సీఐ వేధింపులు భరించలేకపోతున్నా
ఆత్మకూరు : ఆత్మకూరు సీఐ కిషోర్‌కుమార్ తనను విపరీతంగా వేధిస్తున్నాడని, ఆయన వేధింపులు భరించలేకపోతున్నానని ఒగ్లాపూర్ ఎంపీటీసీ సభ్యుడు నేరెళ్ల కమలాకర్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ముస్త్యాలపల్లి సర్పంచ్‌గా పనిచేశానని, అలాగే ఇప్పుడు ఇక్కడి ప్రజలు ఎంపీటీసీగా గెలిపించారని అన్నారు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికలో తనను ఎంపీపీగా గెలవకుండా సీఐ కాంగ్రెస్ పార్టీ వారితో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు.
తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయూరు. సీఐ మిత్రుడు బొల్లం లక్ష్మణ్, సీఐతో ప్రాణ భయముందని ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలని కోరారు. తనకు ఎలాంటి నేరచరిత్ర లేదని, తాను భయాందోళనకు గురవుతున్నానని, అవసరమైతే ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తానని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే గ్రామంలో తన భూములు, ఇల్లు అమ్ముకొని వెళ్తానని అన్నారు.
ఎంపీటీసీ ఆరోపణలు అవాస్తవం : సీఐ కిషోర్‌కుమార్
ఈ విషయమై సీఐ కిషోర్‌కుమార్‌ను వివరణ కోరగా తనపై ఒగ్లాపూర్ ఎంపీటీసీ కమలాకర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఒక ప్రజాప్రతినిధిని స్టేషన్‌కు పిలిపించి వేధించాననడం సమంజసం కాదన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సహకరించాననడం కూడా అవాస్తవమేనని కొట్టిపారేశారు.