Krishna river ownership board
-
నీటి వాటా..ఆపరేషనల్ ప్రొటోకాల్ తేల్చాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వాటా తేలేదాకా...50:50 నిష్పత్తితో నీటిని పంచాలని, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల ఆపరేషనల్ ప్రొటోకాల్ ఖరారు అయితేనే ప్రాజెక్టులు అప్పగిస్తామని తెలంగాణ స్పష్టం చేసినట్టు కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వెల్లడించింది. ఈనెల 1వ తేదీన ప్రాజెక్టుల అప్పగింతపై కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సంబంధించిన మినట్స్‌ను బోర్డు శుక్రవారం విడుదల చేసింది. మినట్స్‌లో ఏముందంటే... ► రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తేనే జలవిద్యుత్ కేంద్రాలు అప్పగించగలమని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపినట్టు బోర్డు పేర్కొంది. ► జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన ఓ లేఖను ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్ అందజేశారు. ఆ లేఖను మినట్స్‌లో బోర్డు జతచేసింది. ► నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులతోపాటు వాటి పరిధిలోని 15 కాంపోనెంట్లు అప్పగించాలని కృష్ణా నదీ యాజమాన్యబోర్డు(కేఆర్ఎంబీ) కోరింది. వీటి నిర్వహణకు భారీగా నిధులు అవసరం. ఆ నిధులను నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలి. నాగార్జునసాగర్ డ్యామ్ పై మొహరించిన సీఆర్ పీఎఫ్ బలగాలు ఇరు రాష్ట్రాల అధికారులను ప్రాజెక్టుపై అనుమతిస్తాయి. ప్రాజెక్టుపై ఏ పనులు చేయాలన్నా... ఉద్యోగులను నియమించుకోవాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ► త్రీమెంబర్ కమిటీ(కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి, తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉండే) తీసుకునే నిర్ణయాలు/ వాటర్ రిలీజ్ ఆర్డర్ కచి్చతంగా ఆయా కాంపోనెంట్లను అమలు చేయాలి. కమిటీ నిర్ణయాలు అమలు చేయాలి. ► ఒకవేళ ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాలు బోర్డుకు అప్పగిస్తే... ఆ ప్రాజెక్టులపై ఆయా రాష్ట్రాల నుంచి సమాన స్థాయిలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. వేతనాలతో పాటు ఇతర ప్రయోజనాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ఏ మేరకు ఉద్యోగులు కావాలో, ఆ వివరాలన్నీ వారం రోజుల్లోపు బోర్డుకు అందించాలి. ప్రాజెక్టులన్నీ బోర్డు నియంత్రణలో ఉంటాయి. అయితే నిరంతర, అత్యవసర నిర్వహణ పనుల ను సంబంధిత రాష్ట్రాలు, ఇదివరకు ఉన్న పద్ధ తిని (శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ) పాటించాల్సి ఉంటుంది. సాగర్, శ్రీశైలం పరిధిలో ఉన్న కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఏపీ ఈఎన్సీ తెలిపారు. అయితే తెలంగాణ ప్రాజెక్టులతో పాటే మా ప్రాజెక్టులు తీసుకోవాలన్నారు. రాహుల్‌బొజ్జా లేఖలోని ముఖ్యాంశాలు జనవరి 17వ తేదీన ప్రాజెక్టుల అప్పగింతపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం తాలూకు మినట్స్‌కు సవరణలు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు. అందులో ఏముందంటే....‘నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేం. ట్రిబ్యునల్ కృష్ణా జలాలను పంచేదాకా 50:50 నిష్పత్తితో నీటిని పంచాలి. శ్రీశైలం జలాశయం కట్టిందే జలవిద్యుత్ ఉత్పాదన కోసం...నాగార్జునసాగర్ కింద ఉన్న నీటి అవసరాలు తీర్చడానికి వీలుగా దీనిని కట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 830 అడుగులుగా ఉండాలి. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్ తేలేదాకా వాటిని అప్పగించలేం. ఇక జలవిద్యుత్ కేంద్రాలతో పాటు ప్రాజెక్టుల అప్పగించాలంటే తెలంగాణ ప్రభుత్వమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాజెక్టులు బోర్డుకు ఇవ్వలేం. ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పకపోయినా, మినట్స్‌లో రికార్డు అయ్యింది: రాహుల్ బొజ్జా ‘‘జనవరి 17వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పినట్టు మినట్స్‌లో రికార్డు అయ్యింది. అయితే తాము చెప్పిన అంశాలేవీ ఇందులో నమోదు కాలేదు. ఆ మినట్స్‌లో సవరణలు చేయాలని కోరుతూ జనవరి 27వ తేదీన కేంద్రానికి లేఖ రాశాం’అని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. శుక్రవారం ఆయన ఈఎన్సీ మురళీధర్‌తో కలిసి శుక్రవారం జలసౌధలో విలేకరులతో మాట్లాడారు. బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయం గతంలోనే తీసుకున్నారని తెలిపారు. 2023–24 బడ్జెట్లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించనున్నామని, ఇందు కోసం సీడ్ మనీ కింద రూ.200 కోట్లు ఇవ్వనున్నామని ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుది ప్రేక్షకపాత్ర: ఈఎన్సీ సి.మురళీధర్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుది ప్రేక్షకపాత్ర మాత్రమేనని ఈఎన్సీ (జనరల్) మురళీధర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలంటే నీటిని ఏ ప్రాతిపదికన పంచుకోవాలి అనే అంశాలతో ముడిపడిన ఆపరేషనల్ ప్రొటోకాల్‌పై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని గుర్తు చేశారు. త్రీమెంబర్ కమిటీ (కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ/ కన్వినర్, తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు) నిర్ణయం ఆధారంగానే నీటి విడుదల, పంపిణీ, పర్యవేక్షణ ఉంటుందన్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆయా రాష్ట్రాల భూభాగంలో ఉన్నాయన్నారు. సాగర్‌లో సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని, గతనవంబరు 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని కేంద్ర జలశక్తి శాఖను కూడా కోరామని, కేంద్రం ఆదేశించినా పోలీసు బలగాలను వెనక్కితీసుకోవడం లేదన్నారు. -
విభజన హామీలపై నిలదీయండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని, వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఎంపీలు ఆయా అంశాలపై మాట్లాడా లని చెప్పారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింతపై గళం విప్పాలని ఆదేశించారు. తెలంగాణ నీటి వనరులను గుప్పిట పెట్టుకునేందుకు కేంద్రం చేస్తు న్న ప్రయత్నాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్ష తన సుమారు మూడు గంటల పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, కేటీ రామారావు, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లొద్దు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఎంపీల పైనే ఉందని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణలోని వెను కబడిన జిల్లాలకు ఐదో ఇన్స్టాల్మెంట్ కింద రూ.450 కోట్ల విడుదల, ఎన్హెచ్ఏఐ సాయంతో ఆదిలాబాద్ సీసీఐ పునరుద్దరణ, రాష్ట్రంలో ఐఐఎం, 23 నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి ప్రస్తావించాలని కేసీఆర్ చెప్పారు. అలాగే పెండింగులో ఉన్న రైల్వే పనులు వేగవంతం చేసేందుకు నిధుల విడుదల, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీ రథకు రూ.19,205 కోట్ల మంజూరు, బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు, ఎస్సీల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలు లేవనెత్తాలని సూచించారు. త్వరలో అన్ని కార్యక్రమాలకు..! ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్‌రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుంటి ఎముక చికిత్స అనంతరం కోలుకుంటూ తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, మునుపటి తరహాలో చురుగ్గా ఉన్నారని పలువురు ఎంపీలు తెలిపారు. త్వరలో పార్టీ పరంగా జరిగే అన్ని కార్యక్రమాలకు తాను స్వయంగా హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఈ భేటీలో ఎలాంటి ప్రస్తావన రాలేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీ పరంగా జరుగు తున్న సన్నద్ధతపైనా కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లా డారు. నియోజకవర్గాల వారీ సన్నాహక సమావే శాల్లో కేడర్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, పార్టీ పరంగా చేపట్టబోయే దిద్దుబాటు చర్యలు, కార్యక్రమాల గురించి తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహాలు, ఎత్తుగడలను వివరించారు. శని వారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్ని కల సన్నాహక సమావేశాల గురించి ప్రస్తావిస్తూ, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటూనే ఈ భేటీ లకు ఎంపీలు హాజరుకావాలని ఆదేశించారు. -
సాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు
విజయపురిసౌత్/రెంటచింతల (మాచర్ల): తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై గత నెలలో జారీ చేసిన గెజిట్‌ను అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు చీఫ్ ఇంజినీర్లను నియమించింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సీఈలు టీకే శివరాజన్, అనుపమ్ ప్రసాద్ కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి అధ్యయనం చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం సాగర్ ప్రాజెక్టును, టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టును సందర్శించారు. పరిశీలనలో భాగంగా సాగర్ ప్రధాన డ్యాం, కుడికాలువ, హెడ్ రెగ్యులేటర్, జలవిద్యుత్ కేంద్రం, ఎడమకాలువ హెడ్ రెగ్యులేటర్, క్రస్ట్‌గేట్లను, 220, 420 గ్యాలరీలను వాక్‌వే మీద నుంచి స్పిల్‌వేను పరిశీలించారు. దెబ్బతిన్న స్పిల్‌వే ఫొటోలను సేకరించారు. సాగర్ ప్రధాన డ్యాం వద్ద కుడికాలువ, ఎడమకాలువల వద్ద ఏర్పాటు చేసిన టెలీమెట్రీలను కూడా పరిశీలించారు. కాగా, పచ్చదనం, పరిశుభ్రత విషయంలో నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు ఇతర విద్యుత్ ప్రాజెక్టులకు రోల్‌మోడల్‌గా ఉందని వారు కితాబిచ్చారు. సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ధర్మానాయక్, ఈఈ సత్యనారాయణ, డీఈ పరమేష్, టెయిల్‌పాండ్ ప్రాజెక్టు డీఈలు దాసరి రామకృష్ణ, త్రినా«థ్, డ్యామ్ ఈఈలు కొడాలి శ్రీకాంత్, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటి పంపకాలపై కదలిక
సాక్షి, హైదరాబాద్: నదీ జలాల పంపకంపై రెండు తెలుగు రాష్ట్రాలతో పూర్తిస్థాయి చర్చలు జరిపేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ నెల 27న పూర్తి స్థాయి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లేఖలు రాసింది. మొత్తం 13 కీలక అంశాలను సమావేశం అజెండాలో చేర్చింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో జలాల పంపిణీ, క్యారీ ఓవర్, వరద జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్‌ల సమర్పణ, అనుమతులు, విద్యుత్ వినియోగం, చిన్న నీటి వనరుల కింద వినియోగం, బడ్జెట్, సిబ్బంది కేటా యింపులు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. చెరిసగం వాటాలు చేయాలంటున్న తెలంగాణ సాధారణంగా ప్రతి ఏటా జూన్‌లో నీటి సంవ త్సరం ఆరంభానికి ముందే బోర్డు భేటీ నిర్వహి స్తారు. నీటి వాటాలు, కేటాయింపులు, అంతకు ముందు వినియోగం తదితర లెక్కలు తేలుస్తారు. కానీ ఈ ఏడాది ఆ ప్రక్రియ ఇంతవరకు జరగలేదు. మే 25న భేటీ నిర్వహిస్తామని చెప్పినప్పటికీ, ఆరోజు ఇతర కార్యక్రమాలున్నాయని ఏపీ చెప్పడంతో సమావేశం జరగలేదు. ఆ తర్వాత కొత్త చైర్మన్ రాకలో ఆలస్యంతో భేటీ కాలేదు. అనంతరం భేటీ అయినా కేంద్రం గెజిట్ విడుదల, దాని అమలుపై చర్చల నేపథ్యంలో నీటి వినియోగం, పంపకాలపై చర్చ జరగలేదు. అదీగాక ఈ ఏడాది ఆగస్టు తొలి వారానికే ప్రాజెక్టులన్నీ నిండటంతో ఆయా అంశాలకు సంబంధించి పెద్దగా సమస్యలు రాలేదు. అయితే ఇటీవల తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల కింద చేస్తున్న వినియోగంపై ఏపీ ఫిర్యాదులు చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది నుంచి కృష్ణా జలాల్లో యాభై శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఏపీ, తెలంగాణలకు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతూ వస్తున్న కృష్ణా జలాల పంపిణీని ఈ ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని చెబుతోంది. ఈ నేపథ్యంలో జరగనున్న పూర్తిస్థాయి భేటీలో ఈ అంశం పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. క్యారీఓవర్, వరద, మళ్లింపు జలాలపైనా చర్చ ఇక మళ్లింపు జలాల్లో వాటా, క్యారీఓవర్, వరద జలాల వినియోగంపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. 