krishna district police
-
పద్ధతి మార్చుకోండి.. లేకపోతే..: ఎస్పీ ‘ఓపెన్’ వార్నింగ్
పాత నేరస్తులకు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తనదైన శైలిలో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నేరాలు చేయడం మానకపోతే కఠిన చర్యలు తప్పవని ‘ఓపెన్’గా వార్నింగ్ ఇచ్చారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సాక్షి, విజయవాడ: సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూస్తే సహించేది లేదని, పద్ధతి మార్చుకోకుండా తిరిగితే రౌడీషీట్లు తెరిచి, చట్టరీత్యా మరింత కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. మద్యం, మాదక ద్రవ్యాలు, నాటుసారా, గుట్కా వంటి వాటిని అక్రమ రవాణా చేసే జిల్లాలోని ఐదు డివిజన్లకు చెందిన 2,530 మంది పాత నేరస్తులకు సింగ్‌నగర్ మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ► ఎస్పీ మాట్లాడుతూ కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ఆరాటంతో కొంతమంది వ్యక్తులు మద్యం, మాదక ద్రవ్యాలు, నాటుసారా, గుట్కాల అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారన్నారు. ► చదువుకున్న వారు, యువకులు కూడా ఈ కేసుల్లో ముద్దాయిలుగా ఉండడం బాధాకరమన్నారు. ► ఈ కేసుల్లో పట్టుపడితే ఏముంటుందిలే, బెయిల్ మీద వస్తాం, చక్కగా తిరిగేస్తామనుకొని ఇప్పటివరకూ పదే పదే తప్పులు చేస్తూ కొంతమంది నడుచుకుంటున్నారన్నారు. అటువంటి వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరుస్తామన్నారు. నేరాల అదుపునకు యాక్షన్ ప్లాన్ కృష్ణా జిల్లాలో ఈ నేరాల సంఖ్యను పూర్తిగా రూపుమాపాలనే లక్ష్యంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామని ఎస్పీ తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో అదనంగా మరికొన్ని చెక్ పోస్టులను ఏర్పాటుచేసి, సరిహద్దు గ్రామాలు, నేరాలు అధికంగా జరిగే ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, అమ్మోనియా, పటిక వంటి నిల్వలపై నిరంతర తనిఖీలు, ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. సత్ప్రవర్తనతో ఉంటే ఉద్యోగావకాశాలు.. నేరాలు విడిచి సత్ప్రవర్తనతో నడుచుకునే వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్ మేళాలను నిర్వహించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ జేడీ మోకా సత్తిబాబు, జిల్లాలోని పలువురు ఏఎస్పీలు, డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
వజ్రాలు ఉన్నాయనే నంది విగ్రహం ధ్వంసం..
విజయవాడ: కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కాపేట గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలోని నంది విగ్రహం ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. గతేడాది సెప్టెంబరు 17న విశ్వేశ్వర ఆలయంలో జరిగిన ఘటనలో దుండగులు నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను ప్రధాన ముద్దాయిగా గుర్తించారు. శ్రీనివాస్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వజ్రాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే నిందితులు నంది విగ్రహ చెవులను విరగొట్టారని ఆయన వెల్లడించారు. నంది విగ్రహం నడుము భాగంలో హంస ఉంటే వజ్రాలు ఉంటాయని నిందితులు భావించారని, ఈ విషయంపై పూజారి యుగంధర్ శర్మను వివరాలు అడగడంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారని ఎస్పీ తెలిపారు. విగ్రహ ధ్వంసానికి ముందు నిందితులు పలు మార్లు రెక్కీ నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. గుప్త నిధుల వేటలోనే విగ్రహాన్ని పగలగొట్టినట్లు నిందితులు అంగీకరించారని ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. నిందితులపై 447, 427, 295, 295A,153, IPC & 20 of Indian treasure trove act 1878 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి Ap 24 AP 8999 ఇన్నోవా కార్, Ap 16 DQ 4243 స్విఫ్ట్ కార్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. విగ్రహాన్ని పగలగొట్టడానికి వినియోగించిన సుత్తి ,గ్యాస్ కట్టర్లను సీస్ చేశామని పేర్కొన్నారు. గుప్తనిధుల వేటలో నిందితులు రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో రెక్కీ నిర్వహించినట్టు గుర్తించామని ఆయన తెలిపారు. వాటికి సంబంధించిన ఫోటోలను నిందితుల సెల్ ఫోన్లలో గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. -
కృష్ణా పోలీసుల పెద్ద మనసు
సాక్షి, కృష్ణా/కైకలూరు: దళితులపై దాడులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించవద్దన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా తమ సేవాగుణాన్ని కూడా చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ఒక దళిత యువతి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అయినంపూడి గ్రామానికి చెందిన దళిత యువతి (22) అదే మండలం వడాలికి చెందిన మంద సాయిరెడ్డి(24) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే యువతిని వివాహం చేసుకునేందుకు సాయిరెడ్డి నిరాకరించడంతో ఆమె ముదినేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు సాయిరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. యువతిని కొంతమంది బెదిరించడంతో మరో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు యువతి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనపైనా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నెల్లూరులో బాలుడి కిడ్నాప్ కలకలం) పోలీసుల సేవా గుణం ఇంటి దగ్ధం విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గుడివాడ డీఎస్పీ ఎన్. సత్యానందం సిబ్బందితో గురువారం బాధితుల వద్దకు వెళ్లి రూ.25 వేలు నగదు, మరో రూ.25వేలు విలువ చేసే నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు అందించారు. ఇంటి నిర్మాణానికి పోలీసుల తరఫున పూర్తి సాయం అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇల్లు దగ్ధం కేసులో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముఖ్యంగా అర్ధరాత్రి ఇల్లు దగ్ధమవుతున్న సమయంలో ఎస్ఐ మణికుమార్ తన సిబ్బందితో కలిసి మంటలు అదుపు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నవారి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధితులకు భరోసా కల్పిస్తోందని దళిత సంఘాలు అభినందిస్తున్నాయి. -
పోలీసుల సంక్షేమానికి భరోసా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బంది సంక్షేమానికి ‘భద్రతా స్కీమ్’తో భరోసా లభిస్తోంది. నెలవారి జీతం నుంచి వారు చెల్లించే కొద్ది మొత్తాలు పలువురి ఆర్థిక అవసరాలను తీరుస్తోంది. సొసైటీ చట్టం ప్రకారం దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటైన ఏపీ పోలీస్ ఉద్యోగి పొదుపు పరస్పర సహకార సొసైటీ (భద్రతా స్కీమ్) ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు ఇస్తోంది. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి, ఇంటి నిర్మాణం వంటి భారీ ఖర్చులతోపాటు పోలీసుల వ్యక్తిగత రుణాలకు కూడా భద్రతా స్కీమ్ అక్కరకు వస్తోంది. ఏపీ డీజీపీ ప్రధాన కార్యాలయంలో పోలీస్ సంక్షేమ (వెల్ఫేర్) విభాగం భద్రతా స్కీమ్‌ను పర్యవేక్షిస్తోంది. దీని ద్వారా గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సుమారు రూ.200.43 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించారు. కష్టాల్లో అండగా.... పెద్ద కష్టం వచ్చిపడితే అప్పటికప్పుడు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా భద్రతా స్కీమ్‌లో దరఖాస్తు చేసుకుంటే అవసరానికి తగినట్టుగా ఆర్థిక సాయాన్ని రుణంగా అందిస్తున్నారు. దాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు ఉంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పదవీ విరమణ చేసిన 1,168 మందికి రూ.13.37కోట్లు తిరిగి చెల్లించారు. రుణాలు తీసుకున్న 81 మంది సభ్యులు మృతి చెందడంతో రూ.1.32 కోట్లు రాయితీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న 237 కుటుంబాలకు రూ.11.41 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. కష్టాల్లో ఉన్న పోలీసులకు ఎంతో ఉపయోగం... పోలీసులకు కష్టాల్లో ‘భద్రత’ బాగా ఉపయోగపడుతోంది. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి, ఇల్లు నిర్మాణం, ఇతర అత్యవసర సమయాల్లో విషయాల్లో వచ్చే ఖర్చుల విషయాల్లో భద్రతా స్కీమ్ బాగా ఉపయోగపడుతోంది. ఈ స్కీమ్‌పై పోలీసుల్లోనూ అవగాహన పెరగడంతో ఎక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. అవసరాన్ని బట్టి రూ.లక్షల్లో రుణాలిచ్చి నెలవారీగా జీతంలో మినహాయించుకునే వెసులుబాటు బాగుంది. దీన్ని ప్రతీ పోలీస్ ఉపయోగించుకునే అవకాశం రావాలి. –గుర్రం జయపాల్, కృష్ణా జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు -
