సంచలనం: సీజేఐకు ఐదేళ్ల శిక్ష విధించిన కర్ణన్
కోల్‌కతా: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కర్ణన్ సంచలన తీర్పుతో ఒక్కసారిగా న్యాయవ్యవస్ధ షాక్‌కు గురైంది. సీజేఐతో పాటు మరో ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కర్ణన్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్-1989, 2015ల కింద వీరికి శిక్షను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల పాటు శిక్షను పొడిగించాలని ఆదేశించారు. కుల వివక్ష చూపిన జడ్జిలందరికీ ఆయా పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జరిమానాను వారం రోజుల్లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చెల్లించాలని పేర్కొన్నారు.
కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. కేసులో బాధితుడిగా ఉన్న వ్యక్తికి(అంటే కర్ణన్‌కు) చెల్లించాల్సిన రూ.14 కోట్ల పరిహారం ఇంకా అందలేదని, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆ డబ్బును జడ్జిల వేతనాల్లో నుంచి తీసుకుని అకౌంట్లో వేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగింది:
తోటి హైకోర్టుల జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్ కర్ణన్‌ను విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం జడ్జిలతో కూడిన బెంచ్ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకుని న్యాయపరమైన, చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన విమర్శించారు.