వెల్లి‘విరి’సిన భక్తి పారవశ్యం
సద్ధర్మాచరణే భక్తి
కొబ్బరికాయ కొట్టడమే భక్తికి గుర్తు కాదని, సద్ధర్మాచరణ ముఖ్యమని ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. ఆమె పేరిట ఉన్న ట్రస్ట్ తరఫున అన్నమయ్య పూలరథం తిరుమలకు తరలిన సందర్భంగా సోమవారం ఆమె రాజమండ్రి వచ్చారు.
రాజమండ్రి కల్చరల్ : తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి పుష్పకైంకర్యసేవలో వినియోగానికి కొండవీటి జ్యోతిర్మయి ట్రస్టు ఆధ్వర్యంలో భక్తుల నుంచి సేకరించిన పూలతో అన్నమయ్య రథం సోమవారం తిరుమలకు కదిలింది. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులోని దాట్ల సుభద్రాయమ్మ కళాప్రాంగణం నుంచి సుమారు 3 టన్నుల పూలతో రథం పయనమైంది. ట్రస్టు వ్యవస్థాపకురాలు కొండవీటి జ్యోతిర్మయి రథాన్ని ప్రారంభించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. అనంతరం భక్తులనుద్దేశించి జ్యోతిర్మయి మాట్లాడారు. సద్ధర్మ ఆచరణ లేని పూజ వ్యర్థమని పేర్కొన్నారు.
నగర ప్రముఖుడు దాట్ల బుచ్చివెంకటపతిరాజు, జ్యోతిర్మయి తదితరులు రథానికి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. మేళతాళాల మధ్య రథం కదలగా పెద్ద సంఖ్యలో భక్తులు అనుసరించారు. మహిళలు గోవిందనామాలను ఆలపించారు. రథం ముందు కళాకారులు ప్రదర్శించిన కోలాటం అలరించింది. జ్యోతిర్మయి కీర్తనలను ఆలపించారు. కళాప్రాంగణం నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రదక్షిణ మార్గంలో రథం పయనించి, తిరుమలకు పయనమైంది. ఆదిత్య విద్యాసంస్థల డెరైక్టర్ ఎస్.పి.గంగిరెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జి.నాగేశ్వరరావు, ట్రస్టు నగర శాఖ కన్వీనర్ పీవీఎస్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వేంకటేశ్వర ఆలయ సందర్శన
స్థానిక ఎస్.వి.జనరల్ మార్కెట్లోని శ్రీ భూసమేత శ్రీవేంకటేశ్వరాలయాన్ని సోమవారం ఉదయం కొండవీటి జ్యోతిర్మయి దర్శించారు. స్వామిని ప్రస్తుతిస్తూ కీర్తనలను ఆలపించారు. అర్చకుడు సంతోషంగా ఉంటేనే ఆలయం శోభిస్తుందని తెలిపారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు జ్యోతిర్మయికి స్వాగతం పలికారు.
‘భక్తి అంటే కొబ్బరి కాయ కొట్టడం కాదు’
భక్తి అంటే కేవలం కొబ్బరికాయ కొట్టడమే కాదని గురు కొండవీటి జ్యోతిర్మయి ట్రస్టు వ్యవస్థాపకురాలు, ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు, సోమవారం నగరానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. భక్తి అంటే పూజలు చేయడం ఒక్కటే కాదని, సద్ధర్మ ఆచరణ కూడా ఉండాలని చెప్పారు. సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు సామాజిక వాతావరణం, టీవీలు, సినిమాలు ఇతరత్రా కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ట్రస్టు తరఫున ‘నేను, నా ఊరు’ పేరిట ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలను చైతన్యపరచాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 100 గ్రామాల్లోని పర్యటించి ప్రజల ను చైతన్యపరిచామని, దురలవాట్లను మాన్పి ంచి, భక్తిమార్గం వైపు వారిని మళ్లించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. తమ కృషి వల్ల కొందరు మద్యం మానేశారని, ఆధ్యాత్మి కతవైపు అడుగులు వేశారని చెప్పారు.