kr suresh reddy
-
రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో ఈ నెల 26న జరిగే రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు గురువారం ఖరారు చేశారు. సుమారు పక్షం రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావుతో పాటు అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం తుది గడువు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థులు మధ్యాహ్నం 12.41 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్న కేశవరావు, సురేశ్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు నేతలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వారిని పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తూ పత్రాలు అందజేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణకు చేరుకున్న కేశవరావు, సురేశ్ రెడ్డి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీకి వచ్చిన పార్టీ రాజ్యసభ అభ్యర్థులకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నరేందర్ తదితరులు కేకే, సురేశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సురేశ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందు కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో పోచారంతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసిన సురేశ్‌రెడ్డి, కె. కేశవరావు ఎమ్మెల్సీ అభ్యర్థిపై కసరత్తు.. శాసన మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నిక నోటిఫికేషన్ గురువారం వెలువడగా, ఈ నెల 19 నామినేషన్ల దాఖలకు తుది గడువు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పలువురు నేతలు గురువారం అసెంబ్లీలో కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, లోయపల్లి నర్సింగరావు, ముజీబ్ శాసన మండలి అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్నారు. గతంలో స్థానిక సంస్థలో కోటాలో టీడీపీ నుంచి ఎన్నికైన అరికెల నర్సారెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆరంభం నుంచి పార్టీలో ఉంటూ వరుసగా మూడు పర్యాయాలు ఎంపీపీగా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా నర్సింగరావు కోరుతున్నారు. మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ముజీబ్ కోరుతుండటంతో జిల్లాకు చెందిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. కేఆర్ సురేశ్‌రెడ్డి... భార్య: పద్మజారెడ్డి జననం: 1959, మే 25 స్థలం: చౌట్పల్లి, కమ్మరపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా రాజకీయ ప్రస్థానం.. 1984లో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన సురేశ్‌రెడ్డి తండ్రి గోవిందరెడ్డి రాజకీయ వారసత్వాన్ని స్వీకరించారు. 1989, 1994, 1999, 2004లో వరుసగా నాలుగు పర్యాయాలు నిజామాబాద్ బాల్కొండ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1990లో లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా, 1997లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2004లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2009, 2014లో అర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018, సెప్టెంబర్‌లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కంచర్ల కేశవరావు భార్య: వసంతకుమారి జననం: 1939, జూన్ 4 స్థలం: మహబూబాబాద్ రాజకీయ ప్రస్థానం.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కేశవరావు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవులు నిర్వర్తించారు. 2005లో ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఏఐసీసీ సభ్యుడిగా పనిచేశారు. పట్టభద్రుల కోటాలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో విద్య, పరిశ్రమలు వంటి కీలక శాఖలతో పాటు కాంగ్రెస్ హయాంలో కొంతకాలం శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. 2006లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తూ 2014లో రెండో పర్యాయం రాజ్యసభకు ఎన్నికై పార్టీ పార్లమెంటరీ పక్షం నేతగా వ్యవహరిస్తున్నారు. చదవండి: కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే! సంక్షేమం ఆగదు.. -
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సీనియర్ నాయకులు కే కేశవరావు, కేఆర్ సురేష్‌రెడ్డిలను రాజ్యసభకు నామినేట్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేకేకు కేసీఆర్ మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డిని కూడా టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలని కేసీఆర్ నిర్ణయించారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న సురేష్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఎవరనే దానిపై తీవ్ర చర్చ సాగింది. ఒక స్థానానికి కేశవరావు పేరును ఖరారు చేసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే మరో స్థానానికి సీఎం కేసీఆర్ ఎవరిని నామినేట్ చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ ఆభ్యర్థిత్వాన్ని ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. వారితోపాటు దామోదర్‌రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి పేర్లను కూడా సీఎం పరిశీలించినట్లు తెలిసింది. అయితే చివరకు వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్.. కేకే, సురేష్‌రెడ్డి పేర్లను రాజ్యసభకు నామినేట్ చేశారు. -
టీఆర్ఎస్లోకి మాజీ స్పీకర్
-
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ముఖ్యనేత
సాక్షి, హైదరాబాద్: శాసనసభను రద్దు చేసిన మర్నాడే టీఆర్ఎస్ పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్’పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నాయకులను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ స్వయంగా తన పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం సురేశ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనుభవానికి తగ్గ పదవి ఇచ్చి గౌరవిస్తామని చెప్పడంతో టీఆర్ఎస్లో చేరేందుకు సురేశ్ రెడ్డి అంగీకరించారు. త్వరలోనే చేరిక తేదీని ప్రకటిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సురేశ్ రెడ్డి నాలుగు సార్లు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే బాల్కొండ నుంచి ఆర్మూర్ నియోజకవర్గానికి మారి గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు కేసీఆర్ ఏం హామీయిచ్చారు, టీఆర్ఎస్లో ఎటువంటి పదవి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు నేతలు కూడా టీఆర్ఎస్ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
