kiran rejiju
-
నాలుగు హైకోర్టులకు సీజేలు
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు హైకోర్టులకు నూతనంగా ప్రధాన న్యాయమూర్తు(సీజే)లు నియమితులయ్యారు. వీరిలో ఇద్దరు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. గుజరాత్ హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సోనియా గిరిధర్ గోకానీని అదే హైకోర్టు సీజేగా నియమించారు. అదేవిధంగా, ఒరిస్సా హైకోర్టులో అత్యంత సీనియర్ జడ్జి జస్టిస్ జస్వంత్ సింగ్ త్రిపుర హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. ఈయన ఈ నెల 22న రిటైర్ కానున్నారు. ఇంతకుముందు జస్టిస్ సింగ్‌ను ఒరిస్సా హైకోర్టు సీజేగా నియమించాలంటూ చేసిన సిఫారసును కొలీజియం ఆతర్వాత ఉపసంహరించుకుంది. రాజస్తాన్ హైకోర్టుకు చెందిన జడ్జి జస్టిస్ సందీప్ మెహతాను గౌహతి హైకోర్టు సీజేగా నియమించారు. గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ జమ్మూకశ్మీర్ అండ్ లద్దాఖ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. తాజా నియామకాలను న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆదివారం ట్విట్టర్లో ప్రకటించారు. కాగా, జస్టిస్ గోకానీ బాధ్యతలు స్వీకరించాక దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారు. గుజరాత్ జ్యుడిషియల్ సర్వీస్ నుంచి వచ్చిన ఈమెకు 62 ఏళ్లు నిండటంతో ఫిబ్రవరి 25న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సబీనా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్నారు. గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జస్టిస్ గోకానీని తక్షణమే నియమించాలంటూ గత వారం కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైన జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. -
జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత
న్యూఢిల్లీ: పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇస్తుంటే వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం బాధాకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘చాలా తక్కువ శాతం మంది మాత్రమే న్యాయం కోసం కోర్టుల దాకా వెళ్లగలుగుతున్నారు. అవగాహన లోపం, అవకాశాల లేమి వల్ల అత్యధికులు ఆ అవకాశానికి దూరమై మౌనంగా వ్యథను అనుభవిస్తున్నారు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘దేశ నిర్మాణంలో పౌరులందరి భాగస్వామ్యానికి అవకాశం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్య సమాజ లక్షణం. అందుకు సామాజిక అసమానతలను రూపుమాపడం అత్యవసరం. అందుకు న్యాయ ప్రక్రియ అందరికీ అందుబాటులో చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ మొదలైన ఆలిండియా జిల్లా న్యాయ సేవల సంస్థల తొలి సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. నల్సా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రెజిజు, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు దేశమంతటి నుంచీ 1,200 మందికి పైగా డెలిగేట్లు పాల్గొన్నారు. సీజేఐ మాట్లాడుతూ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థను దేశ న్యాయ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించారు. కక్షిదారుల్లో అత్యధికులకు అందుబాటులో ఉండే తొలి న్యాయ గవాక్షం అదేనన్నారు. దాన్ని బలోపేతం చేయడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అక్కడ ఎదురయ్యే అనుభవాన్ని బట్టే మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలు అభిప్రాయానికి వస్తారు కాబట్టి జిల్లా న్యాయ వ్యవస్థపై గురుతర బాధ్యత ఉందన్నారు. నల్సా సేవలు అమోఘం విచారణ ఖైదీల స్థితిగతులపై న్యాయ సేవల విభాగం తక్షణం దృష్టి సారించాలని జస్టిస్ రమణ అన్నారు. ఈ దిశగా జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) 27 ఏళ్లుగా గొప్పగా సేవలందిస్తోందని ప్రశంసించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేస్తేనే సత్వర న్యాయం, పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందన్నారు. న్యాయం పొందేందుకు సామాజిక, ఆర్థిక అశక్తతలు అడ్డంకిగా మారని సమ సమాజం కోసం జిల్లా, రాష్ట్ర స్థాయి న్యాయ వ్యవస్థలు కృషి చేయాలని జస్టిస్ చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం టెక్నాలజీని మరింతగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. పేద, అణగారిన వర్గాలకు మరింత సమర్థంగా న్యాయ సేవలు అందించడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై సదస్సు చర్చించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయ సేవల కేంద్రాల మధ్య ఏకరూపత సాధించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు తదితరాలు కూడా చర్చకు రానున్నాయి. సులువుగా న్యాయం: మోదీ సులభతర వాణిజ్యం మాదిరిగానే న్యాయప్రక్రియను కూడా సులభతరం చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర అమృతోత్సవ సంబరాలు ఇందుకు సరైన తరుణమన్నారు. చిరకాలంగా జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా న్యాయ వ్యవస్థకు మరోసారి సూచించారు. జిల్లా జడ్జిలే ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు. ‘‘న్యాయ వ్యవస్థను ఆశ్రయించగల అవకాశం అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. సరైన న్యాయం సత్వరమే అందడమూ అంతే ముఖ్యం. న్యాయ వ్యవస్థకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గత ఎనిమిదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకోవాలి. పురాతన భారతీయ విలువలకు కట్టుబడుతూనే 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా ముందుకెళ్లాలి’’ అని సూచించారు. ఆగస్టు 15కల్లా అత్యధికులకు విముక్తి: రిజిజు విచారణ ఖైదీల్లో అత్యధికులను పంద్రాగస్టు నాటికి విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు రిజిజు వివరించారు. ‘‘వారిని గుర్తించేందుకు నల్సా జూలై 16 నుంచి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఆగస్టు 13 దాకా నిర్విరామంగా పని చేయనుంది’’ అని చెప్పారు. -
ఒలింపిక్స్ జెర్సీలను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్లు సన్నద్దం అవుతున్నారు. ఈ క్రమంలో నేడు(గురువారం) కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు.. భారత అథ్లెట్ల జెర్సీలను, అలాగే సహాయ సిబ్బంది యూనిఫాంలను ఆవిష్కరించారు. అథ్లెట్ల కోసం నీలం, తెలుపు రంగులలో జెర్సీలు డిజైన్ చేయబడగా, సపోర్ట్ స్టాఫ్ కోసం ప్రత్యేక సూట్లు రూపొందించబడ్డాయి. కాగా, షెడ్యూల్ ప్రకారం గతేడాది(2020) జరగాల్సిన విశ్వక్రీడలు.. ఈ ఏడాది జులైకి రీషెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, అంతకముందే ఒలింపిక్స్క్రీడల సంసిద్దతపై ప్రధాని మోదీ.. క్రీడల మంత్రితో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులందరికి వ్యాక్సినేషన్, సరైన శిక్షణ, ఇతర సదుపాయాల గురించి చర్చించారు. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహకాలనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని, మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. విశ్వక్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల దీవెనలుంటాయని, టోక్యోకు వెళ్లే భారత బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ కోసం మన దేశం నుంచి 11 క్రీడా విభాగాల్లో మొత్తం 100 మంది అథ్లెట్లు పాల్గొంటారు. జూన్చివరి నాటికి ఆ సంఖ్య 125కి పెరిగే అవకాశం ఉంది. చదవండి: కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్ వేరు, నా స్టైల్ వేరు -
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో టాప్–10పైనే దృష్టి
న్యూఢిల్లీ: లాస్ ఏంజెలిస్ –2028 ఒలింపిక్స్ నాటికి పతకాల జాబితాలో తొలి 10 స్థానాల్లో నిలిచేలా భారత్ గట్టి పోటీనిస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకే ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం జూనియర్ స్కీమ్’ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 10–13 వయస్సున్న చురుకైన క్రీడాకారులను ఎంపిక చేసి 2028నాటికి ఒలింపియన్లుగా తయారుచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోచ్‌లతో వారికి శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ మేరకు సుశిక్షితులైన స్వదేశీ కోచ్‌ల పదవీకాలాన్ని పొడిగించామని పేర్కొన్నారు. భారత్‌ను క్రీడాశక్తిగా చూడాలనుకున్న ప్రతీ ఒక్కరి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. -
బీజేపీలోకి రెజ్లర్ బబిత
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం, పలు అంతర్జాతీయ పోటీల్లో విజ యాలు సాధించి సత్తా చాటిన రెజ్లర్ బబితా ఫొగాట్, ఆమెకు శిక్షణ నిచ్చిన ఆమె తండ్రి మహవీర్‌సింగ్ ఫొగాట్‌లు సోమవారం బీజేపీలో చేరారు. వీరిద్దరి విజయాలు స్ఫూర్తిగా ‘దంగల్’ పేరుతో ఆమిర్‌ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఓ సినిమా కూడా రూపొందిన విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజు, హరియాణా రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అనిల్ జైన్ సమక్షంలో వారు బీజేపీ తీర్థం పుచ్చుకు న్నారు. యువశక్తికి బబిత నిదర్శనంగా నిలిచిం దని కిరణ్ రిజిజు ప్రశంసించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్‌ల చేరిక పార్టీకి కొత్త శక్తినిస్తుందని బీజేపీ పేర్కొంది. బబిత చేరిక హరియాణా బీజేపీకి మంచిరోజు అని అనిల్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ చరిత్రను తిరగరాశారని బబిత ప్రశంసించారు. -
లోక్‌సభ ముందుకు కొత్త పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: భారత సంతతి వ్యక్తి, ప్రవాస భారతీయ పౌరసత్వ పథకాలను కలిపి కొత్త పౌరసత్వ బిల్లును హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకుగానూ పౌరసత్వ సవరణ బిల్లు-2014ను ప్రభుత్వం గురువారం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా, బలవంతపు మతమార్పిడిని నిషేధంచాలని కోరుతూ శివసేనకి చెందిన సదాశివ లోఖండే శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. స్వచ్ఛందంగా మతం మారినవారికి, పూర్వమతంలోకి తిరిగి వ చ్చేవారికి చట్టం వర్తించదని ఈ బిల్లు చెబుతోంది. బలవంతపు మత మార్పిడిని ప్రోత్సహించేవారికి పదేళ్లవరకూ జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. మత మార్పిడిని ప్రోత్సహించే సంస్థలు, వాటి అధినేతలను శిక్షించాలని కోరుతోంది.