'చిత్రహింసలు భరించలేకున్నా.. కాపాడండి'
ఆదోని (కర్నూలు): మనవడి గుండె ఆపరేషన్‌కు చేసిన అప్పు తీర్చేందుకు సౌదీ అరేబియా వెళ్లిన మహిళ అక్కడి ఇంటి యజమానురాలి చిత్రహింసలు భరించలేక తిరిగొచ్చే ఏర్పాట్లు చేయాలని కూతురిని బతిమాలుతోంది. వివరాలు.. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విజయభాస్కర్‌రెడ్డి నగర్‌కు చెందిన ఖాజాబాను(50)కు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు ఆయేషా, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసింది. ఆమె కూతురు వద్దే ఉంటోంది. కూలీ పనులకు వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితి. ఆయేషా కొడుకు మహబూబ్(4) గుండెకు చిల్లు పడటంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించినా.. ఖర్చులకు రూ.50వేలకు పైగా అప్పు చేసింది. వడ్డీ కట్టలేకపోవడంతో అప్పు రెట్టింపయింది. ఈ పరిస్థితుల్లో ఖాజాబాను తనకు తెలిసిన వారి ద్వారా ముంబైకి వెళ్లి ఓ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఆ తర్వాత తన మహమ్మద్ అనే వ్యక్తి ప్రతిపాదనతో సౌదీ వెళ్లేందుకు తిరిగి ఆదోనికి చేరుకుంది. సౌదీ వెళ్లే ప్రయత్నంలో కడప జిల్లా రాయచోటికి చెందిన బాషా అనే ఏజెంట్ గత డిసెంబర్లో వీరిని సంప్రదించాడు.
షేక్‌ల ఇంట్లో పని మనిషిగా చేరితే నెలకు రూ.20వేల జీతం ఇస్తారని.. అంగీకరిస్తే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఆ మేరకు పాస్‌పోర్టు, వీసా సిద్ధం కాగా.. గత ఫిబ్రవరి 3న ఖాజాబాను హైదరాబాద్ చేరుకుని, 5న సౌదీకి బయలుదేరింది. అక్కడి షేక్ ఇంట్లో పని మనిషిగా కుదిరిన ఆమెకు.. అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి.