చెల్లితో కలిసే బావ హత్య!
నయీమ్ ఘాతుకాలకు పరాకాష్ట ఇది
♦ ఆ దారుణానికి సహకరించిన తల్లి, భార్య
♦ పాలమూరు జిల్లా కొత్తూర్ శివార్లలో మృతదేహం కాల్చివేత
♦ పోలీసుల విచారణలో వెల్లడవుతున్న దారుణాలు
♦ దర్యాప్తు వేగవంతం చేసిన బృందాలు
సాక్షి, హైదరాబాద్:
గ్యాంగ్‌స్టర్ నయీమ్ మాత్రమే కాదు అతడి కుటుంబీకులు కూడా పైశాచికత్వంలో ఏమాత్రం తీసిపోలేదు. నయీమ్ తన బావ నదీం అలియాస్ కొండా విజయ్‌కుమార్‌ను హత్య చేసినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. నదీం భార్య అయిన తన సోదరితో కలిసే నయీమ్ అతడిని చంపేసినట్లు తెలిసింది. అంతేకాదు ఈ ఘాతుకానికి నయీమ్ తల్లి తాహెరా, భార్య హసీనా సహకరించారని వెల్లడైంది. నయీమ్ దారుణాలను చూడలేక దూరంగా వెళ్లిపోదామంటూ భార్యతో చెప్పడమే నదీం పాలిట శాపమైంది. నయీమ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు అతడు చేసిన దారుణాలకు సంబంధించిన ఆధారాల సేకరణపై దృష్టి పెట్టాయి. నయీమ్ సోదరి సలీమా మొదటి భర్త ప్రమాదంలో మరణించాడు.
నయీమ్ అనుచరుడైన నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన విజయ్‌కుమార్.. నదీంగా మారి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో నయీమ్ తన భార్య హసీనా, తల్లి తాహెరా, సోదరి సలీమా, నదీమ్ తదితరులతో కలసి గగన్‌పహాడ్ ప్రాంతంలోని పప్పుహౌస్ అనే ఇంట్లో ఉండేవారు. అప్పటికే నేరచరిత్ర కలిగిన నదీమ్ సైతం నయీమ్ చేస్తున్న దారుణాలను చూసి భరించలేకపోయాడు. ఆ గ్యాంగ్‌కు దూరంగా వెళ్లి బతుకుదామని భార్య సలీమాతో చెప్పాడు. ఈ విషయాన్ని సలీమా తన తల్లికి, నయీమ్‌కు చెప్పేసింది. దీంతో సుదీర్ఘకాలం తన డ్రైవర్‌గా పనిచేసిన నదీం బయటకెళ్లిపోతే తన గుట్టుమట్లు బయటకొచ్చే ఆస్కారముందని భావించిన నయీమ్... అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఓ రోజు రాత్రి పప్పుహౌస్లోని తన బెడ్రూమ్లోకి నదీంను పిలిచి దాడి చేశాడు. తన భార్య హసీనా మెడలోని చున్నీ తీసి నదీం మెడకు ఉరి బిగించాడు. తల్లిని బెడ్రూమ్ బయట కాపలా ఉంచగా.. లోపల నయీమ్ భార్య హసీనా, సోదరి సలీమా రెండువైపులా చున్నీని గట్టిగా లాగి నదీమ్‌ను చంపేశారు. నయీమ్ ఆ తర్వాత ఫర్హానా, నస్రీన్, కరీనా, సదా, తాహెర్, డ్రైవర్ కిశోర్‌లతో కలసి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పెట్రోల్ పోసి దహనం చేశారు. అది జరిగిన ఏడాదికి నయీమ్ తన మకాంను నెక్నాంపూర్‌కు మార్చాడు.
పని పిల్లపై దాడి చేసి హత్య..
నస్రీన్ అనే 15 ఏళ్ల బాలికను నయీమ్ తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఓ రోజు ఆమె తమ మాట వినలేదనే ఆగ్రహంతో హసీనా, సలీమా, తాహెరా తీవ్రంగా దూషించడంతో ఏడుస్తూ కూర్చుంది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన నయీమ్‌కు అతడి మేనకోడలు తనియా జరిగిన విషయం చెప్పింది. ఇంట్లోంచి వెళ్లిపోతానని నస్రీన్ అంటోందనీ పేర్కొంది. దీంతో ఆగ్రహించిన నయీమ్ బలమైన కర్రతో నస్రీన్‌ను విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెకు హసీనా ద్వారా నిద్ర మాత్రలు వేయించాడు. తర్వాత కుటుంబీకులంతా ఓ ఫంక్షన్‌కు వెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు గుర్తించి.. నయీమ్, డ్రైవర్ కిషోర్, తాహెర్‌లు మృతదేహాన్ని కార్లో తీసుకెళ్లిపోయారు. ఆ మృతదేహం ఏమైందనేది కిషోర్, తాహెర్‌లు చిక్కితేనే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.
మాట వినకుంటే మిరపకాయల రసం
నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాలికల్ని తీసుకువచ్చే నయీమ్.. వారితో పనులు చేయించుకోవడంతో పాటు చిత్రహింసలు పెట్టేవాడు. నయీమ్ గదిలోకి వెళ్లే బాలికలకు నీలి చిత్రాలు, అశ్లీల ఫొటోలు చూపించేవాడు. తనతో అదే విధంగా ప్రవర్తించాలంటూ హింసించేవాడు. ఎవరైనా తన మాట వినకుంటే పచ్చిమిరపకాయల రసాన్ని తాగించేవాడు. ఆ మంట తాళలేక వారు ఆర్తనాదాలు చేస్తుంటే పైశాచికానందం పొందేవాడు. బాలికలను నయీమ్ గదిలోకి అతడి భార్య, తల్లి పంపేవారని తెలియడంతో పోలీసులే అవాక్కవుతున్నారు.