మీడియా ముందుకు జయరాం హత్య కేసు నిందితులు
సాక్షి, నందిగామ: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి అని కృష్ణా జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. డబ్బు కోసమే జయరాంను హింసించి చంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాకేష్‌రెడ్డితో పాటు అతడికి సహకరించిన వాచ్‌మన్ శ్రీనివాస్‌ను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి మాట్లాడుతూ... ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి నేరం అంగీకరించాడని తెలిపారు. జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని చెప్పారు. ఆమె వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. నిందితుడి వాంగ్మూలానికే పోలీసులు పరిమితం అయ్యారు. ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాలనే పోలీసులు వెల్లడించారు. తాను అప్పుగా ఇచ్చిన డబ్బును రాబట్టుకునేందుకే జయరాంను రాకేష్‌రెడ్డి హత్య చేసినట్టు తెలిపారు. తనకు రావాల్సిన డబ్బు రాబట్టుకునేందుకు రీనా అమ్మాయి పేరుతో జయరాంను ఇంటికి పిలిపించుకుని హింసించడంతో ఆయన చనిపోయినట్టు వెల్లడించారు. రాకేష్‌రెడ్డితో శిఖా చౌదరికి ప్రస్తుతం ఎటువంటి సంబంధాలు లేవన్నారు. శిఖా చౌదరి, రాకేష్‌రెడ్డి కలిసి దుబాయ్ ఎందుకు వెళ్లారన్న దానిపై సమాధానం లేదు. సాంకేతిక ఆధారాలు సంపాదించలేదని చెప్పి తుస్‌మనిపించారు. కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని దర్యాప్తు కొనసాగుతోందని ముక్తాయించారు. ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తారా అని ప్రశ్నించగా.. న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ జవాబిచ్చారు. పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూత్రధారులను కాపాడటానికి పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిడులు వచ్చినట్టు తెలుస్తోంది. శిఖా చౌదరిని కాపాడటానికి పోలీసులు ప్రయత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ దర్యాప్తులో శిఖా చౌదరి ఏం చెప్పిందనేది పోలీసులు వెల్లడించలేదు. ఆమె పేరు ఎత్తితేనే పోలీసు ఉన్నతాధికారులు మీడియాపై ఎదురు దాడి చేశారు. ఎప్పుడు ఏం చెప్పాలో తమకు తెలుసు అంటూ హుంకరించారు. హైదరాబాద్‌లో హత్య చేస్తే నందిగామ వరకు మృతదేహాన్ని ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. నిందితుడు చెప్పిన విషయాన్నే బయటపెట్టారు తప్పా, తామేమి విచారించారో వెల్లడించలేదు. తెలంగాణకు చెందిన ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌లతో రాకేష్‌రెడ్డి మాట్లాడినట్టు గుర్తించామని.. వీరిద్దరిపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళతామని కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. ఈరోజు జరిగిన మీడియా సమావేశం చూస్తే పోలీసులు ఈ కేసులో చాలా బాధ్యతరహితంగా వ్యహరించినట్టు కనబడుతోందన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు బదులేది? ♦ జయరాంను రాకేష్‌రెడ్డి ఒక్కడే ఎలా బంధించగలిగాడు? ♦ జయరాంను నిర్బంధించినప్పుడు రాకేష్ పాటు ఎవరున్నారు? ♦ శిఖా చౌదరి పాత్ర లేదనడానికి రుజువులు ఎందుకు చూపలేదు? ♦ శిఖా చౌదరి, రాకేష్‌రెడ్డి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ♦ జయరాం విజయవాడ వెళ్లాలనుకున్నట్టు రాకేష్‌కు ఎలా తెలిసింది? ♦ శిఖా చౌదరిపై జయరాం భార్య చేసిన ఆరోపణల మాటేంటి? ♦ వందల కోట్ల వ్యాపారాలు చేసే జయరాం రూ. 4 కోట్ల అప్పు తీర్చలేకపోయారా? ♦ పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏముంది? ♦ జయరాం మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి నందిగామకు రాకేష్ ఒక్కడే ఎలా తీసుకురాగలిగాడు? ♦ మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఎస్పీ, డీఎస్పీ ఎందుకు జవాబివ్వలేదు? -
మీడియా ముందుకు జయరాం హత్య కేసు నిందితులు
-
నాగాయలంక తీరంలో శ్రీలంక బోటు!
మచిలీపట్నం: కృష్ణాజిల్లా నాగాయలంక సముద్ర తీరానికి శుక్రవారం తెల్లవారుజామున విదేశీ బోటు కొట్టుకు వచ్చింది. దీంతో మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సముద్ర తీరానికి చేరుకుని... బోటును పరిశీలించారు. సదరు బోటు శ్రీలంకకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. గతంలో ఈ బోటు సముద్రంలో మునిగిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తుపాన్ కారణంగా బోటు తీరానికి కొట్టుకొచ్చి ఉంటుందని పోలీసులు అంటున్నారు. దీనిపై పోలీసులు మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. -
కృష్ణా జిల్లాలో స్కార్పియో కలకలం
-
కృష్ణా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు!
విజయవాడ : కృష్ణా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి కంచికచర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్‌పై అనుమానం వచ్చి స్కార్పియో వాహనాన్ని పోలీసులు ఆపారు. దాంతో డ్రైవర్ కారును వదిలేసి పరారైయ్యాడు. పారిపోయే సమయంలో సదరు డ్రైవర్ చేతిలో తుపాకీ ఉందని స్థానికులు వెల్లడించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని... పోలీసు స్టేషన్‌కు తరలించారు. కారు యజమాని ఎవరు ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. -
22 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
విజయవాడ: కృష్ణాజిల్లాలోని పలు పేకాట స్థావరాలపై పోలీసులు గురువారం అర్థరాత్రి ముమ్మర దాడులు నిర్వహించారు. ఆగిరిపల్లి మండలం శోభనాపురంలోని పేకట స్థావరాలపై దాడి చేసి... 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 15 వేల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పేకేటారాయుళ్లను అగిరిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే చాట్రయి మండలం మంకొల్లు వద్ద కూడా పోలీసులు పలు పేకాట స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడులలో మొత్తం 10 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 వేల నగదు స్వాధీనం చేసుకుని... చాట్రయి పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
బిగ్‌బజార్‌లో చోరీ కేసు చేధించిన పోలీసులు
విజయవాడ: హైదరాబాద్ కాచిగూడలోని బిగ్‌బజార్‌లో జరిగిన చోరీ కేసును కృష్ణాజిల్లా పోలీసులు చేధించారు. ఆ చోరీకి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 30 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... కృష్ణాజిల్లా కంచికచర్లలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓ వాహనంలో విలువైన వస్తువులతో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి... తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వస్తువుల గురించి వాహనంలో ప్రయాణిస్తులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు వెల్లడించారు. దాంతో పోలీసులు అనుమానించి సదరు వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు తరలించి... తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దాంతో శుక్రవారం అర్థరాత్రి కాచిగూడ బిగ్జబార్ చోరీ చేసింది తామేనని అంగీకరించారు. దాంతో కాచిగూడ పోలీసులు హైదరాబాద్ నగర పోలీసులకు సమాచారం అందించారు. నిందితులంతా సెక్యూరిటీ గార్డులే కావడం గమనార్హం. -
100 కేజీల బంగారం స్వాధీనం...
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలను ముమ్మురం చేశారు. అందులోభాగంగా విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలోని దొనబండ చెక్‌పోస్టు వద్ద గురువారం ఉదయం వాహనాలను సోదాలు నిర్వహించారు. ఆ క్రమంలో ఓ కారులో దాదాపు 100 కేజీలకు పైగా బంగారాన్ని పోలీసులు గుర్తించారు. ఆ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని,సీజ్ చేశారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని బంగారంపై ప్రశ్నిస్తున్నారు. అయితే బంగారం పట్టుకున్న విషయాన్ని పోలీసులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.