నిరసన గళం... గందరగోళం...
ఇల్లెందు, న్యూస్‌లైన్ : ఇల్లెందులో శుక్రవారం మూడోవిడత రచ్చబండ సభ వివిధ పార్టీల ఆందోళనలతో ఆద్యంతం రసాభాసగా మారింది. పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్లో ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య అధ్యక్షతన సభ ప్రారంభమైంది. ఈ సభలో ఒకటి తరువాత ఒకటిగా వరుస ఘటనలు ఇలా జరిగాయి...
వేదిక పైకి ఎమ్మెల్యే రాగానే.. బ్యానర్ నుంచి సీమాంధ్ర సీఎం ఫొటో తొలగించాలని టీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. వారికి డీఎస్పీ కె.కృష్ణ నచ్చచెబుతుండగా... కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాస్యం ప్రమోద్ కుమార్ తదితరులు వేదిక పైకి వెళ్లి సీఎం ఫొటో తొలగించారు.
రచ్చబండ కార్యక్రమ రూపకర్తయిన దివంగత సీఎం వైఎస్సార్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ పులి సైదులు, నాయకులు దొడ్డా డానియేల్, కోండ్రు భద్రయ్య తదితరులు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తొలగించారు.
బయ్యారంలో ఉక్కు, మామిడిగుండాలలో ల్యాటరైట్ పరిశ్రమ నెలకొల్పాలని; తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని, ఇల్లెందులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, మార్కెట్‌ను తెరిపించాలని, గత రెండు రచ్చబండల్లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరించారో లెక్క చెప్పాలని తదితర డిమాండ్లతో న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ఎన్.రాజు, పట్టణ కార్యదర్శి టి.నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు చేపట్టిన ఆందోళ న ఉద్రిక్తంగా మారింది. నాయకులపై ఒకానొక దశలో పోలీసులు చేయి చేసుకున్నారు. దీనిని నిరసిస్తూ సభావేదిక ముందు న్యూడెమోక్రసీ నాయకులు బైఠాయించారు. వారిని తొలగించేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నాయకులు తూలి కింద పడిపోయారు.
కౌంటర్లలో ఇచ్చిన అర్జీలకు రసీదులు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసలు అడ్డుకున్నారు.
ఇల్లెందు సింగరేణి 21 ఏరియా కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ సర్పంచ్ ఎస్.పార్వతి, ఉప సర్పంచ్ రెంటాల లక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షుడు ఆవుల కిరణ్ ఆధ్వర్యంలో స్థానికులు సభావేదిక ముందు బైఠాయించారు. సమస్యలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో చర్చిద్దాంటూ వారిని ఎమ్మెలే ఊకె అబ్బయ్య శాంతింపచేశారు.
తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అర్హులైన పోడు భూములకు పట్టాలివ్వాలని, మామిడిగుండాలలో ల్యాటరైట్ పరిశ్రమను ప్రభుత్వం నెలకొల్పాలని, ఇల్లెందుకు బస్ డిపో మంజూరు చేయాలని, ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, నాయకులు దేవులపల్లి యాకయ్య, నబీ తదితరులు ఆందోళనకు దిగారు.
మున్నూరు కాపు కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ సంఘం నాయకులు పులి సైదులు, పోషం వెంకటేశ్వర్లు, పాలెపు ఆనంద్, సతీష్ తదితరులు ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు తొలగించారు.
చివరిగా, ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ.. బస్ డిపో ఏర్పాటు, మామిడిగుండాల సీలింగ్ భూములు, పోడు భూములకు హక్కులు, ల్యాటరైట్ ఖనిజ పరిశ్రమ ఏర్పాటు తదితరాంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్టు చెప్పారు. భద్రాచలం తెలంగాణలో భాగమేనంటూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.