయిగా నిద్రపోతాను. నాకు ఎటువంటి కలలు రావు.
 – సురపల్లి రాము, మార్చురీ కట్టర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement