Konaseema Thugs Movie
-
Konaseema Thugs Review: కోనసీమ థగ్స్ మూవీ రివ్యూ
టైటిల్ : కోనసీమ థగ్స్ నటీనటులు: హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునీష్ కాంత్, అనస్వర రాజన్, శరత్ అప్పని మరియు తదితరులు నిర్మాణ సంస్థ: హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు దర్శకత్వం: బృంద సంగీతం: శామ్ సి ఎస్ సినిమాటోగ్రఫీ: ప్రీయేష్ గురుస్వామి ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ విడుదల తేది: ఫిబ్రవరి 24, 2023 ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘థగ్స్’. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శేషు(హృదు హరూన్) ఒక అనాధ. కాకినాడ రౌడీ పెద్దిరెడ్డి దగ్గర పని చేస్తుంటాడు. అక్కడే ఓ అనాధాశ్రయంలో ఉంటున్న మూగ అమ్మాయి కోయిల(అనస్వర రాజన్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకున్న సమయంలో ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. కాకినాడ జైలులో దొర(బాబీ సింహ), మధు(మునీష్ కాంత్)తో పాటు రకరకాల మనుషులు పరిచయం అవుతారు. వీరందరితో కలిసి జైలు నుంచి పారిపోవడానికి శేషు ఒక ప్లాన్ వేస్తాడు. జైలు గదిలో సొరంగం తవ్వి దాని గుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తారు? పోలీసుల కళ్లుకప్పి సొరంగం ఎలా తవ్వారు? చివరికి వాళ్లు తప్పించుకున్నారా? లేక దొరికిపోయారా? అసలు శేషు ఒకరిని ఎందుకు హత్య చేశారు? జైలు సిబ్బంది శేషుని ఎందుకు చంపాలనుకుంటుంది? కోయిల, శేషు కలిశారా లేదా? వీరికి చిట్టి ఎలాంటి సహాయం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాలలో ఒక్క పాయింట్ చుట్టే కథ తిరుగుతుంది. చెప్పుకోవడానికి కథ కూడా పెద్దగా ఉండదు. కానీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. ఆ కోవలోకే కోనసీమ థగ్స్ మూవీ వస్తుంది. ఈ మూవీ కథంతా జైలులోనే.. కొద్ది మంది పాత్రల చుట్టే తిరుగుతుంది. ఒక క్రూరమైన వాతావరణం ఉండే జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో వేసే ఎత్తులు.. అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే పరిస్తితులతో ఆద్యంతం ఆసక్తికరంగా కథను తీర్చిదిద్దారు దర్శకురాలు బృందా గోపాల్. కథను నిదానంగా ప్రారంభించి, ప్రేక్షకులు అయోమయానికి గురికాకుండా నేరేట్ చేయడంలో దర్శకురాలు సఫలం అయ్యారు. అయితే శేషు లవ్‌స్టోరీతో పాటు దొర(బాబీ సింహా) ఎందుకు జైలులో పడ్డారో ప్రేక్షకులకు తెలియడం మినహా ఫస్టాఫ్‌లో ఏమీ ఉండదు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎస్కేప్ ప్లాన్‌తో విరామానికి ముందు మాత్రమే కథ వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. జైలు నుంచి పారిపోవడానికి హీరో చేసే ప్రతి ప్రయత్నం సినిమాటిక్‌గా కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కామెడీ, రొమాన్స్ ఉన్నప్పటికీ కథను తప్పుదోవ పట్టించకుండా బృందా రాసుకున్న స్క్రీన్‌ప్లే బాగుంది. యాక్షన్స్ సీన్స్ కూడా చాలా రియలిస్ట్‌గా ఉంటాయి. ఫస్టాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి, తెలుగు టైటిల్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోస్థాయిలో ఉండేది. ఎవరెలా చేశారంటే.. హీరో హ్రిదు హరూన్‌కి ఇది తొలి సినిమా. అయినా కూడా ఎలాంటి బెణుకు లేకుండా చక్కగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు కానీ యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. హీరోగా దొర పాత్రలో బాబీ సింహా జీవించేశాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. డైలాగ్స్ పెద్దగా లేకున్నా.. బాబీ పాత్ర మాత్రం సినిమాకు ప్లస్ అయింది. ఇక కోయిల పాత్రకు అనస్వర రాజన్ న్యాయం చేసింది. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నవ్వించింది. దొంగతనం కేసులో జైలుకు వచ్చిన మధుగా మునీష్ కాంత్ తనదైన కామెడీతో నవ్వించాడు. శరత్ అప్పనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. శామ్ సి ఎస్ సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనీ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఈ వారం థియేటర్స్‌లో చిన్న చిత్రాలు..ఓటీటీలో బ్లాక్ బస్టర్స్
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సంక్రాంతి పండగా కారణంగా జనవరిలో అన్ని పెద్ద చిత్రాలే విడుదలయ్యాయి. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఫిబ్రవరి నెలలో వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే వాటిలో రైటర్ పద్మభూషన్.. సార్, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకోగా.. పెద్ద చిత్రాలుగా వచ్చిన అమిగోస్, మైఖేల్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ నెల చివరి వారంలో థియేటర్స్ సందడి చేసేందుకు చిన్న చిత్రాలు రెడీ అయితే.. ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలపై ఓ లుక్కేద్దాం. మిస్టర్ కింగ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నటుడు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. దివంగత దర్శకురాలు విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ హీరోగా శశిధ్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. యశ్విక నిష్కల, ఊర్వి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోససీమ థగ్స్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ తమిళ చిత్రం ‘థగ్స్’. హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రంజన్ కీ రోల్స్ చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగులో ‘కోనసీమ థగ్స్’పేరుతో ఈ చిత్రం రిలీజ్ రాబోతుంది. డెడ్‌లైన్ అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డెడ్ లైన్. బొమ్మారెడ్డి.వి.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న పెద్ద చిత్రాలు వారసుడు తమిళస్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదలై భారీ విజయం సాధించింది. ది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 23నుంచి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్‌లో వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ కానుంది. మైఖేల్ సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో అనుకున్న సమయానికంటే ముందే ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేస్తుంది. ఫిబ్రవరి 24 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించగా, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
ఆకట్టుకుంటున్న కాల భైరవ ‘వీర శూర మహంకాళి’ సాంగ్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో పాన్ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత శిబు తమీన్స్ కుమార్తే రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్ డ్రాప్ లో ఈ పాటను రోమంచితంగా చిత్రీకరించారు. ‘వీర శూర మహంకాళి వస్తోందయ్యా... వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా... ’అంటూ సాగే ఈ పాట కీలక సన్నివేశంలో రానుందని చిత్ర బృందం పేర్కొంది. . అమ్మవారు పూనినట్లుగా హృదు చేసిన నృత్యం, డాన్స్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటాయి. శామ్ సి ఎస్ అమ్మ ఉగ్ర రూపాన్ని ఎలివేట్ చేసే ఎనర్జిటిక్ ట్యూన్ ఇవ్వగా వనమాలి చెడును అంతమొందించే క్రోధాన్ని తెలిసేలా లిరిక్స్ అందించారు. కాలభైరవ తన గాత్రంతో పాటను మరింత రోమాంచితంగా ఆలపించారు