ఎలాంటి వివక్ష లేదు..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపడం లేదని.. వివిధ రూపాల్లో రాష్ట్రానికి గణనీయంగా నిధులు అందాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మోదీ అన్ని రాష్ట్రాలకూ ప్రధానమంత్రి అని, ఏ రాష్ట్రానికీ తక్కువ నిధులు ఇవ్వలేదని చెప్పారు. కొన్ని రంగాలు, పథకాలు, కేటాయింపులను పరిశీలిస్తే.. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకే అధిక కేటాయింపులు దక్కాయన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో గుజరాత్ కన్నా తెలంగాణకే ఎక్కువ నిధులు కేటాయించారని చెప్పారు.
తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేంద్రం అనేక విధాలుగా సహకారాన్ని అందిస్తోందన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో.. గత తొమ్మిదేళ్లలో తెలంగాణకు వివిధ శాఖలు, రంగాలవారీగా వివిధ రూపాల్లో అందజేసిన నిధులు, రుణాలు, వివిధ సంస్థలకు చేసిన కేటాయింపుల వివరాలను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు ‘రిపోర్ట్ టు పీపుల్’ పేరిట వీడియోతోపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రభుత్వానికో, పార్టీకో వ్యతిరేకం కాదు
తనది రాజకీయ పార్టీ కార్యక్రమమో, ఒక ప్రభుత్వానికో, పార్టీకో వ్యతిరేకంగా ఇచ్చిన ప్రజెంటేషనో కాదని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశ్యమని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను అధికారిక డాక్యుమెంట్ల ద్వారా రాష్ట్ర ప్రజల పరిశీలనకోసం అందుబాటులో ఉంచుతున్నట్టు వివరించారు. కేంద్రం ఇంత చేస్తున్నా ఏమీ చేయడం లేదంటూ రాష్ట్రంలో కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు అండగా నిలుస్తామన్నారు.
కిషన్‌రెడ్డి ప్రజెంటేషన్‌లో పేర్కొన్న గణాంకాలివీ..
► కేంద్రం తెలంగాణకు పన్నుల వాటా రూపంలో ఇచ్చిన నిధులు రూ.1.78 లక్షల కోట్లు
► కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో చేసిన ఖర్చు రూ.4.99 లక్షల కోట్లు
► వేస్ అండ్ మీన్స్ అలవెన్సులు, ఓడీలు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి అనేక సార్లు ఆర్బీఐ అందించిన సహకారం రూ.2.31 లక్షల కోట్లు
► తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం కేంద్రం చేసిన ఖర్చు (ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతుధర వంటివి) రూ.1.58 లక్షల కోట్లు
► 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి పరిహారంగా అందినది రూ.8,379 కోట్లు. 2020–22 మధ్య (కరోనా కాలంలో) ఇచ్చిన రూ.6,950 కోట్ల రుణం (దీనిని కేంద్రమే భరిస్తుంది) కూడా కలిపితే రూ.15,329 కోట్లు.
► కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా 2014 నుంచి రాష్ట్రానికి వివిధ పథకాలు, అభివృద్ధి పనుల రూపంలో కేటాయించిన/విడుదలైన నిధులు సుమారు రూ.5లక్షల కోట్లు.
► 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు.. కేంద్రం, దాని ఆధ్వర్యంలోని సంస్థలు, పీఎస్‌యూల ద్వారా అందిన రుణాల మొత్తం (బడ్జెటేతర రుణాలతో సహా) దాదాపు రూ 7.5 లక్షల కోట్లు.
► రాష్ట్ర ప్రజలకు, వివిధ వర్గాలకు కేంద్రం ద్వారా అందించిన రుణాలు దాదాపు రూ.9.26 లక్షల కోట్లు
సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ.నాగేశ్వర్. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
వివిధ రంగాల వారీగా కేటాయింపులు/నిధులు
మౌలిక సదుపాయాల కల్పనకు..
– తెలంగాణలో 1947– 2014 మధ్య నిర్మించిన జాతీయ రహదారులకు సమానంగా గత తొమ్మిదేళ్లలోనే మోదీ ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారులను నిర్మించింది.
– రోడ్ల కోసం చేసిన ఖర్చు రూ.1.08 లక్షల కోట్లు (2014–2022 మధ్య నిర్మించిన రోడ్ల పొడవు 2,500 కి.మీ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్లు 2,269 కి.మీ).
– హైదరాబాద్ రీజనల్ రింగ్‌రోడ్డు (348 కి.మీ) అంచనా వ్యయం రూ.21,201 కోట్లు
– రైల్వే లైన్లు, ప్రాజెక్టులకు రూ.32,823 కోట్లు
– విద్యుత్, నీటిపారుదల కోసం రూ.23,937 కోట్లు
– గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాల కోసం రూ.34,090 కోట్లు
– ఐటీ, డిజిటలీకరణకు రూ.7,479 కోట్లు
రంగాలు, సంక్షేమ పథకాలకు..
– వ్యవసాయం, అనుబంధరంగాలు, పశు సంవర్థక, మత్స్యపరిశ్రమకు రూ.40,559 కోట్లు
– రసాయనాలు, ఎరువులకు రూ.39,649 కోట్లు
– ఆరోగ్యం, పారిశుధ్యం కోసం రూ.14,572 కోట్లు
– జీవనోపాధి, కరోనా సమయంలో మద్దతు కింద రూ.38,256 కోట్లు
– అడవులు, పర్యావరణం కోసం రూ.3,205 కోట్లు
మానవాభివృద్ధి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వం కోసం
– విద్య, క్రీడలకు రూ.18,657 కోట్లు
– మహిళాశిశు సంక్షేమానికి రూ.8,031 కోట్లు
– ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి రూ.2,802 కోట్లు
– మైనారిటీలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి రూ.1,568 కోట్లు
కేంద్ర శాఖల ఆధ్వర్యంలో ఖర్చు
– రక్షణశాఖ నుంచి రూ.1.15 లక్షల కోట్లు, హోంశాఖ రూ.6,218 కోట్లు తెలంగాణలో వ్యయం
– కేంద్రం తెలంగాణలో ఉన్న రక్షణ రంగ సంస్థలకు రూ.78 వేల కోట్లు ఇచ్చింది. 5 వేల మందికి ఉద్యోగాలు లభించాయి.
తెలంగాణ అప్పుల గణాంకాలివీ..
– రాష్ట్రం మొత్తంగా తీసుకున్న అప్పులు: రూ. 7,49,982 కోట్లు
– పీఎఫ్సీ ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో టాప్ తెలంగాణ
– నాబార్డ్ ద్వారా రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో 5వ స్థానం.. తిరిగి చెల్లించాల్సిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్
– ఆర్ఈసీ ద్వారా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్
– వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులు 1.31 లక్షల కోట్లు