ks Rama Rao
-
అవినీతి బాబును వెనకేసుకొస్తోన్న 'టాలీవుడ్' పెద్దలు
అవినీతిలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి చంద్రబాబు జైలుకెళ్లినా.. ఆయన వల్ల ఏదో రూపంలో లబ్ధి పొందిన కొందరు సినీ ప్రముఖులు బ్రహ్మాండం బద్దలైపోయినట్లు లోకమంతా అన్యాయమైపోయినట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. తాము అభిమానించే చంద్రబాబును విడుదల చేయాలని కోరితే ఓకే అనుకోవచ్చు. కానీ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిన ఏపీ ప్రభుత్వాన్ని అర్జంట్‌గా రద్దు చేసేసి, రాష్ట్రపతి పాలన పెట్టేయాలంటూ కొందరు ఉన్మాద డిమాండ్లు చేస్తున్నారు. తాను అవినీతికి పాల్పడలేదని చంద్రబాబే చెప్పలేకపోతున్నారు. ఆయన తరపు న్యాయవాదులూ ఈ మాట అనడం లేదు. కానీ కొందరు సినీ మనుషులు మాత్రం కణ్వమహర్షిని అరెస్ట్ చేసినట్లు తెగ బాధపడిపోతున్నారు. దీన్ని చూసి మేథావులు ఏవగించుకుంటున్నారు. రూ.371 కోట్ల లూటీ అయిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలతో పట్టించిన సంగతి తెలిసిందే. ఆ ఆధారాలు చూసిన తర్వాతనే గౌరవ న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కుంభకోణంలో తాను డబ్బులు తినలేదని కానీ, తన షెల్ కంపెనీలకు డబ్బులు రాలేదని కానీ చంద్రబాబు అనలేదు. ఆయన కోర్టులో వాదించిందల్లా తనను అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు కోర్టులో హాజరు పరచలేదని ఫిర్యాదు చేశారు. అయితే సీఐడీ పోలీసులు నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని ఏసీబీ కోర్టు భావించింది. అందుకే చంద్రబాబు నాయుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డారని తెలిసినా కూడా కొంతమందికి మాత్రం ఆయన్ను అరెస్ట్ చేయడం నచ్చడం లేదు. అందులోనూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రకరకాలుగా ఆర్ధికంగా పదవుల పరంగా లబ్ధి పొందిన కొందరు సినీ రంగ ప్రముఖులయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం మహా అపరాధం అన్నట్లు విలవిల్లాడిపోతున్నారు. చంద్రబాబునే అరెస్ట్ చేస్తారా? అంటూ పళ్లు పటపట కొరికేస్తున్నారు. సినీ నిర్మాత, టిడిపి కార్యకర్త, చంద్రబాబు హయాంలో భూముల పరంగా లబ్ధిపొందిన కొద్ది మంది అస్మదీయుల్లో ఒకరు అయిన అశ్వనీదత్ అయితే చంద్రబాబును అరెస్ట్ చేసిన వారిలో ఏ ఒక్కరికీ పుట్టగతులుండవని శపించేశారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు అశ్వనీదత్‌కు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆయన శాపాలు నిజం అయిపోయేవేమో! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వంలో పదవి అనుభవించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు సహజంగానే రుణం తీర్చుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడి అరెస్ట్ అన్యాయం అన్నారు. అది రాజకీయ కక్ష సాధింపే అని కూడా అన్నారు. ఆయన్ను విడుదల చేయాలని కోరారు. అందులో ఎలాంటి తప్పూ లేదు కానీ చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తూ దొరికిపోయినట్లు లోకంలో ప్రతీ ఒక్కరికీ తెలిసినా బాబు అభిమానులు ఇలాంటి డిమాండ్లతో కాలక్షేపం చేయాలనుకోవడమే ఆశ్చర్యంగా ఉందంటున్నారు మేధావులు. ఇక మరో నిర్మాత కె.ఎస్.రామారావు అయితే చాలా క్రియేటివిటీ చూపించారు. కమర్షియల్‌గా చంద్రబాబు వల్ల ఆయన ఏం లబ్ధి పొందారో తెలీదు కానీ చంద్రబాబుపై ఉన్న కేసులో ఆధారాలు లేవని రామారావు అనేశారు. ఆధారాలు లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు దర్యాప్తు చేస్తున్నాయి?.. రాష్ట్ర దర్యాప్తు సంస్థ బాబును ఎందుకు అరెస్ట్ చేసింది? ఆధారాలు లేకపోతే ఎందుకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు? ఆధారాలు లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు న్యాయస్థానంలో దాన్ని సవాల్ చేయలేదు? చంద్రబాబు అరెస్ట్ మీకు తెలీకుండానే జరిగిందా? అంటూ కె.