శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు..
శ్రీశైలం/గద్వాల/సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఎట్టకేలకు శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువనున్న శ్రీశైలానికి బుధవారం సాయంత్రం నీరు విడుదలైంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండడంతో జూరాల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదనను అధికారులు ప్రారంభించారు. తద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 52.0555 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయ నీటిమట్టం 832.40 అడుగులుగా నమోదైంది.
ఆలమట్టి నుంచి స్థిరంగా ఔట్ ఫ్లో..
కర్ణాటకలోని ఆలమట్టి జలాశయం నుంచి దిగువకు ఔట్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం లక్షా పదివేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జలాశయంలో నీటిమట్టాన్ని 518.6 (గరిష్టం 519.6) మీటర్ల వద్ద కొనసాగిస్తున్నారు. మొత్తం 26కుగాను 16 గేట్లను ఎత్తివేశారు. దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,09,889 క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టులో 25 క్రస్టుగేట్లను 0.75 మీటర్లు తెరచి దిగువ నదిలోకి 96,295 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాలకు 99,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జూరాల రిజర్వాయర్ గరిష్టస్థాయికి చేరడంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను గురువారం తెరిచే అవకాశముంది.
స్థిరంగా అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉన్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
రేపు విజయవాడకు సచిన్ రాక
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ ఎంజీ రోడ్డులో రూ.125 కోట్లతో నిర్మించిన పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్‌ను శుక్రవారం ఉదయం ప్రఖ్యాత క్రికెటర్, ఎంపీ, భారతరత్న సచిన్ టెండూల్కర్ ప్రారంభించనున్నారు. బుధవారం పీవీపీ గ్రూప్స్ మేనేజింగ్ డెరైక్టర్ పొట్లూరి సాయిపద్మ ఈమేరకు వివరాలను వెల్లడించారు.