టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సురేశ్‌రెడ్డి, కె.కేశవరావును అభినందిస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్కసుమన్, ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కోటాలో ఈ నెల 26న జరిగే రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు గురువారం ఖరారు చేశారు. సుమారు పక్షం రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావుతో పాటు అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం తుది గడువు కాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థులు మధ్యాహ్నం 12.41 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకున్న కేశవరావు, సురేశ్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇద్దరు నేతలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వారిని పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేస్తూ పత్రాలు అందజేశారు. అనంతరం అసెంబ్లీ ఆవరణకు చేరుకున్న కేశవరావు, సురేశ్ రెడ్డి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీకి వచ్చిన పార్టీ రాజ్యసభ అభ్యర్థులకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, నరేందర్ తదితరులు కేకే, సురేశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సురేశ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందు కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో పోచారంతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసిన సురేశ్‌రెడ్డి, కె. కేశవరావు
ఎమ్మెల్సీ అభ్యర్థిపై కసరత్తు..
శాసన మండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నిక నోటిఫికేషన్ గురువారం వెలువడగా, ఈ నెల 19 నామినేషన్ల దాఖలకు తుది గడువు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పలువురు నేతలు గురువారం అసెంబ్లీలో కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, లోయపల్లి నర్సింగరావు, ముజీబ్ శాసన మండలి అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్నారు. గతంలో స్థానిక సంస్థలో కోటాలో టీడీపీ నుంచి ఎన్నికైన అరికెల నర్సారెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆరంభం నుంచి పార్టీలో ఉంటూ వరుసగా మూడు పర్యాయాలు ఎంపీపీగా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా నర్సింగరావు కోరుతున్నారు. మైనారిటీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా ముజీబ్ కోరుతుండటంతో జిల్లాకు చెందిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
కేఆర్ సురేశ్‌రెడ్డి...
భార్య: పద్మజారెడ్డి
జననం: 1959, మే 25
స్థలం: చౌట్‌పల్లి, కమ్మరపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
రాజకీయ ప్రస్థానం..
1984లో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన సురేశ్‌రెడ్డి తండ్రి గోవిందరెడ్డి రాజకీయ వారసత్వాన్ని స్వీకరించారు. 1989, 1994, 1999, 2004లో వరుసగా నాలుగు పర్యాయాలు నిజామాబాద్ బాల్కొండ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1990లో లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా, 1997లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2004లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2009, 2014లో అర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018, సెప్టెంబర్‌లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
కంచర్ల కేశవరావు
భార్య: వసంతకుమారి
జననం: 1939, జూన్ 4
స్థలం: మహబూబాబాద్
రాజకీయ ప్రస్థానం..
జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కేశవరావు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవులు నిర్వర్తించారు. 2005లో ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఏఐసీసీ సభ్యుడిగా పనిచేశారు. పట్టభద్రుల కోటాలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో విద్య, పరిశ్రమలు వంటి కీలక శాఖలతో పాటు కాంగ్రెస్ హయాంలో కొంతకాలం శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. 2006లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు 2013లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తూ 2014లో రెండో పర్యాయం రాజ్యసభకు ఎన్నికై పార్టీ పార్లమెంటరీ పక్షం నేతగా వ్యవహరిస్తున్నారు.
చదవండి:
కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే!
సంక్షేమం ఆగదు..
Comments
Please login to add a commentAdd a comment