రూ.3వేలు గౌరవ వేతనాలు ఇవ్వాలి
ఆశ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
తక్షణం వేతన బకాయిలు చెల్లించాలి
అరకు ఎంపీ కొత్తపల్లి గీత డిమాండ్
పాడేరు: ఏజెన్సీలోని గిరిజనుల ఆరోగ్యానికి అనుక్షణం శ్రమిస్తున్న ఆశ కార్యకర్తలకు వెంటనే నెలకు రూ. 3 వేలు చొప్పున గౌరవ వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత డిమాండ్ చేశారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆశ కార్యకర్తలు బకాయి వేతనాలు, గౌరవ వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో సోమవారం చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని తెలుసుకున్న ఆమె ఈ సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ ఏపీఓతో ఫోన్లో చర్చించారు.
వారికి ఐటీడీఏ చెల్లించాల్సిన బకాయి వేతనాల మంజూరులో ఏర్పడిన జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చే అతి తక్కువ రూ.400 వేతనం కూడా నెల నెలా పంపిణీ చేయకపోవడం అన్యాయమన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య కార్యక్రమాలకు రూ.కోట్లు నిధులు మంజూరు చేస్తున్నా ఆశాలకు ఇచ్చే తక్కువ వేతనాలు సొమ్ము ఎందుకు మంజూరు చేయడం లేదని ఎంపీ ప్రశ్నించారు.
ఆశ కార్యకర్తలంతా వెట్టి చాకిరీకి గురవుతున్నారని వారందరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తాను ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని ఆమె చెప్పారు. గౌరవ వేతనాల సొమ్మును పెంచి, నెల నెలా సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు.
చదువుకున్న ఆశ కార్యకర్తలను వైద్య సిబ్బందిగా నియమకాలు జరిపేందుకు కూడా ప్రభుత్వంకు నివేదిక ఇస్తామని ఆమె చెప్పారు. గ్రామాల్లో వెట్టి చాకిరీ చేస్తూ చివరకు ఇచ్చే అతి తక్కువ వేతనాలకు కూడా ఆశ కార్యకర్తలు ఉద్యమాలు చేసుకోవలసిన దుస్థితి రావడం బాధాకరం అన్నారు. ఆశ కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు.