Koneru Humpy
-
రన్నరప్ హంపి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అద్భుతమైన ఎత్తులతో ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ... భారత చెస్ స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. గురువారం ముగిసిన మహిళల ర్యాపిడ్ ఈవెంట్లో కోనేరు హంపి విజేతను నిర్ణయించిన ‘ప్లే ఆఫ్’ టైబ్రేక్స్‌లో 1.5–2.5 పాయింట్ల తేడాతో అనస్తాసియా బొద్నారుక్ (రష్యా) చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకుంది. ఒత్తిడిలో సంయమనంతో ఆడిన అనస్తాసియా తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీ చరిత్రలో హంపికిది మూడో పతకం కావడం విశేషం. 2019లో విశ్వవిజేతగా నిలిచిన హంపి 2012లో కాంస్య పతకం సాధించింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత బొద్నారుక్, హంపి, టింగ్జె లె (చైనా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా బొద్నారుక్, హంపి తొలి రెండు స్థానాల్లో నిలవడంతో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ నిర్వహించారు. బ్లిట్జ్ పద్ధతిలో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 56 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో హంపి 38 ఎత్తుల్లో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో తదుపరి గేమ్‌లో గెలిచిన ప్లేయర్‌కు టైటిల్ ఖరారు చేసే ‘సడన్‌డెత్’ గేమ్‌ను నిర్వహించారు. అయితే ఈ గేమ్ 52 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అయితే నాలుగో గేమ్‌లో బొద్నారుక్ 39 ఎత్తుల్లో హంపిపై గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు నూతక్కి ప్రియాంక, సాహితి వర్షిణి 7 పాయింట్లతో వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు. 13 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ 9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద 9 పాయింట్లతో 8వ స్థానంలో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 10 పాయింట్లతో మరోసారి ప్రపంచ చాంపియన్ అయ్యాడు. -
సీఎం జగన్‌ను కలిసిన ఏషియన్ గేమ్స్ క్రీడాకారులు
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి.. సీఎం జగన్‌ను ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కలిశారు. క్రీడాకారుల్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దగ్గరుండి సీఎం జగన్‌కు కలిపించారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలను విజేతలు సీఎం జగన్‌కు చూపించారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం రూ. 4.29 కోట్లను క్రీడాకారులకు ప్రభుత్వం అందించింది. ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్ -
మూడో ర్యాంక్‌లో హంపి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 2,577 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. రెండేళ్ల విరామం తర్వాత... ఇటీవల రష్యాలో జరిగిన గ్రాండ్‌ప్రి టోరీ్నలో పాల్గొన్న హంపి విజేతగా నిలిచి 17 రేటింగ్ పాయింట్లను సంపాదించింది. హు ఇఫాన్ (చైనా–2,659) టాప్ ర్యాంక్‌లో... ప్రపంచ చాంపియన్ జూ వెన్ జున్ (చైనా–2,586) రెండో స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హారిక 2,495 రేటింగ్ పాయింట్లతో 13వ ర్యాంక్‌లో ఉంది. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2,748) 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
హంపికి రెండో విజయం
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి రెండో విజయం సాధించింది. తాతియానా కొసింత్సెవా (రష్యా)తో సోమవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో హంపి 60 ఎత్తుల్లో గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకుంది. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌ను హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఏడో రౌండ్ తర్వాత హంపి ఖాతాలో మూడు, హారిక ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. మంగళవారం జరిగే ఎనిమిదో రౌండ్లో అనా ఉషెనినాతో హంపి; చెన్ జూ (ఖతార్)తో హారిక తలపడతారు. -
ఆధిక్యంలో హంపి
తాష్కెంట్: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆధిక్యంలో కొనసాగుతోంది. కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్)తో శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హంపి 23 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. జూ వెన్జున్ (చైనా)తో జరిగిన గేమ్‌ను హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసింది. నాలుగో రౌండ్ తర్వాత హంపి మూడున్నర పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉండగా... మూడు పాయింట్లతో హారిక రెండో స్థానంలో ఉంది. ఆదివారం విశ్రాంతి దినం. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ ఈనెల 30న ముగుస్తుంది.