సాగర్ను నియంత్రణలోకి తెచ్చుకోలేం!
ఏపీకి మరోసారి స్పష్టం చేసిన కృష్ణాబోర్డు
కేంద్రం నోటిఫై చేయకుండా అది కుదరదని వెల్లడి
కృష్ణా వివాదంలో ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ పరివాహక పరిధిలోని ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని కృష్ణా నది యాజమాన్య బోర్డు మరోమారు తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా ప్రాజెక్టులను తమ స్వాధీనంలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. గతంలోనే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకోవాలని కోరుతూ కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ లేఖ రాసింది. అది సాధ్యమయ్యేది కాదని గతంలోనే బోర్డు సమాధానం ఇచ్చింది కూడా.
అయినా.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు దానిపై పెత్తనం చేస్తున్నారని, ఏపీకి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా దానిని నియంత్రణలోకి తెచ్చుకోవాలని బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు ఆంధ్రప్రదేశ్ శనివారం మరోసారి కోరినట్లు సమాచారం. సాగర్ పరిధిలో జరుగుతున్న వివాదం, శాంతిభద్రతల సమస్యలను ఎత్తిచూపి నియంత్రణ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై బోర్డు సభ్య కార్యదర్శి సానుకూలత వ్యక్తం చేయలేదని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేస్తేనే నియంత్రణలోకి తెచ్చుకోవడం సాధ్యమని... పాలనాపరమైన సమస్యలను పరిష్కరించకుండా ఇది కుదరదని స్పష్టం చేసినట్లుగా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ కేంద్రం నోటిఫై చేసినా... ప్రాజెక్టు నిర్వహణను ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బందే చూసుకోవాలని తెలిపినట్లు సమాచారం.
పట్టించుకోని కేంద్రం..
కృష్ణా నదీ జలాల వివాదంలో కేంద్రం పూర్తిగా పట్టనట్టు వ్యవహరిస్తోంది. రబీ పంటల అవసరాలకు సాగర్ నుంచి నీటి వినియోగంలో జోక్యం చేసుకోవాలని, లభ్యత నీటిని వాడకుండా నియంత్రించాలని కేంద్ర జల వనరుల శాఖకు, కేంద్ర జల సంఘానికి తెలంగాణ పదేపదే మొరపెట్టుకు న్నా ఎలాంటి స్పందనా రాలేదు. కేంద్ర మంత్రి ఉమాభారతి ఇతర పనుల్లో బిజీగా ఉండటం తో విషయంలో ఎలా స్పందించాలన్న దానిపై కేంద్ర అధికారులు తేల్చలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక అధికారిని పంపాలని గతంలోనే విజ్ఞప్తి చేసినా కేంద్రం సానుకూలత వ్యక్తం చేయలేదు. దీంతో వివాదాన్ని కేంద్ర జల సంఘం దృష్టికి తేసుకురాగా... వారు కృష్ణా బోర్డుకే సర్వాధికారాలు ఉన్నాయంటూ తప్పించుకుంటున్నారు. దీంతో చివరికి వివా దం తిరిగి బోర్డు పరిధిలోకే చేరుతోంది.