వైరిచర్ల కిశోర్ చంద్రసూర్యనారాయణ దేవ్..పేరు గొప్ప..ఊరు దిబ్బ..‘రాజు’ ఘనం... మన్యం దైన్యం... ఔను... ఇది అక్షరాలా సత్యం.కనీస సౌకర్యాలు కూడా లేనివిశాఖ మన్యం సాక్షిగా పచ్చి నిజం.
ఐదుసార్లు ఎంపీ... ఓ దపా రాజ్యసభ.. రెండుసార్లు కేంద్రమంత్రి పదవి...కానీ ఏం ప్రయోజనం..? మన్యానికి నేను ఈ అభివృద్ధి పనులు చేశాను.. కనీ సం ఒక్కటంటే ఒక్క పని కూడా చేశానని చెప్పుకోలేని దుస్థితి... రాజుగారూ అని పిలిపించుకునేఈ కిశోర్ చంద్రదేవ్‌ది.రాజ్యాలు పోయినా.. రాచరికపు పోకడలు పోలేదని నిరూపించే కిశోర్ చంద్రదేవ్ అన్నిసార్లు గెలిపించిన అరకులోయకు కనీసం చుట్టుపు చూపునకు కూడా రాని దర్పం ఎవరికి ప్రయోజనం?ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో చేరి చివరాఖరుకు ఇటీవల పాడేరులో పర్యటించిన మంత్రి లోకేష్‌ను బాబుగారూ అని నోరారా పొగిడి పక్కనే నిలుచున్న దృశ్యం కళ్లారా చూసిన ఏజెన్సీ గిరిపుత్రులు...ఏమి రాజు గారూ... ఏమి మీవల్ల ఉపయోగం.. ఇన్నిసార్లు గెలిపిస్తే మీరేం చేశారు.. కనీసం చూసేందుకైనా వచ్చారా... అని గిరిపుత్రులు నిలదీస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా కురుపాం జమీందారీ కుటుంబానికి చెందిన శతృచర్ల కిశోర్ చంద్రదేవ్ రాజకీయ ప్రస్థానం చాలా ఘనమైనదే. ఎప్పుడో 1977లో యుక్త వయస్సులోనే తొలిసారి ఎంపీ అయిన చరిత్ర ఆయనది. ఎంపీగా మొదటి టర్మ్‌లోనే కేంద్రమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. 1979లో ఉక్కు, బొగ్గుగనుల శాఖ మంత్రిగా, మొత్తంగా ఐదుసార్లు ఎంపీగా పనిచేశారు. ఓసారి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2011–2014 మధ్యకాలంలో కేంద్ర గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. ఎన్నో ప్రతిష్టాత్మక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయనది.
♦ మరి ఇంతటి ఘన చరిత్రను సొంతం చేసి... దాదాపు పాతికేళ్లపాటు ప్రజాప్రతినిధిగా పట్టం కట్టిన అరకు ప్రజకు ఆయన ఏం చేశారు.. ఈ ప్రాంత అభివృద్ధికి ఏం పాటుపడ్డారు.. కనీసం ఆయన స్వయంగా ఇచ్చిన హామీలైనా అమలయ్యాయా...? అంటే ఏమీ లేదనే సమాధానమే వినిపిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఎస్టీ నియోజకవర్గాలతో కూడిన అరకులోయ లోక్‌సభ స్థానానికి నేను ఈ పని చేశాను అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఆయనది. సరే మిగిలిన జిల్లాలు వదిలేసి విశాఖ జిల్లాలోని అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి, ప్రాంత అభివృద్ధికి ఆయన ఇచ్చిన హామీలు ఏమేరకు అమలయ్యాయో ఒక్కసారి చూస్తే.. ప్చ్ ఆశ్యర్యం వేస్తుంది. ఒక్క పని కూడా చేయకపోగా... కనీసం చుట్టపు చూపునకు కూడా రాలేదని గిరిపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
♦ 2014లో హుద్‌హుద్ దెబ్బకు మన్యం మొత్తం దిబ్బతిన్నా.. కనీసం చూసేందుకు కూడా కిశోర్ చంద్రదేవ్ రాలేదని గిరిజనులు గుర్తు చేస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో కూడా అరకు, పాడేరు నియోజకవర్గాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే పర్యటించారంటే వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఒక్క సమస్య కూడా పట్టించుకోలేదు
మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో కాదు... మండల కేంద్రాలకు కూతవేటు దూరంలో ఉన్న పల్లెల్లో కూడా కనీస ప్రాథమిక సౌకర్యాలైన తాగునీటి సౌకర్యం, రోడ్లు లేవంటే పాతికేళ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఆయన ఏ మాత్రం వెలగబెట్టారో అర్థమవుతుంది.
♦ విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లోని 244 పంచాయతీల పరిధిలోని 105 గ్రామాల్లో సుమారు 25 వేల మంది కొండకుమ్మర్లు స్థానిక గిరిజన సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు, కట్టు, బొట్టు కలిగి తరతరాలుగా నివసిస్తున్నారు. ఆ కొండ కుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేరుస్తానని హామీనిచ్చారు. ఎప్పటికప్పుడు ఆయన ఆ హామీని పట్టించుకోకుండానే వచ్చారు. ఏజెన్సీలోని ప్రధానమైన ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలను కలిపి రవాణ సౌకర్యం కల్పిస్తామని ఇందుకు పెదబయలు, జోలాపుట్టు వద్ద హైలెవెల్ వంతెనలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ జోలాపుట్టు వద్ద వంతెనకు అతీగతీ లేదు. వంతెన నిర్మాణానికి నయాపైసా నిధులు కూడా మంజూరు చేయించలేకపోయారు.
♦ ఇక పెదబయలు వంతెన పనులు మాత్రం ఒడిశా ప్రభుత్వ ప్రోత్సహంతో పనులు ఈ మధ్యనే మొదలయ్యాయి. ఏజెన్సీలో ప్రధాన కూడళ్ల వద్ద బస్ షెల్టర్లు నిర్మిస్తామన్న హామీకి కూడా దిక్కులేకుండా పోయింది. పెద్ద పంచాయతీ కేంద్రాల్లో సామాజిక భవనాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీలు కూడా బుట్టదాఖలయ్యాయి. విజయనగరం జిల్లా పాచిపెంట నుంచి విశాఖపట్నం జిల్లా లోతేరు వరకు రోడ్డు వేస్తామని ఇచ్చిన హామీ కూడా అతీగతీ లేకుండా పోయింది. శ్రీకాకుళం జిల్లాకు ఆనుకొని ఉన్న ఒడిశాలోని గున్‌పూర్ నుంచి విజయనగరం జిల్లా బొబ్బిలి, సాలూరు మీదుగా అరకు రైల్వేలైన్‌ను కలిపి ఖమ్మం జిల్లా కొత్తగూడెం వరకు విస్తరిస్తామని హామీనిచ్చారు. అదే విధంగా అరకు నుంచి పాడేరు మీదుగా నర్సీపట్నం వరకు రైల్వే లైన్లను విస్తరిస్తామని వాగ్దానం చేశారు. కానీ ఈ రైల్వేలైన్లకు సంబంధించి ఇప్పటివరకు సర్వే కూడా చేయించలేకపోయారు.
కొండకుమ్మర్లంతా కలిసి బుద్ధి చెబుతాం
విశాఖ ఏజెన్సీలో బీసీలుగా ఉన్న కొండకుమ్మర్లను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోమార్లు కలిసి మా సమస్యను విన్నవించాం. కానీ కనీసం పట్టించుకోలేదు. అందుకే ఈ ఎన్నికల్లో మా కొండకుమ్మర్లంతా ఆయనకు ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. –అల్లంగి ప్రసాద్, కొండకుమ్మర్ల సంఘం అధ్యక్షుడు, వంతాలగుమ్మి, పాడేరు మండలం
అందుబాటులో ఉండని ఆయన ఎందుకు?
2009 ఎన్నికల్లో చంద్రదేవ్‌ను మా ప్రాంత గిరిజనులంతా ఓట్లేసి గెలిపించాం. ఇక్కడ నుంచి గెలిచిన తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యారు. కానీ మా ప్రాంతానికి ఒక్కసారి కూడా రాలేదు. ఆయన హయంలో ఏ ఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం చేపట్టలేదు. గ్రామాలకు ఎంపీ నిధుల నుంచి కమ్యూనిటీ భవనాలు, బస్ షెల్టర్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏవీ రాలేదు. ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండరు. అలాంటి రాజుగారు మాకు అక్కరలేదని నిర్ణయించుకున్నాం.–పెండెలి రామకృష్ణ, బీయస్సీ, బీఈడీ, తురాయిమెట్ట, పాడేరు మండలం
Comments
Please login to add a commentAdd a comment