అసెంబ్లీని కుదిపేసిన రేప్ కేసు
సిమ్లా: బాలిక హత్యాచార కేసు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఘటనపై చర్చ చేపట్టాలంటూ బీజేపీ పట్టుబట్టడం.. అందుకు స్పీకర్ అంగీకరించకపోవటంతో సభలో గందరగోళం నెలకొనగా, చివరకు సభ వాయిదా పడింది.
జూలై మొదటి వారంలో సిమ్లా కొట్ఖాయ్ పట్టణంలో 16 ఏళ్ల బాలిక అతి దారుణంగా అత్యాచారం ఆపై హత్యకు గురైన విషయం తెలిసింది. ఘటన వెనుక ఆరుగురు సంపన్న కుటుంబానికి చెందిన యువకులు ఉన్నారంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. అంతేకాదు నేరస్థుల ఫోటోలు ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఫేస్ బుక్ పేజీలో అప్ లోడ్ కూడా అయ్యాయి. అయినప్పటికీ సరైన సాక్ష్యాలు లేవంటూ పోలీసులు చెబుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశం విధాన సభను కుదిపేసింది. నోటీసులు ఇచ్చినప్పటికీ అంశంపై స్పందించేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదంటూ బీజేపీ ఆరోపించింది. దీనికి తోడు స్పీకర్ బ్రిజ్ బిహరి లాల్ భుటాలి కూడా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున నివేదిక వచ్చాకే చర్చించాలని సూచించటంతో ప్రతిపక్షం స్వరం పెంచి నినాదాలు చేసింది. దీంతో స్పీకర్ 15 నిమిషాలు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి మారకపోవటంతో చివరకు స్పీకర్ సభను వాయిదా వేశారు.
ఇక సభ వాయిదాతో బీజేపీ అసెంబ్లీ బయట ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని ప్రతిపక్ష నేత ప్రేమ్‌కుమార్ దుమాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మరోపక్క ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నా గుడియా న్యాయ మంచ్ సంఘం రేపు అసెంబ్లీ బయట నిరసనకు పిలుపునిచ్చింది.