పుష్కరాలకు ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం
భక్తులకు ఉపయోగపడేలా రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌లతో కలసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పుష్కర స్నానాలకు వచ్చే భక్తులందరికీ ఉపయోగపడేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. pushkaralu.telangana.gov.in వెబ్సైట్ ద్వారా పుష్కరఘాట్లు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలతోపాటు బస్సులు, రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చన్నారు.
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా పోలీసులు రూపొందించిన మొబైల్ యాప్‌లను ఈ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఎక్కువ రద్దీ ఉన్న ఘాట్ల వివరాలను ఎప్పటికప్పుడు ‘ఫ్లాష్‌న్యూస్’ ద్వారా అప్డేట్ చేయడంతోపాటు ప్రత్యామ్నాయ ఘాట్ల వివరాలను తెలియజేస్తామని వివరించారు. రోజువారీగా వచ్చే భక్తుల సంఖ్య, ఇతర వివరాలను ఈ సైట్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనున్నట్లు చెప్పారు.