kite manza thread
-
పండగపూట విషాదం: ప్రాణం తీసిన చైనా మాంజా.. భార్య చూస్తుండగానే..
సాక్షి, గొల్లపల్లి (ధర్మపురి): సంక్రాంతి పండుగ పూట ఆ కుటుంబంలో విషాదం నింపింది.. మృత్యురూపంలో వచ్చిన గాలిపటం మాంజా దారం కుటుంబ పెద్దను కబళించింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మండలం గుంజపడుగుకు చెందిన పస్తం భీమయ్య(45)కు భార్య సారవ్వ, కుమారుడు ప్రవీణ్), కూతురు అక్షయ ఉ న్నారు. వీరు బేడబుడగజంగాల వారు. స్వగ్రామంలో ఇల్లు, భూమి, చేయడానికి పని లేకపోవడంతో బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట మంచిర్యాల జిల్లా వేంపల్లికి వలస వెళ్లారు. భీమయ్య అక్కడ పాత ఇనుప సామగ్రి కొనుగోలు చేసి, విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు పిల్ల లను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఆస్పత్రికి వెళ్తుండగా ఘటన ఉన్నదాంట్లో హాయిగా జీవనం సాగిస్తున్న భీమయ్య కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. అతని కాలికి దెబ్బ తగలడంతో సంక్రాంతి రోజు (శని వారం) మంచిర్యాల పట్టణంలోని ఆస్పత్రికి తన ద్విచక్రవాహనంపై భార్య సారవ్వతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాలిపటం మాంజా దారం భీమయ్య మెడకు చుట్టుకుంది. గట్టిగా బిగుసుకుపోవడంతో గొంతు తెగి, అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లెదుటే భర్త ప్రాణాలు పోవడంతో సారవ్వ రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: (అయ్య బాబోయ్.. రికార్డు స్థాయిలో చికెన్ లాగించేశారు) కంటతడి పెట్టిన స్థానికులు బతుకుదెరువు కోసం మంచిర్యాల జిల్లాకు వెళ్లిన భీమయ్య ఏటా సంక్రాంతికి తన కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామం వచ్చేవాడు. ఈసారి కాలికి దెబ్బ తాకడంతో రాలేదు. పండుగ రోజు ఆస్పత్రికి వెళ్తుంటే చనిపోయాడని తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం ఆదివారం గుంజపడుగు చేరడంతో చూసేందుకు వచ్చిన స్థానికులు కంటతడి పెట్టారు. 2017లో నిషేధం రసాయనాలు పూసిన చైనా మాంజా దారంతో పక్షుల ప్రాణాలు పోతున్నాయని 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా గతంలోనే గాజు పూత పూసిన నైలాన్ లేదా సింథటిక్ చైనా మాంజాను అనుమంతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా ఒకటి నుంచి ఐదేళ్ల జైలుశిక్ష లేదా రూ.లక్ష జరిమానా లేదంటే రెండూ విధించేలా ప్రభుత్వం చట్టం చేసింది. అయిన మాంజా దారం విక్రయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో నిషేధించిన ఈ దారం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో మంచిర్యాల పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
మానవతా దృక్పథంతో వ్యవహరించారు
సాక్షి, హైదరాబాద్ : ఎవరు ఎలా పోతే మాకేంటని పట్టించుకోని కాలమిది. సాటి మనుషులకు ప్రమాదం జరిగినా చూసీచూడనట్టు వెళ్లిపోయే సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. మనుషులకే దిక్కులేని ఈ సమాజంలో ఇక పసుపక్షాదుల సంగతి చెప్పనక్కరలేదు. అందులోనూ కాకి లాంటి పక్షులకు దిక్కుండదు. కానీ, కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఒక కాకిని కాపాడటానికి కొందరు యువకులు చేసిన ప్రయత్నాలు అభినందనీయం. హైదరాబాద్‌లోని సైనిక్‌పురి ప్రాంతంలో ఒక కాకి విద్యుత్ తీగలపై పెనవేసుకుపోయిన పతంగి మాంజాలో చిక్కుకుపోయింది. కాకి కాళ్లకు పెనవేసుకున్న మాంజా నుంచి తప్పించుకోలేక గిలగిలా కొట్టుకుంది. ఒకటికాదు రెండు కాదు. మూడు రోజులుగా అలా కొట్టుకుని నీరసించి ఇంక చేతకాక విద్యుత్ వైర్ల నుంచి కిందకు వేలాడింది. అప్పుడప్పుడు బలం తెచ్చుకుని అరవడం మాత్రం ఆపలేదు. మూడురోజులుగా ఈ తతంగం గమనిస్తున్న స్థానికుల్లో ఒకరు విషయాన్ని నగరంలోని వన్యప్రాణులను సంరక్షించే ఎనిమిల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీకి చేరవేశారు. అంతే, ఆ వారియర్స్ వెంటనే వాలిపోయారక్కడ. ఆ సొసైటీకి చెందిన యువకులు వచ్చి స్థానికంగా అగ్నిమాపక కేంద్రానికి వెళ్లి సహాయాన్ని అర్థించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సానుకూలంగా స్పందించి ఫైరింజన్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకొని కాకిని పరిశీలించి చూడగా అది ప్రాణాలతోనే ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది కాకికి చిక్కుకున్న మంజాను తొలగించి కాకిని పట్టుకుని ఎనిమల్ వారియర్స్ సంస్థకు అందించారు. వారు దానిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని ఒక వస్త్రాన్ని చుట్టి దానిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాకి ప్రాణాలను కాపడానికి అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తున్న స్థానికి ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులను అభినందించారు. ‘పక్కవారికి కష్టం వచ్చినా పట్టించుకోని ఈ కాలంలో ఒక కాకి ప్రాణాల కోసం ఎనిమల్ వారియర్స్ ప్రతినిధులు పడిన తాపత్రయం అభినందనీయం’ అంటూ స్థానిక సీనియర్ న్యాయవాది కే. రాజగోపాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ సంస్థ పెంపుడు జంతువులు, ఇంకా ఇతరత్రా జంతువులు ఆపదలో ఉన్నప్పుడు సాయం అందించడానికి ముందుంటుంది. -
గాలిపటం దారమే.. యమపాశమై
గుంటూరు ఈస్ట్: అమ్మమ్మ ఇంటికెళ్దామని ఎంతో సంతోషంగా తండ్రితో బయల్దేరిన ఆ చిన్నారిని గాలిపటం దారం యమపాశమై పొట్టనపెట్టుకుంది. నాన్నా.. ఈ రోజు స్కూల్‌కి సెలవు.. అమ్మమ్మ ఇంటికెళ్లి ఆడుకుంటా అని కొద్దిసేపటి క్రితం ముద్దులొలుకుతూ చెప్పిన మూడేళ్ల కొడుకు.. గాలిపటం మాంజా చుట్టుకుని తన ఒడిలోనే కళ్లముందే ప్రాణాలు వదలడంతో ఆ తండ్రి కన్నీరుకు అంతేలేదు. గుంటూరు నగరంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గుంటూరు నగరం కాకుమానువారితోట నాలుగో లైన్‌కు చెందిన తలకొండపాటి దుర్గారావు ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. దుర్గారావు దంపతులకు ఆదిత్య(5), కౌశిక్(3)లు సంతానం. సోమవారం పాఠశాలల బంద్ కావడంతో సెలవు ప్రకటించారు. దుర్గారావు ఇద్దరు కొడుకులను అత్తగారింట్లో వదిలిపెట్టేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. పెద్దకుమారుడు ఆదిత్యను ద్విచక్రవాహనం వెనుక.. కౌశిక్‌ను ముందు కూర్చోబెట్టుకున్నాడు. అమ్మమ్మ ఇంటికి చేరకుండానే.. అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన చిన్నారి కౌశిక్ గమ్యం చేరలేదు. మరికొద్ది నిమిషాల్లో అమ్మమ్మ ఇల్లు చేరేలోపే ఎవరో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఎగురవేసిన గాలిపటం దారం ఆ పిల్లవాడి పాలిట యమపాశమైంది. బైక్ లాంచస్టర్ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్దకు చేరేసరికి.. సమీపంలోని పిల్లలు ఎగురవేసిన గాలిపటం దారం కౌశిక్ మెడకు చుట్టుకుంది. వాహనం వేగంగా వెళ్లడం వల్ల కౌశిక్ మెడకు దారం గట్టిగా బిగుసుకుని మెడ కోసుకుపోయింది. కొడుకు గట్టిగా అరవడంతో ఉలిక్కిపడ్డ దుర్గారావు వాహనం ఆపి దారాన్ని తొలగించాడు. స్థానికుల సాయంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని జీజీహెచ్‌కు తరలించగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో కౌశిక్ మృతిచెందాడని వైద్యులు ప్రకటించారు.అమ్మమ్మ ఇంట్లో సరదాగా ఆడుకోవాల్సిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌పై వస్తుంటే ఉరితాడైన మాంజాదారం
అన్నానగర్: గాలిపటానికి కట్టే మాంజాదారం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలుకోల్పోయాడు. బైక్‌పై వెళుతున్న అతడికి తగిలి కిందపడటంతో చనిపోయాడు. చెన్నైలోని తాంబరం మధురవాయల్ బైపాస్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. చెన్నై కొళత్తూరుకి చెందిన శివప్రకాశ్ (40) నీలాంగరైలోని ప్రైవేటు సంస్థలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శివప్రకాశ్ తన తండ్రితో కలసి అగరమ్ తెన్ గ్రామానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా అనకాపుత్తూరు అడయారు బ్రిడ్జి వద్ద గాలిపటాల మంజా దారం తగిలి కింద పడ్డారు. శివప్రకాశ్కు గొంతుకు మాంజాదారం చుట్టుకుపోయి ఊపిరిఆడకపోవడంతోపాటు తీవ్ర గాయాలు అవడంతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. తండ్రి చంద్రశేఖర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న శంకర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని శివప్రకాశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.