Kishor Chandra Dev
-
ఏమి రాజు.. మీ వల్ల మన్యానికి ఏం ఉపయోగం?
వైరిచర్ల కిశోర్ చంద్రసూర్యనారాయణ దేవ్..పేరు గొప్ప..ఊరు దిబ్బ..‘రాజు’ ఘనం... మన్యం దైన్యం... ఔను... ఇది అక్షరాలా సత్యం.కనీస సౌకర్యాలు కూడా లేనివిశాఖ మన్యం సాక్షిగా పచ్చి నిజం. ఐదుసార్లు ఎంపీ... ఓ దపా రాజ్యసభ.. రెండుసార్లు కేంద్రమంత్రి పదవి...కానీ ఏం ప్రయోజనం..? మన్యానికి నేను ఈ అభివృద్ధి పనులు చేశాను.. కనీ సం ఒక్కటంటే ఒక్క పని కూడా చేశానని చెప్పుకోలేని దుస్థితి... రాజుగారూ అని పిలిపించుకునేఈ కిశోర్ చంద్రదేవ్‌ది.రాజ్యాలు పోయినా.. రాచరికపు పోకడలు పోలేదని నిరూపించే కిశోర్ చంద్రదేవ్ అన్నిసార్లు గెలిపించిన అరకులోయకు కనీసం చుట్టుపు చూపునకు కూడా రాని దర్పం ఎవరికి ప్రయోజనం?ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో చేరి చివరాఖరుకు ఇటీవల పాడేరులో పర్యటించిన మంత్రి లోకేష్‌ను బాబుగారూ అని నోరారా పొగిడి పక్కనే నిలుచున్న దృశ్యం కళ్లారా చూసిన ఏజెన్సీ గిరిపుత్రులు...ఏమి రాజు గారూ... ఏమి మీవల్ల ఉపయోగం.. ఇన్నిసార్లు గెలిపిస్తే మీరేం చేశారు.. కనీసం చూసేందుకైనా వచ్చారా... అని గిరిపుత్రులు నిలదీస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా కురుపాం జమీందారీ కుటుంబానికి చెందిన శతృచర్ల కిశోర్ చంద్రదేవ్ రాజకీయ ప్రస్థానం చాలా ఘనమైనదే. ఎప్పుడో 1977లో యుక్త వయస్సులోనే తొలిసారి ఎంపీ అయిన చరిత్ర ఆయనది. ఎంపీగా మొదటి టర్మ్‌లోనే కేంద్రమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. 1979లో ఉక్కు, బొగ్గుగనుల శాఖ మంత్రిగా, మొత్తంగా ఐదుసార్లు ఎంపీగా పనిచేశారు. ఓసారి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2011–2014 మధ్యకాలంలో కేంద్ర గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. ఎన్నో ప్రతిష్టాత్మక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనది. ♦ మరి ఇంతటి ఘన చరిత్రను సొంతం చేసి... దాదాపు పాతికేళ్లపాటు ప్రజాప్రతినిధిగా పట్టం కట్టిన అరకు ప్రజకు ఆయన ఏం చేశారు.. ఈ ప్రాంత అభివృద్ధికి ఏం పాటుపడ్డారు.. కనీసం ఆయన స్వయంగా ఇచ్చిన హామీలైనా అమలయ్యాయా...? అంటే ఏమీ లేదనే సమాధానమే వినిపిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఎస్టీ నియోజకవర్గాలతో కూడిన అరకులోయ లోక్‌సభ స్థానానికి నేను ఈ పని చేశాను అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఆయనది. సరే మిగిలిన జిల్లాలు వదిలేసి విశాఖ జిల్లాలోని అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి, ప్రాంత అభివృద్ధికి ఆయన ఇచ్చిన హామీలు ఏమేరకు అమలయ్యాయో ఒక్కసారి చూస్తే.. ప్చ్ ఆశ్యర్యం వేస్తుంది. ఒక్క పని కూడా చేయకపోగా... కనీసం చుట్టపు చూపునకు కూడా రాలేదని గిరిపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ♦ 2014లో హుద్‌హుద్ దెబ్బకు మన్యం మొత్తం దిబ్బతిన్నా.. కనీసం చూసేందుకు కూడా కిశోర్ చంద్రదేవ్ రాలేదని గిరిజనులు గుర్తు చేస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో కూడా అరకు, పాడేరు నియోజకవర్గాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే పర్యటించారంటే వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క సమస్య కూడా పట్టించుకోలేదు మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో కాదు... మండల కేంద్రాలకు కూతవేటు దూరంలో ఉన్న పల్లెల్లో కూడా కనీస ప్రాథమిక సౌకర్యాలైన తాగునీటి సౌకర్యం, రోడ్లు లేవంటే పాతికేళ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఆయన ఏ మాత్రం వెలగబెట్టారో అర్థమవుతుంది. ♦ విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లోని 244 పంచాయతీల పరిధిలోని 105 గ్రామాల్లో సుమారు 25 వేల మంది కొండకుమ్మర్లు స్థానిక గిరిజన సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, కట్టు, బొట్టు కలిగి తరతరాలుగా నివసిస్తున్నారు. ఆ కొండ కుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేరుస్తానని హామీనిచ్చారు. ఎప్పటికప్పుడు ఆయన ఆ హామీని పట్టించుకోకుండానే వచ్చారు. ఏజెన్సీలోని ప్రధానమైన ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలను కలిపి రవాణ సౌకర్యం కల్పిస్తామని ఇందుకు పెదబయలు, జోలాపుట్టు వద్ద హైలెవెల్ వంతెనలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ జోలాపుట్టు వద్ద వంతెనకు అతీగతీ లేదు. వంతెన నిర్మాణానికి నయాపైసా నిధులు కూడా మంజూరు చేయించలేకపోయారు. ♦ ఇక పెదబయలు వంతెన పనులు మాత్రం ఒడిశా ప్రభుత్వ ప్రోత్సహంతో పనులు ఈ మధ్యనే మొదలయ్యాయి. ఏజెన్సీలో ప్రధాన కూడళ్ల వద్ద బస్ షెల్టర్లు నిర్మిస్తామన్న హామీకి కూడా దిక్కులేకుండా పోయింది. పెద్ద పంచాయతీ కేంద్రాల్లో సామాజిక భవనాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు కూడా బుట్టదాఖలయ్యాయి. విజయనగరం జిల్లా పాచిపెంట నుంచి విశాఖపట్నం జిల్లా లోతేరు వరకు రోడ్డు వేస్తామని ఇచ్చిన హామీ కూడా అతీగతీ లేకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లాకు ఆనుకొని ఉన్న ఒడిశాలోని గున్పూర్ నుంచి విజయనగరం జిల్లా బొబ్బిలి, సాలూరు మీదుగా అరకు రైల్వేలైన్‌ను కలిపి ఖమ్మం జిల్లా కొత్తగూడెం వరకు విస్తరిస్తామని హామీనిచ్చారు. అదే విధంగా అరకు నుంచి పాడేరు మీదుగా నర్సీపట్నం వరకు రైల్వే లైన్లను విస్తరిస్తామని వాగ్దానం చేశారు. కానీ ఈ రైల్వేలైన్లకు సంబంధించి ఇప్పటివరకు సర్వే కూడా చేయించలేకపోయారు. కొండకుమ్మర్లంతా కలిసి బుద్ధి చెబుతాం విశాఖ ఏజెన్సీలో బీసీలుగా ఉన్న కొండకుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోమార్లు కలిసి మా సమస్యను విన్నవించాం. కానీ కనీసం పట్టించుకోలేదు. అందుకే ఈ ఎన్నికల్లో మా కొండకుమ్మర్లంతా ఆయనకు ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. –అల్లంగి ప్రసాద్, కొండకుమ్మర్ల సంఘం అధ్యక్షుడు, వంతాలగుమ్మి, పాడేరు మండలం అందుబాటులో ఉండని ఆయన ఎందుకు? 2009 ఎన్నికల్లో చంద్రదేవ్‌ను మా ప్రాంత గిరిజనులంతా ఓట్లేసి గెలిపించాం. ఇక్కడ నుంచి గెలిచిన తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యారు. కానీ మా ప్రాంతానికి ఒక్కసారి కూడా రాలేదు. ఆయన హయంలో ఏ ఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం చేపట్టలేదు. గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి కమ్యూనిటీ భవనాలు, బస్ షెల్టర్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏవీ రాలేదు. ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండరు. అలాంటి రాజుగారు మాకు అక్కరలేదని నిర్ణయించుకున్నాం.–పెండెలి రామకృష్ణ, బీయస్సీ, బీఈడీ, తురాయిమెట్ట, పాడేరు మండలం -
టీడీపీలో ‘రాజ’ముద్ర
వారంతా రాజులే. అలాగని ప్రజాసంక్షేమమేధ్యేయంగా పాటుపడే పాలకులు కాదు. నిస్వార్థంగా జనానికి సేవ చేసే జవాబుదారీలు కాదు. తమను నిత్యం అంటిపెట్టుకునేవారి సంక్షేమమే వారి లక్ష్యం. స్వార్థ ప్రయోజనం... ఆశ్రిత పక్షపాతం... బంధుప్రీతి... వారి నైజం. అధికారం వారి చేతుల్లోనే ఉండాలి. పదవులు వారే అనుభవించాలి. మిగతా జనమంతా వారి కనుసన్నల్లోనే బతకాలి. అందుకే అత్యధిక బీసీలున్న ఈ జిల్లాలో టీడీపీ హయాంలో వారి ఎదుగుదల నామమాత్రమే. పథకాలన్నీ పెద్దలకే అందుతున్నాయి. బీసీలకు కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. తెలుగుదేశం పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంతృప్తి రాజుకుంటోంది. సాక్షిప్రతినిధి విజయనగరం: రాజంటే... తన రాజ్యంలో సుస్థిర పాలనను అందించడం... తరతమ భేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడటం... ఎలాంటి పక్షపాతాలకు, రాగద్వేషాలకు తావివ్వకుండా నిరంతరం ప్రజల యోగక్షేమాల గురించే ఆలోచించడం చేయాలి. కానీ అలాంటి రాజవంశ ముద్ర వేసుకున్న మన జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఈ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీనిని ఆ పార్టీవారే బాహాటంగా అంగీకరిస్తారు. జిల్లాలో అత్యధికంగాఉన్న బీసీ సామాజిక వర్గాన్ని అధికారపార్టీ నేతలు పూర్తిగా విస్మరించారు. కేవలం రాజ సామాజిక వర్గానికి, వారి అనుచర గణానికి మాత్రమే పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాలిలో కలసిన బీసీలకిచ్చిన హామీలు గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 లక్షల మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఆ హామీలను నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా, బీసీలపై సవతితల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు అనుచరులకు విజయనగరం ఏఎంసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను ఇచ్చారు. బొబ్బిలి రాజు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడాన్ని సుతరామూ అంగీకరించని అక్కడి పార్టీ ఇన్చార్జి తెంటు లకు‡్ష్మనాయుడికి ఆర్టీసీ సంస్థ రీజనల్ చైర్మన్ పదవినిచ్చి కేవలం బుజ్జగించారు. ఈ మూడింటితోనే బీసీలకు ఎంతో చేసేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ నియోజకవర్గ, జిల్లా, రీజనల్ స్థాయి పదవులే కావడం విశేషం. రాష్ట్రస్థాయి పదవులకు నోచనీ బీసీలు ఇక రాష్ట్ర స్థాయి పదవులను మాత్రం బీసీలకు దక్కనివ్వడం లేదు. సుజయ్‌కు ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన తూముల భాస్కరరావును రాష్ట్ర ఆర్థిక మండలి సభ్యుడిగా నియమించుకున్నారు. రాష్ట్ర బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్‌గా భోగపురపు వాయునందన శర్మను వేసుకున్నారు. తాజాగా అశోక్ ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన ఐ.వి.పి.రాజును రాష్ట్ర ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించుకున్నారు. విజయనగరంలో అశోక్‌గజపతిరాజు, సాలూరులో ఆర్పి భంజ్‌దేవ్, కురుపాంలో శత్రుచర్ల విజయరామరాజు, బొబ్బిలిలో ఆర్వి సుజయకృష్ణ రంగారావు రాజుల సామాజిక వర్గం నుంచి టీడీపీలో పెత్తనం చెలాయిస్తుండగా త్వరలోనే వీరికి మరోరాజు కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తోడవ్వనున్నారు. ఇలా విజయనగరం జిల్లా టీడీపీ మొత్తం రాజుల మయంగా మారుతోంది. పోనీ వీరు జనానిమైనా చేస్తున్నారా అంటే..అదీ లేదు. శత్రుచర్ల విజయరామరాజు, ఆర్పి భంజ్‌దేవ్, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇప్పటికే కులనిర్థారణ వివాదాల్లో నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. పదవి కోసం శత్రుచర్ల విజయరామరాజు సొంత నియోజకవర్గాన్ని వదిలి పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. అశోక్ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్‌దేవ్‌లు తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్ ఫెయిలయ్యారు. ఇక భంజ్‌దేవ్ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇక ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్‌చంద్రదేవ్ ఇప్పుడు సడన్‌గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరుతున్నారు. వీరివల్ల జిల్లా ప్రజలు ఏ విధమైన ప్రయోజనం పొందలేకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
ఎవరి గోల వారిది!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మనం అడ్డుకుంటే తెలంగాణ ఆగుతుందా?.. పైగా రాష్ట్రాన్ని విభజిస్తున్నది మన పార్టీయే. అధిష్టానాన్ని కాదని నిలబడగలమా?.. అందువల్ల పార్టీ చెప్పినట్లే నడుచుకుందాం.. ఇదీ ప్రస్తుతం జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల భావన. కేంద్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజులు ఎవరి వారు తాము సమైక్యవాదులమేనని ప్రకటించుకుంటున్నా.. పదవులను వదులుకునేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. సమైక్య సెగ కారణంగా పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్న తమ అనుచరులను నిలువరించడం, జిల్లాపైనా.. పార్టీపైనా ఆధిపత్యం సాధించడం.. అన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు ‘ఎన్నడూ లేని విధంగా శ్రీకాకుళంలో నాపై