ఎస్.రామారావు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. అంత వరకు ఫర్వాలేదు. చంద్రబాబు నాయుడు చాలా నిజాయితీ పరుడు అని అభిప్రాయపడ్డారు. పోనీలే అది ఆయన అభిప్రాయం అనుకోవచ్చు. కానీ ఓ పిచ్చి డిమాండ్ కూడా చేశారు రామారావు. ఉన్నట్లుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలట. జగన్మోహన్ రెడ్డిని దింపేసి రాష్ట్రపతి పాలన విధించేయాలట? రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపైనా, ప్రజాస్వామ్యంపైనా కేఎస్ రామారావుకు ఎంత గౌరవం ఉందో ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయి. సినిమా డైలాగులు సినిమాల్లో బాగుంటాయి. బయటకు వచ్చినపుడు పైన చెప్పినోళ్లంతా మనుషుల్లా మాట్లాడాలి అంటున్నారు రాజకీయ పండితులు. చంద్రబాబు అవినీతి చేశాడా? లేదా అన్నది కోర్టులు తేలుస్తాయి. ఒకవేళ ఆయన తప్పు చేయలేదని కోర్టు నమ్మితే ఆయన్ను విడుదల చేస్తాయి. ఆయన తప్పునకు దర్యాప్తు సంస్థలు సమర్పించిన ఆధారాలు సరైనవే అని భావిస్తే చంద్రబాబు నాయుడికి చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు. ఈ లోగా చంద్రబాబు నాయుడి దగ్గరో ఆయన పార్టీ నేతల దగ్గరో లేదంటే చంద్రబాబు కొమ్ము కాసే పత్రికల దృష్టిలో పడాలనో.. ఇలాంటి సినీ ప్రముఖులు నోటికెంతొస్తే అంతా మాట్లాడ్డం మాత్రం క్షమించరాని నేరమే అంటున్నారు విశ్లేషకులు. :::CNS యాజులు, సీనియర్ జర్నలిస్టు -
O Saathiya Trailer: సరికొత్త ప్రేమకథగా ‘ఓ సాథియా’
ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా దివ్య భావన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ సాథియా’. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత కేఎస్ రామారావు విడుదల చేసి, ‘‘సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఆర్యన్ గౌర తన గురించి చెప్తుంటే నా తొలి సినిమా కష్టాలు గుర్తొచ్చాయి’’ అన్నారు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు చక్కని చిరునవ్వుతో థియేటర్ నుంచి బయటికొస్తారు’’ అన్నారు ఆర్యన్ గౌర. ‘‘నా గురువు విజయేంద్ర ప్రసాద్ గారివల్లే నేను ఇక్కడ ఉన్నాను. సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’’ అన్నారు దివ్య భావన. ‘‘మా సినిమా చూశాక అందరికీ తమ తొలి ప్రేమ గుర్తుకొస్తుంది’’ అన్నారు సుభాష్ కట్టా. -
'ఆర్ఆర్ఆర్' టీం..పద్మశ్రీ కంటే గొప్ప అవార్డు తీసుకొచ్చారు: నిర్మాత
‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ‘ఆస్కార్’ వంటి ప్రతిష్టాత్మక అవార్డు రావడమంటే ఇండియాకి వచ్చినట్టే. ఇందుకు ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి తెలుగువారు గర్వించాల్సిన సమయం ఇది’’ అని నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులకంటే గొప్ప అవార్డు తీసుకొచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌ని, సాంకేతిక నిపుణులను మనం సన్మానించుకోవాలి.. గౌరవించుకోవాలి. ఎందుకంటే ఇది తెలుగు వారందరికీ దక్కిన గౌరవం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌ని, అవార్డు గ్రహీతలను చాలా గొప్పగా సత్కరించాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ వంతుగా ‘ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ కార్యవర్గం ఆధ్వర్యంలో నేడు శిల్ప కళావేదికలో సన్మానం చేస్తుండటం చాలా గొప్ప విషయం. ఇందులో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుంది’’ అన్నారు. -
నన్ను తొలగించలేదు: నిర్మాత కేఎస్ రామారావు
