అయ్య బాబోయ్!
- రైతు మెడపై కత్తిలా బ్యాంకు రుణాలు
- ఖరీఫ్ పెట్టుబడులపై దిక్కుతోచని వైనం
- ఓటేసి మోసపోయామంటూ మహిళల శాపనార్థాలు
- పెంచిన పింఛన్లేవంటూ లబ్ధిదారుల గగ్గోలు
- బెల్టుషాపులపై గ్రామీణ మహిళల ఆందోళన
- ముఖ్యమంత్రి ఉత్తుత్తి సంతకాలపై సర్వత్రా విమర్శలు
- రోడ్డున పడిన ఆదర్శరైతు, ఉపాధి ఉద్యోగుల కుటుంబాలు
- ఉద్యమాలు తప్పవంటున్న ప్రజాసంఘాలు
సాక్షి, ఒంగోలు: కొత్త ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటిగా ఆవిరవుతున్నాయి. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే తొలి,మలి సంతకాలతో మేలు చేస్తానన్న నేత ప్రజలకు హామీలపై స్పష్టతనివ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పట్లో రైతుల రుణాలు మాఫీ అవుతాయా? రీషెడ్యూల్ చేసి చేతులు దులుపుకుంటారా..? అంటూ జిల్లాలో ఎక్కడ విన్నా ఇదే చర్చ నడుస్తోంది. ‘బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దు. మేం అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీచేస్తాం..’ అనేమాటను తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి వార్డుస్థాయి కార్యకర్త వరకు ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
ఆదర్శ రైతులు, రైతుసంఘాల ప్రతినిధులతో సమావేశాలు పెట్టిమరీ .. రుణమాఫీ హామీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆపార్టీ లక్ష్యం నెరవేరింది. పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే.. ఆదర్శరైతువ్యవస్థ రద్దుతో జిల్లాలో 1859 రైతుకుటుంబాల్ని రోడ్డున పడేశారు. రుణాలు చెల్లించమంటూ బ్యాంకర్లు రైతుమెడపై కత్తిపెట్టినట్లు నోటీసులిచ్చారు.
ఇప్పుడే మొదలైన ఖరీఫ్ సీజన్ సాగుకు చేతిలో రైతుకు చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ చాలవన్నట్టు చంద్రబాబు పాలనలో కరువు ఖాయమంటూ వినిపిస్తున్న సెంటిమెంట్ మాటలతో రైతుల గుండెలదిరిపోతున్నాయి. కష్టాలసాగు చేయాలా.. వద్దా..? అనే తరుణంలో డొక్కల కరువు కమ్ముకొస్తుందేమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
రుణమాఫీ అయ్యేనా..?
జిల్లాలో పంట రుణాల కింద కిందటేడాది పంపిణీ చేసిన వాటితో కలుపుకుని మొత్తం రూ.5,600 కోట్ల బకాయిలు మాఫీకావాల్సి ఉంది. ఈమొత్తం బకాయి రికవరీ అయితేనే.. ఖరీఫ్ సాగుకు కొత్తగా రుణాలందిస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈమేరకు రుణాలు రద్దవుతాయో..రీషెడ్యూల్ ప్రతిపాదన చేస్తారో..? అనే ఆందోళన రైతుల్లో వినిపిస్తోంది.
- ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే అధికారి కరువయ్యాడు.
- ఒకవైపు ఎరువుల ధరలు పెరిగిపోగా, విత్తనాల కొరత తీవ్రంగా ఉంది. సాగునీటి విడుదలపై స్పష్టత కొరవడింది. పంటకాలువలు, చెరువులు ఎండిపోయాయి.
- అదేవిధంగా జిల్లాలో డ్వాక్రాసంఘాల మహిళలు మొత్తం 47 వేల మంది ఉండగా, సుమారు రూ.770 కోట్ల రుణాలు రద్దుకావాల్సి ఉంది. ఈ అంశంపైనా ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో.. బ్యాంకర్లు మహిళా సంఘాలపై కూడా నోటీసుల యుద్ధం ప్రకటించారు. బాబు సంతకం చేసి చాలారోజులైనా రుణాలు రద్దుకాకపోవడంపై మహిళలు టీడీపీ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతూ ఎదురుచూస్తున్నారు.
సుజలం దొరకకున్నా.. అంతటా ‘మద్యం’కంపే:
ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట మినరల్ వాటర్‌ను అతితక్కువ ధరకు అందిస్తామని చేసిన సంతకం కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. జిల్లాలో ఫ్లోరైడ్పీడతో ఇప్పటికే 271 గ్రామాలు ఉండగా, ముందుగా ఆయాగ్రామాలపై దృష్టి సారించి మినరల్ వాటర్‌ను ప్రజలకు నామమాత్రపు రుసుంతో అందివ్వాల్సిన అధికారులు దాని ఊసే పట్టించుకోవడం లేదు. ఇదిలాఉంటే, జిల్లావ్యాప్తంగా 3,800కు పైగానే బెల్టుదుకాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తూనే ఉన్నారు.
అక్టోబర్ వరకు పింఛన్‌పాట్లు తప్పవా..?
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయగా.. దానికి సంబంధించిన మార్గదర్శకాలు, పంపిణీపై జిల్లాప్రభుత్వ అధికారుల వద్దనే స్పష్టత కొరవడింది. జిల్లాలో 3.27 లక్షల మంది లబ్ధిదారులు పెరిగిన పింఛన్‌సొమ్ము తీసుకోవాలనే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే, అక్టోబర్ వరకు పెరిగిన పింఛన్‌సొమ్ము అందనట్టేనని స్థానిక అధికారులు చెబుతుండటంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
జాబ్ సరే.. రోడ్డునపడిన కుటుంబాల గతేంటి..?
‘జాబ్ కావాలంటే..బాబు అధికారంలోకి రావాల్సిందే’నంటూ ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. అయితే, జాబు సంగతి సరే... బాబు తీసుకున్న నిర్ణయంతో ఉపాధి కోల్పోయి రోడ్డునపడిన కుటుంబాల్ని ఆదుకునేదెవరనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది.
- ఎన్నికల్లో పలురకాల అంశాలపై ఆదర్శ రైతులను మభ్యపెట్టి వాడుకున్న తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి రాగానే, వారి సేవలు చాలించాలంటూ సంతకాలు చేయడంపై విమర్శలొస్తున్నాయి.
- జిల్లాలో మొత్తం 1859 మంది ఆదర్శ రైతులుండగా, వీరు ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిలా పనిచేస్తుండేవారు. నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనంతో నిర్దేశించిన గ్రామాల్లో విస్తృతంగా సేవలందించేవారు. ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ సూచనల్ని రైతులకు చేరవేసి.. సాగుకు చేయూతనివ్వడంలో ముందుండే ‘ఆదర్శం’ బాబు పాలన ఆరంభంలోనే అభాసుపాలవుతోందనే అభిప్రాయం రైతుసంఘాల నేతల్లో కలుగుతోంది.
- ఆయా సమస్యల పరిష్కారానికి ఉద్యమబాటే ఏకైక పరిష్కారమని ప్రజా, రైతుసంఘాలు హెచ్చరిస్తున్నాయి.