వ్యతిరేకత వచ్చింది. సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్‌కు సీమాంధ్రలో నూకలు చెల్లాయి. ఇప్పుడేం చేద్దాం’.. ఇదీ మాజీ మంత్రికి వచ్చిన ధర్మ సందేహం. ఒక దశలో రాజకీయ సన్యాయం తీసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినా అభిమానులు ఒత్తిడి పేరుతో పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా అంటూనే గత నెల 20న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినప్పుడు ఆయనకు లంచ్ ఏర్పాటు చేసి తన భక్తిని చాటుకున్నారు. ఇక డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్ర యాదవ్ కాంగ్రెస్ జెండాపై నల్లగుడ్డ కప్పారు. కాంగ్రెస్ భూస్థాపితమైందని ప్రకటించేశారు. ఇటువంటి పార్టీలో ఉండేకంటే వెళ్లిపోవడమే మంచిదన్నారు. డీసీసీ కార్యాలయంలో కేంద్రమంత్రి కృపారాణి ఉండగానే తమ నేత ధర్మాన ప్రసాదరావు చేత ఇందిరకు పూలమాల వేయించేశారు. ఇలా పార్టీలో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం మంత్రులకు ఇరకాటంగా మారింది. అటువంటి వారిని కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు జిల్లా కాంగ్రెస్‌లో అన్నీ తానై వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఆయన స్థానాన్ని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఆమె పరోక్షంగా ధర్మానపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తన ఆధిపత్యాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె వెంట అధికార గణం తప్ప పార్టీ ముఖ్య నాయకులు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. మరో కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ఢిల్లీ తప్ప తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇక రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీ ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగిన సమావేశంలోనే సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుపై నోరు పారేసుకుని చీవాట్లు తిన్నారు. ఇంకో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సహనం కోల్పోయి జనంలో పలుచన అవుతున్నారు. సమైక్య నినాదంతో అడ్డుకుంటున్న జనాన్ని దూషణలతో మరింత కిర్రెక్కిస్తున్నారు. తనకు తానే వ్యతిరేకత పెంచుకుంటున్నారు. మంత్రుల పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లివాటంగా వ్యవహరిస్తున్నారు. అవకాశం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నా.. వారు చేర్చుకుంటారో లేదోననే సందేహంతో సతమతమవుతున్నారు. ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని తమను తిరిగి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారా? అనే సందేహం వారిని వేధిస్తోంది. ఓటర్లు మాత్రం వారిని ఎప్పుడో వదిలేశారు. ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా రకరకాల ధోరణులు, సమస్యలతో జిల్లా కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. పార్టీ జెండా కాకుండా సొంత ఎజెండాతో ఎవరికి వారు ముందుకు సాగుతున్నారు. -
నేను ముమ్మాటికీ సమైక్యవాదినే: కిషోర్ చంద్రదేవ్
విజయనగరం: తాను ముమ్మాటికీ సమైక్యవాదినేనని కేంద్రమంత్రి కిశోర్‌చంద్ర దేవ్ స్పష్టం చేశారు. విజయనగరం ప్రజలు కోరితే తాను రాజీనామాచేస్తానని చెప్పారు. విభజనను అడ్డుకోవడానికి తాను ప్రయత్నించినట్లు తెలిపారు. అయితే తనకు ఎవరూ సహకారం అందించలేదని చెప్పారు. సీమాంధ్ర నుంచి మొత్తం 9 మంది కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్ళం రాజు, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కిషోర్ చంద్రదేవ్ తలా ఒక మాట్లాడుతున్నారు. కాసేపు రాజీనామా అంటారు. మరికాసేపాగితే పార్లమెంటులో వాణి వినిపించాలంటారు. ఒకరు సోనియా తొందరపడొద్దన్నారని చెబితే, ఒకొకరు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటారు. ఇప్పుడు కిషోర్ చంద్ర దేవ్ మాత్రం తాము ముమ్మాటికీ సమైక్యవాదినే అంటున్నారు. ఆయనేం చేస్తారో చూడాలి.