కాంగిరేసు | congress party announced candidate list | Sakshi
Sakshi News home page

కాంగిరేసు

Published Tue, Apr 8 2014 3:33 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

congress party announced candidate list

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్ దిగ్గజాలు డి.శ్రీనివాస్, మహ్మద్ షబ్బీర్‌అలీ, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డికి నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు స్థానా లు దక్కాయి. మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కు బాల్కొండ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు నిజామాబాద్ అర్బన్ కేటాయించగా, బాన్సువాడ కాసుల బాలరాజుకిచ్చారు. కాంగ్రెస్ బహిష్కృత నేత సౌదాగర్ గంగారాంకు జుక్కల్ టికెట్ ఇవ్వడంతో అక్కడ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నల్లమడుగు (జాజల) సురేందర్‌కు ఎల్లారెడ్డి దక్కింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రయత్నాలు ఫలించలేదు. మైనార్టీ నేత, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్‌కు కూడ ‘చెయ్యి’చ్చారు.

 ఇదేమి తీరు?
 టికెట్ల కేటాయింపులో లాబీయింగ్ జరిగిందంటూ పలుచోట్ల నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేయగా, కార్యకర్తలు నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏఐసీసీ వాయిదాకు ముందు చేసిన ప్రకటన, తాజాగా వెల్లడించిన జాబితాకు తేడా ఉందంటూ ఆందోళనకు దిగారు. నిజామాబాద్ అర్బన్‌కు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత పేరుందన్న ప్రచారం జరగగా, తుది జాబితాలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ పేరును ప్రకటించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాంపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ చర్యల కింద ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది.

అయితే ఇటీవల ఎంపీ సురేష్‌కుమార్ షెట్కా ర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ ఏఐసీసీకి లేఖ రాశారని చెప్తున్నా, దానిపై డీసీసీ, టీపీసీసీలో స్పష్టత లేదు. జుక్కల్ టికెట్ గంగారాంకు కేటాయించినం దుకు నిరసనగా అక్కడి నాయకులు ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎల్లారెడ్డిలోను షెట్కార్, షబ్బీర్‌అలీ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. మహిళల కోటాలో తమకు టికెట్ లభిస్తుందని ఆశించిన ఆకుల లలిత, అరుణతారకు ఈసారి కూడ పార్టీ అధిష్టానం మొండిచెయ్యి చూపింది.

 ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ జుక్కల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్‌కు ఎల్లారెడ్డిలో ప్రతికూల పరిస్థితు లు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసిన అధిష్టానం గంగారాంకు ఎలా టికెట్ ఇస్తుందన్న ప్రశలు వినిపిస్తుం డగా.. అందుకు ప్రధాన కారణం షబ్బీర్ అలీ, సురేష్‌కుమార్ షెట్కార్‌లంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమడుగు సురేందర్‌కు ఇచ్చిన మాటను నిలుపుకోగా, జనార్దన్‌గౌడ్‌కు ఆశాభంగం కలిగింది. మరో మూడు నియోకవర్గాలలో ఇదే పరిస్థితి నెలకొంది. అసంతృప్తివాదులను బుజ్జగించడం కోసం మంగళవారం నుంచి అగ్రనాయకత్వం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అందరిని కలుపుకోవాలని అధిష్టానం డీసీసీలను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement