'ఎక్కడి నుంచో తెచ్చి కాల్చిచంపారు'
తిరుపతి : చిత్తూరు జిల్లాలోని తిరుపతి శ్రీవారి మెట్ల వద్ద మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్లో మరణించిన ఎర్రచందనం కూలీలను వేరొక ప్రాంతం నుంచి తీసుకొచ్చి కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య ఆరోపించారు. మృతదేహాల మీద బుల్లెట్ గాయాలను చూస్తే.. ఇది పక్కా బూటకపు ఎన్కౌంటరేనని తేలుతోందని గురువారం ఆయన చెప్పారు. మృతదేహాలలో ఎక్కడా బుల్లెట్లు లేవు, కేవలం అవి వారి శరీరాల నుంచి దూసుకెళ్లాయని చెప్పారు. కేవలం 5 నుంచి 10 మీటర్ల దూరం నుంచే కాల్పులు జరిగాయని అందువల్లే బుల్లెట్లు ఎర్రచందనం కూలీల శరీరాల నుంచి వెళ్లిపోయాయని పేర్కొన్నారు.
కూలీల శవాల పక్కన పిడిలేని గొడ్డళ్లను పోలీసులు పడేయటాన్ని గమనించినట్లయితే వాటిని అప్పుడే కొనుక్కొచ్చిన విషయం తెలుస్తోందన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో రాళ్లు కూడాలేవని, మరి రాళ్లతో ఎర్రచందనం కూలీలు ఎలా దాడి చేశారో పోలీసులే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు పిట్టకథ అల్లుతున్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదని పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య వెల్లడించారు.