ఆర్టీసీలో.. ఈనెల జీతంతో డీఏ
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. ఈ నెల జనవరి నుంచి అందాల్సిన 8.1 శాతం కరువు భత్యా(డీఏ)న్ని ఈ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుంటే, ఆర్టీసీలోని 1792 మంది కండక్టర్లను, 1955 మంది డ్రైవర్లను క్రమబద్ధీకరిస్తూ త్వరలో ఉత్తర్వులు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. పద్మాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జనవరిలో క్రమబద్ధీకరించిన 9,518 మందికి రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు.
ఆర్టీసీకి రూ.76 కోట్లు మంజూరు
కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ బస్సు పాసుల రీయింబర్స్మెంట్, వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం వాయిదాలు, వడ్డీ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఆర్టీసీకి రూ.76.65 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.