జీతాల పెంపు అంతంత మాత్రమేనట!
న్యూఢిల్లీ: వేతనాలు పెంపుపై ఆశపడే ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. ఆశించిన రీతిలో ఉద్యోగుల వేతనాల వృద్ధి వచ్చే ఏడాది ఉండదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదితో పోలిస్తే 2017లో వేతనాల వృద్ధి తగ్గుతుందని పేర్కొంటున్నాయి. ఈ ఏడాది 10.3 శాతంగా ఉన్న కనీస వేతన వృద్ధి వచ్చే ఏడాది 10 శాతంగానే ఉంటుందని తాజా రిపోర్టు పేర్కొంది. కార్న్ ఫెర్రీ హే గ్రూప్ 2017 వేతన అంచనాల గణాంకాల్లో ఈ విషయం తెలిసింది. భారతీయులు వేతన వృద్ధి 2017లో 10 శాతంగా ఉంటుందని, ఆఖరికి ఉద్యోగుల చేతిలోకి వచ్చే వాస్తవ వేతన పెంపు 4.8 శాతంగానే ఉంటుందని అంచనావేస్తున్నట్టు కార్న్ ఫెర్రీ హే గ్రూప్ తమ రిపోర్టులో వెల్లడించింది.
ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో జీతం పెరగదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలతో పోలిస్తే భారత్లో మెరుగైన వేతనాల పెంపు ఉందని రిపోర్టు చెప్పింది. వచ్చే రెండు సంవత్సరాల్లో 9.5-10.5 శాతంలోనే జీతాలు పెరుగుతాయని అంచనావేస్తున్నామని కార్న్ ఫెర్రీ హే గ్రూప్ దేశీయ మేనేజర్ అమీర్ హలీమ్ పేర్కొన్నారు.
ఆసియా పరంగా చూసుకుంటే గతేడాది కంటే 0.3 శాతం తక్కువగా వేతనాల పెరుగుదల 6.1 శాతంగానే ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో వాస్తవ జీతాల పెంపు 4.3 శాతంగా ఉంటుందని వివరించారు. వాస్తవ వేతన పెరుగుదల ఎక్కువగా వియత్నాం(7.2శాతం), థాయ్లాండ్(5.6శాతం), ఇండోనేషియా(4.9శాతం)లో ఉంటుందన్నారు. మొత్తం 110 దేశాల్లో 25వేల సంస్థల్లో 20 మిలియన్ జాబ్ హోల్డర్స్ డేటా ఆధారంగా ఈ జీతాల పెంపు డేటాను విడుదల చేశామని హే గ్రూప్ పేర్కొంది.