2019–20 నీటి సంవత్సరంలో కేటాయించిన నీటిలో 50.851 టీఎంసీలను తాము వాడుకోలేకపోయామని.. వాటిని 2020– 21లో వినియోగించుకుంటామని గతేడాది తెలం గాణ సర్కార్ కృష్ణా బోర్డును కోరింది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. కాగా బేసిన్‌లోని ప్రాజె క్టులన్నీ నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ కోరుతోంది. అయితే దీనిపై తెలంగాణ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. బోర్డు భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం.. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటాను కేటాయించాలని గట్టిగా కోరుతోంది. దీంతో పాటే ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. పోతిరెడ్డిపాడు ద్వారా అదనంగా వేరే బేసిన్‌కు, ఇతర ప్రాజెక్టులకు నీటిని తరలించ డంపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతోంది. దీనిపై ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈ అంశాలన్నిటిపైనా 27న జరిగే భేటీలో వాదనలు జరిగే అవకాశాలున్నాయి. -
తెలంగాణకు 17.5.. ఏపీకి 18.5 టీఎంసీలు
-
తెలంగాణకు 17.5.. ఏపీకి 18.5 టీఎంసీలు
♦ ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణా బోర్డు నిర్ణయం ♦ తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు ♦ హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీలు ♦ ఏపీ వాటాగా హంద్రీ-నీవాకు 5, చెన్నై తాగునీటికి 3, తెలుగుగంగకు 5 టీఎంసీలు సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న జలాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఏపీకి కేటాయించింది. అక్టోబర్ అవసరాలకుగాను తెలంగాణకు 17.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఖరీఫ్‌కు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 30.2 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు కలిపి మొత్తంగా 40.3 టీఎంసీలు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో కృష్ణా బోర్డును కోరింది. ఇందులో 15 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు గతంలోనే అనుమతులిచ్చింది. తర్వాత సాగర్ ఎడమ కాల్వ కింద జోన్-1, జోన్-2లోని ఖరీఫ్ సాగు అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించాలంటూ తెలంగాణ మరో లేఖ రాసింది. ఇక ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కింద 11 టీఎంసీలు, హంద్రీనీవా కింద 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.5 టీఎంసీలు కావాలని విన్నవించింది. వీటిని పరిశీలించిన బోర్డు తాజాగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఇరురాష్ట్రాలు ఎంత మేర నీటిని వినియోగించాయో వివరిస్తూ ప్రస్తుత కేటాయింపులు చేయడం గమనార్హం. మూడు చోట్ల వాటాకు మించి.. కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు తెలంగాణ ఏఎంఆర్పీ కింద 10.21 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద 5.13, కల్వకుర్తి కింద 1.745 టీఎంసీలు కలిపి మొత్తంగా 17 టీఎంసీలను వినియోగించుకున్నట్లు బోర్డు తన లేఖలో పేర్కొంది. ఏపీ పోతిరెడ్డిపాడు కింద 23.79 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ కింద 9.98, కృష్ణా డెల్టా కింద 20.41, హంద్రీనీవా కింద 9.33 టీఎంసీలు కలిపి మొత్తంగా 63.524 టీఎంసీలు వినియోగించుకుందని వివరించింది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఏఎంఆర్పీ కింద వాటాకు మించి వినియోగం చేశారని లేఖలో తెలిపింది. అధికంగా వినియోగిస్తే ఈ నీటిని వాడొద్దు తాజాగా కృష్ణా బోర్డు తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీలు కలిపి 17.5 టీఎంసీల వినియోగానికి అంగీకరించింది. హంద్రీనీవాకు 5 టీఎంసీలు, చెన్నై తాగునీటికి 3, ఎస్ఆర్బీసీకి 3, తెలుగుగంగ ప్రాజెక్టు 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.5 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏపీకి 18.5 టీఎంసీల విడుదలకు అంగీకారం తెలిపింది. ఇవి గత ఆగస్టులో నీటి కేటాయింపులకు అదనమని, అప్పటి ఆదేశాల్లో పేర్కొన్న దాని కంటే ఎక్కువగా వాడుకొని ఉంటే ప్రస్తుత నీటిని వాడటానికి అవకాశం ఉండదని స్పష్టంచేసింది. ఒకవేళ తక్కువగా వినియోగించి ఉంటే మిగిలిన నీటిని వినియోగించుకోవచ్చని వివరించింది. ఏ రాష్ట్రమైనా అధికంగా నీటిని వాడుకొని ఉంటే ఆ రాష్ట్రం త్రిసభ్య కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించింది.