Krishna River Water Dispute: ఎవరి వాదన వారిదే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో నలుగుతున్న వివాదాలపై వాదనలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ఒకరిపై మరొకరు ఫిర్యాదులతో లేఖలు సంధించిన తెలం గాణ, ఏపీలు.. తొలిసారి బోర్డు సమక్షంలో ముఖా ముఖిగా భేటీ కానున్నాయి. బుధవారం జరగనున్న కృష్ణా బోర్డు పూర్తిస్థాయి సమావేశంలో నీటి వాటాలు, పంపకాలు, ఇప్పటివరకు చేసిన నీటి వినియోగం, అనుమతుల్లేని ప్రాజెక్టుల నిలుపుదల అంశాలపై ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు తమ తమ వాదనలు వినిపించనున్నారు. దీనితో పాటు కేం ద్రం వెలువరించిన గెజిట్ అంశాల అమలుపై జరిగే కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త భేటీలోనూ తమ అభిప్రాయాలు వెల్లడించ నున్నారు. ఈ భేటీ లకు రెండు బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్ర శేఖర్ అయ్యర్, బోర్డు సభ్య కార్యదర్శులతో తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు రజత్ కుమార్, శ్యామలరావు, ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, రెండు రాష్ట్రాలకు చెందిన అంత ర్రాష్ట్ర జల వనరుల విభాగపు ఇంజనీర్లు పాల్గొన నున్నారు.
కృష్ణా జలాల్లో లభ్యతగా ఉండే నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటివరకు 34ః66 నిష్పత్తిలో వాడుకుంటూ రాగా, ఈ ఏడాది నుంచి 50ః50 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ కోరుతోంది. ఏపీ మాత్రం 79.88:20.12 నిష్పత్తిలో పంపిణీ చేయాలని అంటోంది. దీనిపై బుధవారం వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇతర అంశాలతో పాటు శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై కూడా గట్టి వాదనలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ అంటుంటే.. శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి కేంద్రమేనని, ఏపీనే అక్రమంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటిని అవతలి బేసిన్‌కు తరలిస్తోందని తెలంగాణ చెబుతోంది. మరోవైపు కృష్ణా, గోదావరి గెజిట్ నోటిఫికేషన్లపై సాయంత్రం జరగనున్న సంయుక్త భేటీకి తెలంగాణ తొలిసారిగా హాజరవుతోంది. గెజిట్‌పై ఇంతవరకు ఎక్కడా నోరువిప్పని రాష్ట్రం ఎలాంటి వాదన చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.