Konkana Sen Sharma
-
అపర్ణ సినీ ప్రపూర్ణ
తండ్రి సినిమా క్రిటిక్, తల్లి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ దంపతుల పదేళ్ల కూతురు..ఓ రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ..‘‘అమ్మా నేను భవిష్యత్‌లో మంచి నటిని కాబోతున్నాను’ అని చెప్పింది. తల్లిదండ్రులు ఇద్దరూ సినీపరిశ్రమతో సంబంధాలు ఉన్నవారే అయినప్పటికీ తమ చిన్నారి చెప్పిన బుజ్జిబుజ్జి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అ చిన్నారి పదహారేళ్లకే సత్యజీత్ రే సినిమాలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు ఆరంభమైన అపర్ణాసేన్ ప్రయాణం నటిగా, దర్శకురాలిగా, స్క్రీన్ రైటర్‌గా... ఎడిటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే పాపులర్ వ్యక్తుల జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ‘ద రేపిస్ట్’ సినిమా తీసి ప్రతిష్టాత్మక ‘కిమ్ జిసెక్’ పురస్కారాన్ని అపర్ణ గెలుచుకున్నారు. అనేక అంతర్జాతీయ చిత్రాలతో పోటీ పడి ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును దక్కించుకోవడం విశేషం. కుమార్తె కొంకణసేన్ శర్మతో అపర్ణాసేన్ అప్పటి కలకత్తాలోని బెంగాలీ దంపతులు చిదానంద్ దాస్‌గుప్తా, సుప్రియ దాస్‌గుప్తాలకు 1945లో అక్టోబర్ 25న అపర్ణ జని్మంచింది. ఆమె బాల్యం అంతా కలకత్తాలోనే గడిచింది. బిఏ(ఇంగ్లిష్) డిగ్రీ పూర్తిచేసింది. 1961లో మ్యాగ్నమ్ ఫోటోగ్రాఫర్ బ్రేయిన్ బ్రాకేను కలిసిన అపర్ణ అతను తీస్తోన్న మాన్సూన్ సీరిస్‌లో నటించింది. పదహారేళ్లకే మోడల్‌గా మారిన అపర్ణ ..ఈ అనుభవంతో సత్యజీత్రే నిర్మించిన తీన్ కన్యలో మూడో భాగం ‘సమాప్తి’ లో నటించింది. ఈ సినిమాలో అపర్ణాకు మంచి గుర్తింపు లభించింది. మరోపక్క తన చదువును కొనసాగిస్తూనే కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ బిఏ(ఇంగ్లిష్) చదివింది. సమాప్తి తర్వాత ‘బక్సాబాదరల్’, ‘ఆకాశ్ కుసుమ్’లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేదు. తరువాత నటించిన ‘అపరాజితో’ మంచి కమర్షియల్ హిట్‌ను అందించింది. ఒక పక్క సినిమా, మరోపక్క థియేటర్లలో నటిస్తూ సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తరువాత సత్యజీత్ రే నిర్మించిన అనేక సినిమాల్లో నటించింది. రేకు వారసురాలిగా.. అపర్ణ తండ్రి సత్యజిత్ రేలు మంచి స్నేహితులు కావడం, వల్ల రేకు సన్నిహితంగా పెరిగిన అపర్ణ ...తన మొదటి సినిమా కూడా రే దర్శకత్వం వహించడంతో..ఆయనను ఆదర్శంగా తీసుకుని ఆయనలా విభిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. రాజకీయాలు, వివిధ రకాల మానవ సంబంధాలపై అపర్ణా అనేక సినిమాలు నిర్మించారు. 1981లో విడుదలైన ‘36 చౌరంగీ లేన్’ అనే ఇంగ్లిష్ సినిమాతో అపర్ణాకు రచయితగా, డైరెక్టర్‌గా గుర్తింపు లభించింది. అపర్ణ సిని పరిశ్రమకు చేసిన కృషికి గాను 1986లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బెస్ట్ డైరెక్టర్ నేషనల్ అవార్డులను అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జ్యూరీగా వ్యవహరించడమేగాక అనేక లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డులను అందుకున్నారు. 2009లో ‘అంతహీన్’ లో నటించగా ..ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ లుకింగ్ ఉమెన్.. బెస్ట్ లుకింగ్ ఇండియన్ ఉమెన్ జాబితాలో నిలిచిన అపర్ణ..నటిగా, దర్శకురాలిగా ఎదిగినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదుడుకులకు లోనయ్యారు. అయినప్పటికీ తన ఇద్దరు కూతుర్లు, మనవ సంతానంతో ఆమె ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్లో బాగా పాపులర్ అయిన మహిళా మ్యాగజీన్ ‘సనంద’కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాగజీన్ లో సామాజిక సమస్యలపై ఆమె ఎడిటోరియల్స్ రాస్తున్నారు. ద రేపిస్ట్.. ఈ సినిమాను పదిహేనేళ్ల క్రితమే తియ్యాలని అపర్ణాసేన్ అనుకుంది. ఆ తరువాత భారత్‌లో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను గమనిస్తూ ఉండేది. ఎవరూ కూడా పుట్టుకతో రేపిస్ట్ కారు. చిన్నప్పుడు అమాయకంగా ఉండే అబ్బాయిలు యవ్వనంలోకి వచ్చాక వారిలో ఎందుకు అత్యాచార మనస్తత్వం ఏర్పడుతుంది? రేపిస్ట్‌గా ఎలా మారుతున్నారు? ఇది కేవలం సమాజంలో ఉన్న అసమానతలు, లేదా జన్యువుల వల్ల జరుగుతోందా? ఇటువంటి ప్రశ్నలు అపర్ణ మనసులో మెదిలాయి. కానీ వేటికీ జవాబు దొరకలేదు. వీటన్నింటికి జవాబులు అన్వేషించే క్రమంలోనే ‘ద రేపిస్ట్’ సినిమా తీశారు. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో పుస్తకాలు చదివారు, అనేక మంది లాయర్లు, ఫెమినిస్టులు, స్నేహితులతో కలిసి చర్చించి తన కూతురు, ప్రముఖ నటి కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రధారిగా సినిమాను తీశారు. ఇప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా తీయడం, దానికి అంతర్జాతీయ అవార్డు వరించడంతో..75 ఏళ్ల వయసులోనూ తన ప్రతిభను నిరూపించుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఇండియన్ మూవీకి ఇంటర్నేషనల్ అవార్డు
జాతీయ అవార్డు గ్రహీత అపర్ణసేన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ది రేపిస్ట్’ 26వ బూసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న ‘ఏ విండో ఆఫ్ ఏషియన్ సినిమా’ విభాగంలో ప్రదర్శించగా.. ప్రతిష్టాత్మక కిమ్ జిసెక్ పురస్కారానికి ఎంపికైంది. పలు విదేశీ చిత్రాలతో పోటీ పడిన ఈ మూవీ ఆసియాలోనే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. కొంకొణాసేన్ శర్మ, అర్జున్ రాంపాల్, తన్మయ్ దనానియా ముఖ్య పాత్రలు పోషించారు. అనుకోకుండా జరిగిన ఓ భయంకరమైన సంఘటన ఈ ముగ్గురి జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపిందనేది ఈ సినిమా కథాంశం. ఈ చిత్రంలో కొంకణా అత్యాచారానికి గురైన మహిళ పాత్రను పోషిస్తుంది. అర్జున్ రాంపాల్ ఆమె భర్త పాత్రలో నటిస్తున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ది క్వెస్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ ఇంతకుముందు సైతం విమర్శకుల ప్రశంసలు పొందిన ‘స్కామ్ 1992’ వెబ్సిరీస్ని నిర్మించింది. చదవండి: బూసన్ ఫీల్మ్ ఫెస్టివల్‌కి అపర్ణసేన్ ‘ది రేపిస్ట్’ -
విడాకులకు బాలీవుడ్ జంట దరఖాస్తు
ముంబై : బాలీవుడ్ నటి, దర్శకురాలు కొంకణ సేన్ శర్మ తాజాగా విడాకులకు దరఖాస్తు చేశారు. నటుడు రణ్వీర్ షోరేను 2010లో కొంకణ సేన్ వివాహం చేసుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్, మిక్స్డ్ డబుల్స్, ఆజా నాచ్లే వంటి సినిమాలో కలిసి నటించిన ఈ జంట అనంతరం ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా 2015లో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ.. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. వీరికి ఆరేళ్ల కుమారుడు హరూన్ ఉన్నాడు. ఇద్దరూ విడిగా ఉంటూనే కుమారుడి బాధ్యతలు చూసుకుంటున్నారు. (నా విడాకులకు అతడు కారణం కాదు: అమలాపాల్) అయితే 2015లో దూరమైన ఈ జంట ఇప్పటి వరకు విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా వీరు అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తవ్వగా.. ఆరునెలల్లో అధికారికంగా విడాకులు అందనున్నట్లు సమాచారం. అయితే దీనికి ముందు కొంకణ, రణవీర్ ఇద్దరూ కౌన్సిలింగ్ తీసుకున్నట్లు, అయినప్పటికీ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. (విడాకులపై పెదవి విప్పిన నటి శ్వేతాబసు) -
‘వారితో కలిసి పని చేయం’
దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిల్చేందుకు ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీలోని ప్రముఖ మహిళలు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని ఓ 11 మంది ప్రమఖులు ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి విషయంలో.. నిరూపితమైన నేరస్తులతో ఇక మీదట కలిసి పని చేసేది లేదని తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. అంతేకాక కిరణ్ రావ్, కొంకణా సేన్ శర్మ, నందితా దాస్, మేఘ్న గుల్జార్, నిత్యా మిశ్రా, రీమా కగ్తీ, రుచి నరైన్, అలంక్రితా శ్రీవాస్తవ, గౌరి షిండే, షోనాలి బోసే, జోయా అఖ్తర్ వంటి ప్రముఖులు ఈ లేఖ మీద సంతకం చేశారు. #metooindia pic.twitter.com/19a6Duj6IR — Konkona Sensharma (@konkonas) October 14, 2018 ఈ లేఖలో ‘ఓ మహిళగా, చిత్ర పరిశ్రమకు చెందిన వారిగా మేము ‘మీటూ ఉద్యమా’నికి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. వేధింపుల గురించి బయటకు వెల్లడించిన వారికి అండగా నిలుస్తాము. వారి ధైర్యాన్ని అభినందిస్తున్నాము. ఇక మీదట పరిశ్రమలో ఒక సురక్షితమైన, వివక్షకు తావులేని వాతావరణాన్ని సృష్టించాడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాము. నిరూపితమైన నేరస్తులతో పని చేయకూడదని నిర్ణయించుకున్నాము. మా సహచరులను కూడా అదే విధంగా చేయమని కోరుతున్నామం’టూ లేఖలో తెలిపారు. మీటూ ఉద్యమం ఫలితంగా ఇప్పటికే అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు పలు చిత్రాల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
దర్శకురాలిగా కొంకణాసేన్‌శర్మ!
కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న కొంకణాసేన్ శర్మ దర్శకురాలిగా మారే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ‘మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్’, ‘పేజ్ 3’ వంటి చిత్రాలతో విమర్శకుల మన్ననలు పొందిన ఈ నటి తాజాగా ఒక సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటోంది. అవకాశం దొరికితే తాను రూపొందించిన కథను తానే తెరకెక్కించాలని ఉందని కొంకణా చెబుతోంది. -
‘కామాటిపుర’ సెక్స్‌వర్కర్ ఎవరో?
వేశ్యల జీవితాలపై ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. వేశ్య పాత్రను చేయడం నటీమణులకు ఒక సవాలు వంటిదే. అటువంటి సినిమాల్లో స్టార్ హీరోయిన్లు ప్రధాన భూమికలు పోషించి మెప్పించారు. అయితే వేశ్యల జీవితాలకు సంబంధించి ఎవరూ సృ్పశించని కోణంలో కొత్తగా సినిమా తీయాలనుకుంటున్నాడు డెరైక్టర్ అంకుశ్ భట్. ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా అయిన ‘కామాటిపుర’లో ఈ చిత్ర షూటింగ్ జరుగనుంది. ఈ సినిమా గురించి డెరైక్టర్ మాట్లాడుతూ..‘ కామాటిపుర పేరుతో వేశ్యల జీవితాలపై చిత్రం తీయాలని నిర్ణయించాం. ఇందులో ప్రధాన పాత్రకు నటి కొంకణ్‌సేన్ శర్మను తీసుకోవాలనుకున్నాం. ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందని భావించి, ఆమెను సంప్రదించాం. కాని ఆమె మా అవకాశాన్ని తిరస్కరించింది. అయితే ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాం.. ఒప్పుకుంటుందో లేదో మాత్రం చెప్పలేం.. ప్రధాన పాత్రకు సంబంధించి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య జీవితాన్ని ఐదు దశలుగా ఆవిష్కరించదలిచాం.. కొంకణ్‌సేన్ అంగీకరించని పక్షంలో మరో నటిని చూసుకోవాల్సిందేగా.. ఈ సినిమాలో ప్రముఖ టీవీ సీరియల్స్‌లో కోడలుగా నటించి మెప్పించిన నటి సాక్షి తన్వర్ కూడా నటిస్తోంది. ఆమెను రెండో ప్రధాన పాత్రధారణిగా తీసుకుంటున్నాం. ఈ చిత్రంతో ఆమెకు ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. ఈ చిత్రంలో వ్యభిచారాన్ని ఎక్కువ చేసి చూపించడంలేదు. వేశ్యలు తమ జీవనోపాధి కోసం పగటిపూట ఏం చేస్తుంటారనేది కూడా ఇందులో చూపించబోతున్నాం. వేశ్యల మానసిక సంఘర్షణను ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కోణంలో ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నాం. ఈ చిత్రాన్ని ఎవరినో దృష్టిలో పెట్టుకుని నిర్మించడంలేదు. నటీనటుల ఎంపిక పూర్తి కాగానే రెండు నెలల్లో సినిమా సెట్స్ పైకి వెళుతుంది.