టీపీసీసీ షాడో కేబినెట్ ఏర్పాటు
హైదరాబాద్: అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి చైర్మన్‌గా టీపీసీసీ షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలంతా సోమవారం సమావేశమయ్యారు. హాజరైన వారిలో 17 మంది మాజీ మంత్రులు, ఎంపీలు ఉన్నారు. విభజన చట్టంలో హామీలు, టీఆర్ఎస్ మేనిఫెస్టో, కేసీఆర్ ప్రకటనల అమలు అంశంపై ఈ కమిటీ పరిశీలించింది. హామీలు అమలయ్యే దాకా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫిరాయింపులతోనే కేసీఆర్ రాజకీయ కాలుష్యం పెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వల్ల హైదరాబాద్‌కు పెట్టుబడుల ఇబ్బందుల కలిగే పరిస్థితి ఉందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తామని మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. -
ఆరు నెలల్లోనే ప్రజావ్యతిరేకత
ఆర్మూర్ : ఆరు నెలల కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని శాసన సభ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సైదాబాద్ కాలనీలోని షాదీఖానాలో జిల్లా మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుమీర్ హైమద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సురేష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని చూడటం ఇదే మొదటిసారన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా ప్రతీ గ్రామంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా పెద్దగా లభించడం లేదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 9న గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరవేయాని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష 36 వేల మందితో సభ్యత్వాలను పూర్తి చేస్తామన్నారు. పార్టీ పదవులకు ఎంపిక... జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు హబీబొద్దిన్ ను, మండల మైనార్టీ సెల్ అధ్యక్షునిగా షరీ ఫ్ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ నియామకపు పత్రాలను అందజేసారు. కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి మార చంద్రమోహన్, కౌన్సిలర్ మహమూద్ అలీ, మైనార్టీ నాయకులు ఉస్మాన్ హజ్రమి, హైమద్ షరీఫ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈగ గంగాధర్, మాజీ కౌన్సిలర్ పీసీ భోజన్న పాల్గొన్నారు. -
కాంగిరేసు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ దిగ్గజాలు డి.శ్రీనివాస్, మహ్మద్ షబ్బీర్‌అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డికి నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు స్థానా లు దక్కాయి. మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కు బాల్కొండ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు నిజామాబాద్ అర్బన్ కేటాయించగా, బాన్సువాడ కాసుల బాలరాజుకిచ్చారు. కాంగ్రెస్ బహిష్కృత నేత సౌదాగర్ గంగారాంకు జుక్కల్ టికెట్ ఇవ్వడంతో అక్కడ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నల్లమడుగు (జాజల) సురేందర్‌కు ఎల్లారెడ్డి దక్కింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రయత్నాలు ఫలించలేదు. మైనార్టీ నేత, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్‌కు కూడ ‘చెయ్యి’చ్చారు. ఇదేమి తీరు? టికెట్ల కేటాయింపులో లాబీయింగ్ జరిగిందంటూ పలుచోట్ల నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేయగా, కార్యకర్తలు నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏఐసీసీ వాయిదాకు ముందు చేసిన ప్రకటన, తాజాగా వెల్లడించిన జాబితాకు తేడా ఉందంటూ ఆందోళనకు దిగారు. నిజామాబాద్ అర్బన్‌కు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత పేరుందన్న ప్రచారం జరగగా, తుది జాబితాలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ పేరును ప్రకటించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాంపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ చర్యల కింద ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. అయితే ఇటీవల ఎంపీ సురేష్‌కుమార్ షెట్కా ర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ ఏఐసీసీకి లేఖ రాశారని చెప్తున్నా, దానిపై డీసీసీ, టీపీసీసీలో స్పష్టత లేదు. జుక్కల్ టికెట్ గంగారాంకు కేటాయించినం దుకు నిరసనగా అక్కడి నాయకులు ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్లారెడ్డిలోను షెట్కార్, షబ్బీర్‌అలీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. మహిళల కోటాలో తమకు టికెట్ లభిస్తుందని ఆశించిన ఆకుల లలిత, అరుణతారకు ఈసారి కూడ పార్టీ అధిష్టానం మొండిచెయ్యి చూపింది. ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ జుక్కల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్‌కు ఎల్లారెడ్డిలో ప్రతికూల పరిస్థితు లు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసిన అధిష్టానం గంగారాంకు ఎలా టికెట్ ఇస్తుందన్న ప్రశలు వినిపిస్తుం డగా.. అందుకు ప్రధాన కారణం షబ్బీర్ అలీ, సురేష్‌కుమార్ షెట్కార్లంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్లో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమడుగు సురేందర్‌కు ఇచ్చిన మాటను నిలుపుకోగా, జనార్దన్‌గౌడ్‌కు ఆశాభంగం కలిగింది. మరో మూడు నియోకవర్గాలలో ఇదే పరిస్థితి నెలకొంది. అసంతృప్తివాదులను బుజ్జగించడం కోసం మంగళవారం నుంచి అగ్రనాయకత్వం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అందరిని కలుపుకోవాలని అధిష్టానం డీసీసీలను ఆదేశించింది.