వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని....
భర్తను హత్య చేసిన భార్య
వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఘాతుకం
నూజెండ్ల: అక్రమ సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన సంఘటన మండల కేంద్రమైన నూజెండ్ల సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వినుకొండ రూరల్ సీఐ టి.వి. శ్రీనివాసరావు, ఐనవోలు ఎస్సై విజయ చరణ్ తెలిపిన వివరాల ప్రకారం... నకిరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన పొట్లూరి అమరలింగయ్యకు, పిన్నెల్లిగ్రామానికి చెందిన కృష్ణవేణితో 16 ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి 7వ తరగతి చదువుతున్న నాగలక్ష్మి, ఆరోతరగతి చదువుతున్న ప్రియాంక అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రాజుపాలెం గ్రామానికి చెందిన చిన్న అంకయ్యతో రెండేళ్లుగా అక్రమసంబంధం సాగించిన కృష్ణవేణి భర్తకు దూరంగా ఉంది. ఇటీవల కుటుంబ పెద్దలు మందలించి భర్తతో ఉండాలని రాజీ చేసి ఒకటి చేశారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం స్వగ్రామం వదిలి బతుకు దెరువుకోసం నూజెండ్ల వచ్చారు.
నూజెండ్ల శివారులో కోళ్లఫారంలో అమరలింగయ్య వాచ్‌మన్‌గా పనికి కుదిరాడు. అయితే ఇటీవల కాలంలో భార్య ప్రవర్తనలో మార్పురాకపోవటం, మరోవ్యక్తితో సంబంధం పెట్టుకోవడంతో తరచూ ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి అమరలింగయ్య హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం పక్కనే ఉన్న మరో కుటుంబానికి తన భర్తను ఎవరో చంపారని కృష్ణవేణి తెలిపింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐనవోలు పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతుని భార్య కృష్ణవేణి చేతులకు రక్తపు మరకలు ఉండటంతో అనుమానించిన పోలీసులు ఆమెను విచారించారు. కృష్ణవేణి, ఆమె ప్రియుడు చిన్న అంకయ్య కలసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అక్రమసంబధాలకు అడ్డుగా ఉన్న భర్తను అర్ధరాత్రి సమయంలో ప్రియుడితో కలసి కత్తితో మెడపై, పొట్టలో పొడిచి చంపినట్లు తేలింది. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చినఅంకయ్య, కృష్ణవేణిలను పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలో మూడోవ్యక్తి ప్రమేయం కూడా ఉండిఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.