సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మనం అడ్డుకుంటే తెలంగాణ ఆగుతుందా?.. పైగా రాష్ట్రాన్ని విభజిస్తున్నది మన పార్టీయే. అధిష్టానాన్ని కాదని నిలబడగలమా?.. అందువల్ల పార్టీ చెప్పినట్లే నడుచుకుందాం.. ఇదీ ప్రస్తుతం జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల భావన. కేంద్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజులు ఎవరి వారు తాము సమైక్యవాదులమేనని ప్రకటించుకుంటున్నా.. పదవులను వదులుకునేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. సమైక్య సెగ కారణంగా పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్న తమ అనుచరులను నిలువరించడం, జిల్లాపైనా.. పార్టీపైనా ఆధిపత్యం సాధించడం.. అన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు
‘ఎన్నడూ లేని విధంగా శ్రీకాకుళంలో నాపై వ్యతిరేకత వచ్చింది. సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్‌కు సీమాంధ్రలో నూకలు చెల్లాయి. ఇప్పుడేం చేద్దాం’.. ఇదీ మాజీ మంత్రికి వచ్చిన ధర్మ సందేహం. ఒక దశలో రాజకీయ సన్యాయం తీసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినా అభిమానులు ఒత్తిడి పేరుతో పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా అంటూనే గత నెల 20న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చినప్పుడు ఆయనకు లంచ్ ఏర్పాటు చేసి తన భక్తిని చాటుకున్నారు. ఇక డీసీసీ అధ్యక్షుడు నర్తు నరేంద్ర యాదవ్ కాంగ్రెస్ జెండాపై నల్లగుడ్డ కప్పారు. కాంగ్రెస్ భూస్థాపితమైందని ప్రకటించేశారు. ఇటువంటి పార్టీలో ఉండేకంటే వెళ్లిపోవడమే మంచిదన్నారు.
డీసీసీ కార్యాలయంలో కేంద్రమంత్రి కృపారాణి ఉండగానే తమ నేత ధర్మాన ప్రసాదరావు చేత ఇందిరకు పూలమాల వేయించేశారు. ఇలా పార్టీలో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం మంత్రులకు ఇరకాటంగా మారింది. అటువంటి వారిని కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు జిల్లా కాంగ్రెస్‌లో అన్నీ తానై వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఆయన స్థానాన్ని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఆమె పరోక్షంగా ధర్మానపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తన ఆధిపత్యాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె వెంట అధికార గణం తప్ప పార్టీ ముఖ్య నాయకులు ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. మరో కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ ఢిల్లీ తప్ప తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇక రాష్ట్ర మంత్రి కోండ్రు మురళీ ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగిన సమావేశంలోనే సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుపై నోరు పారేసుకుని చీవాట్లు తిన్నారు. ఇంకో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సహనం కోల్పోయి జనంలో పలుచన అవుతున్నారు. సమైక్య నినాదంతో అడ్డుకుంటున్న జనాన్ని దూషణలతో మరింత కిర్రెక్కిస్తున్నారు.
తనకు తానే వ్యతిరేకత పెంచుకుంటున్నారు. మంత్రుల పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లివాటంగా వ్యవహరిస్తున్నారు. అవకాశం వస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నా.. వారు చేర్చుకుంటారో లేదోననే సందేహంతో సతమతమవుతున్నారు. ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని తమను తిరిగి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారా? అనే సందేహం వారిని వేధిస్తోంది. ఓటర్లు మాత్రం వారిని ఎప్పుడో వదిలేశారు. ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా రకరకాల ధోరణులు, సమస్యలతో జిల్లా కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. పార్టీ జెండా కాకుండా సొంత ఎజెండాతో ఎవరికి వారు ముందుకు సాగుతున్నారు.