గాంధీభవన్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసినా ఆశావాహులు మాత్రం తమ ఆశలు వదులుకోవడం లేదు. సైదాబాద్ డివిజన్ నుంచి తన కుమార్తెకు టికెట్ ఆశించి భంగపడిన కిషోర్ గౌడ్ అనే వ్యక్తి గురువారం గాంధీభవన్ సాక్షిగా ఆత్మహత్యాయత్నం చేశాడు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న తమకు ఎన్నికల సమయంలో మాత్రం మొండి చేయి చూపిస్తున్నారంటూ మనస్తాపంతో అతడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించాడు. దీంతో గాంధీ భవన్ సిబ్బంది, పోలీసులు అతడిని అడ్డుకుని, అక్కడ నుంచి తరలించారు. తన కూతురు ప్రసన్న గౌడ్‌కు టికెట్ అడిగినా ఫలితం లేకపోయిందని కిశోర్ గౌడ్ ఆవేదన చెందాడు.
మరోవైపు టికెట్ ఆశించిన పలువురు ఇవాళ కూడా గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మల్లు భట్టి విక్రమార్కకు నిరసనల సెగ తగిలింది. ఇష్టానుసారంగా టికెట్లు కేటాయింపు జరిగిందని, ఓ వైపు అభ్యర్థి పేరు ప్రకటించి మరోవైపు చివరి నిముషంలో భీఫామ్‌లు వేరేవాళ్లకు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అసంతృప్తుల నిరసనలతో గత అయిదు రోజులుగా కాంగ్రెస్ నేతలెవరూ గాంధీభవన్ వైపు అడుగు పెట్టడం లేదు.