ఇస్లాంలోకి మారకుంటే కాళ్లు, చేతులు నరికేస్తాం
కోజికోడ్: ఆరు నెలల్లోగా ఇస్లాం మతం స్వీకరించకుంటే కాళ్లు, చేతులు నరికేస్తామం టూ కేరళ రచయిత కేపీ రామనుణ్నికి బెదిరింపులు వచ్చాయి. కోజికోడ్‌కు చెందిన ఆయన... మతం పేరిట హిందూ ముస్లింలు ఘర్షణకు దిగవద్దంటూ స్థానిక పత్రికలో వ్యాసం రాయడంతో వారం క్రితం అజ్ఞాత వ్యక్తులెవరో ఇలా హెచ్చరిస్తూ లేఖ పంపారు. ‘నిష్పక్షపాతం పేరిట మీరు హిందూ , ముస్లింలను ఒకే గాటన లెక్క కట్టారు. ఇలాంటి రాతలు అమాయక ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.
మీకో అవకాశం ఇస్తున్నాం... ఆరు నెలల్లోగా ఇస్లాం మతంలోకి మారండి లేదంటే అల్లా తరఫున శిక్ష విధిస్తాం. మీ కాళ్లు, చేతులను నరికేస్తాం’ అని అందులో బెదిరించారు. హత్యా బెదిం పులను సహించబోమని, ఇలాంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణిస్తామని సీఎం పి.విజయన్ అన్నారు. రామనుణ్ని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు.