పట్టాలపై పసికందు
కొత్తవలస రూరల్: అప్పుడే పుట్టిన పసికందును రైలు పట్టాల పక్కన విడిచి వెళ్లిన సంఘటనతో కొత్తవలస ప్రజలు హతాశులయ్యారు. కొత్తవలస–విశాఖ రహదారిలో గల కరెంట్ ఆఫీస్ సమీపంలో గల రైల్వేట్రాక్ వద్ద ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఓ పసికందును బ్యాగ్‌లో ఉంచి పడవేశారు. అక్కడే పండ్ల వ్యపారం చేస్తూ జీవనం సాగిస్తున్న మల్లి అనే వ్యక్తి బ్యాగ్‌లో ఉన్న శిశువును గుర్తించి, స్థానిక పరమేశ్వరి అస్పత్రికి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు చేయించాడు.
పొలీసుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఐసీడీఎస్ పీఓ బి.ఉర్మిళ, సూపర్వైజర్ సునీత ఆస్పత్రికి వచ్చి బిడ్డను స్వాధీనం చేసుకుని విజయనగరంలోని ఘోషాఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి, శిశుగృహకు అప్పగించారు.
పసికందును వదిలి వేయడం అమానుషం
అప్పుడే పట్టిన పసికందును రైల్వే ట్రాక్‌పై వదిలివేయడం అమానుషమని, సభ్యసమాజం తల దించుకునే చర్య అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తవలస రైల్వే ట్రాక్ పక్కన వదిలిపెట్టిన పసికందును ఘోషా ఆస్పత్రి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచిన సమాచారం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి వచ్చి పసికందును చూసి డాక్టర్‌ను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.