వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
వేముల: వరకట్న వేధింపులు తాళలేక నాగశిల్ప(22) అనే వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వేములలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేంద్రకుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బలపనూరు గ్రామానికి చెందిన నాగశిల్పను వేములకు చెందిన కొమెర మధుకు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. కొన్నాళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. అయితే గత కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవపడేవారు. అదనపు కట్నం తేవాలని తన కుమార్తెను వేధించేవారని.. ఇది తాళలేకే శనివారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని తన కుమార్తె నాగ శిల్ప ఆత్మహత్య చేసుకుందని తండ్రి పెద్ద వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు రాములయ్య, ఈశ్వరమ్మ, మధు, విజయ్, ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ
వేములలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నాగశిల్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థలాన్ని పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, సీఐ రామకృష్ణుడు శనివారం సందర్శించారు. అనంతరం మృతురాలి బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.