Producer KS Rama Rao React On Rumours: ‘ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్’ వైజాగ్ అధ్యక్షుడిగా నన్ను తొలగించినట్లు వచ్చిన వార్త పూర్తిగా అసత్యం. ఆ ఎఫ్ఎన్సీసీకి ఇప్పటికీ నేనే అధ్యక్షుడిగా ఉన్నాను’’ అని నిర్మాత కె.ఎస్. రామారావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వైజాగ్ ఎఫ్ఎన్సీసీ అధ్యక్షుడిగా నేను, వైస్ ప్రెసిడెంట్‌గా వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా కాంతిరెడ్డి ఉన్నాం. విశాఖపట్నంలోని సినిమా రంగానికి చెందిన వివిధ శాఖలకు చెందిన పన్నెండువందలయాభై మంది సభ్యులుగా ఉన్నారు. చదవండి: ‘సర్కారు వారి పాట’ అప్డేట్, 20న సెకండ్ సింగిల్ ఇటీవలే వైజాగ్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేసి, అధ్యక్షునిగా నన్నే ఉండమని ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘వైజాగ్ ఎఫ్ఎన్సీసీ’ అధ్యక్షునిగా నన్ను తొలగించారనీ, సంస్థలో రూ. 30 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయనడం అవాస్తవం. అవగాహన లేనివారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ప్రోత్సాహకాలు ప్రకటించారు. నటీనటులకు స్థిరనివాసం, స్టూడియో నిర్మాణాలకు స్థలం ఇస్తామని పేర్కొన్నందుకు సీఎం జగన్‌గారికి, మంత్రి పేర్ని నానికి థ్యాంక్స్. ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణంలో తప్పుడు వార్తలు రావడం అభివృద్ధికి ఆటంకం’’ అన్నారు. -
శ్రీశైలం దేవస్థానంలో రూ.3 కోట్లకు పైగా అక్రమాలు
శ్రీశైలం/సాక్షి, అమరావతి: ప్రముఖజ్యోతిర్లింగ శైవక్షేత్రమైన కర్నూలు జిల్లాలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో ఆర్జిత సేవా టికెట్ల విక్రయాల్లో సుమారు రూ.1.42 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం దేవస్థానంలో ఈ విషయాన్ని విలేకరులకు తెలియజేస్తూ, 2016–18 మధ్య కాలంలో కంప్యూటర్లో ఉన్న సాంకేతిక లొసుగులను ఆధారం చేసుకుని అప్పట్లో ఆయా విక్రయ కేంద్రాల్లో పనిచేసిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది అక్రమార్జనకు పాల్పడినట్లు చెప్పారు. ముఖ్యంగా రూ.150 శీఘ్రదర్శనం టికెట్లు, రూ.1,500 అభిషేకం, ఆర్జిత సుప్రభాత, మహామంగళ హారతి సేవాటికెట్లలోనే అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా ఏఈవో స్థాయి అధికారిని నియమించామన్నారు. అక్రమాలపై రాష్ట్ర దేవదాయ శాఖ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లకు సమాచారమిచ్చామని తెలిపారు. శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పోలీసు విచారణకుగానూ ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావును నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులిచ్చారు. అక్రమార్కుల దందా టీడీపీ హయాంలోనే! ఈ దందా అంతా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరగడం గమనార్హం. ఆలయంలో ఒక కౌంటర్లోని సిబ్బందిని మరో కౌంటర్లోకి బదిలీ చేస్తుండడం సహజంగానే జరుగుతుంటుంది. అయితే, బదిలీ అయిన వారి ఐడీ పాస్వర్డ్ ఆధారంతో కొత్తగా విధులకు వచ్చిన సిబ్బంది అదే పాస్‌వర్డ్‌ను ఉపయోగించి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 2018 జనవరి నుంచి డిసెంబర్ వరకు దేవస్థానం పరిధిలోని ఒక సత్రం పేరుపై ఐడీని రూపొందించి సుమారు రూ.50 లక్షల వరకు నిధులను మింగేశారు. ఇందుకోసం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, ఐడీని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా టికెట్లను విక్రయించి ఆ సొమ్మును కాజేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆర్థిక లావాదేవీలతో ప్రమేయం ఉన్న కౌంటర్లను కేటాయించడం, వాటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలనే అక్రమార్కులకు వరంగా మారిందని తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన మంత్రి శ్రీశైల ఆలయంలో దర్శన టికెట్ల వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శాఖాపరమైన విచారణతో పాటు పోలీసు విచారణకు ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు జిల్లా ఎస్పీతో మంత్రి ఫోన్లో మాట్లాడారని.. అవినీతికి పాల్పడ్డ సొమ్మును తిరిగి రాబట్టేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని మంత్రి ఆదేశించినట్టు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దేవదాయ శాఖ పరంగా ప్రత్యేకాధికారిని నియమించి విచారణ చేపట్టాలని, సైబర్ వ్యవహారాల్లో పరిజ్ఞానం ఉన్న అధికారి ద్వారా విచారణ జరిపించడంతో పాటు అంతర్గత ఆడిట్ రిపోర్టుతో సమగ్ర నివేదిక ఇవ్వాలని దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావును మంత్రి ఆదేశించారు. మొత్తం రూ.3 కోట్ల పైనే! తాజాగా బయటపడ్డ రూ.1.42 కోట్లు, పెట్రోల్ బంక్‌లో రూ.44 లక్షలు, డొనేషన్ కౌంటర్లో రూ.75 లక్షలు, ఇతర అక్రమాలు కలిపి మొత్తం సుమారు రూ.3 కోట్లపైనే మల్లన్నకు శఠగోపం పెట్టారని తెలుస్తోంది. ఇందులో పెట్రోల్ బంక్, డొనేషన్ కౌంటర్లో అక్రమాలకు పాల్పడ్డ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది, సంబంధిత వ్యక్తుల నుంచి 50 నుంచి 60 శాతం వరకు నగదును తిరిగి వసూలు చేశారు. -
నేను సిక్స్ కొట్టాలనే దిగుతా
‘‘చాలామంది దగ్గర తెలివితేటలు, ప్రతిభ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన ప్రతిభ, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న మనిషి విజయ్. అతని ప్రయాణం ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఒకనాడు నేను ఈర్ష్య పడేంత ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది’’ అన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అప్పట్లో చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలని తీశారు రామారావుగారు. మళ్లీ అంతకు మించిన హిట్ ఈ సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నేను, కేఎస్ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాణ్ని. మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం విజయ్’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ‘‘ఈ సినిమాతో విజయ్ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత డి. సురేష్ బాబు. ‘‘అర్జున్ రెడ్డి’కి ముందు, ‘అర్జున్ రెడ్డి’కి తర్వాత అనేలా విజయ్ కెరీర్ నడుస్తోంది. తన ఫ్యాన్స్, ప్రేక్షకులకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాశా’’ అన్నారు క్రాంతిమాధవ్. ‘‘విజయ్ ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఖన్నా పోటాపోటీగా నటించారు’’ అన్నారు కేఎస్ రామారావు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘2016లో ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఒక లీడ్ యాక్టర్‌గా మీ ముందుకు వచ్చా. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం.. చేతి నుంచి జారిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఈ జర్నీలో స్థిరమైన వాటిలో మీరు (ఫ్యాన్స్) ఉన్నారు. నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ నాకు ఓపిక లేదు. ఇక నుంచి సిక్సులు కొట్టడానికే చూస్తా’’ అన్నారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా, ఇజాబెల్లా, కేథరిన్, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ మాట్లాడారు. -
నిర్మాత లేకపోతే ఏమీ లేదు
‘‘సుమారు 51 ఏళ్లుగా మూడు తరాల వాళ్లతో సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాను. వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు? అని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్లతో పోటీపడి పని చేయడానికి ప్రయత్నిస్తుంటాను’’ అన్నారు ప్రముఖ నిర్మాత కేయస్ రామారావు. ఆయన నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, కేథరీన్, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా కేయస్ రామారావు చెప్పిన విశేషాలు. ► ‘పెళ్లి చూపులు’ సినిమా చూసినప్పుడు నాకు విజయ్ దేవరకొండ ఒక రవితేజ, ఉపేంద్రలా అనిపించాడు. అప్పుడే అతనితో సినిమా చేయాలనుకున్నాను. అతని స్టయిల్లోనే ఉండే ప్రేమకథా చిత్రమిది. ► క్రాంతి మాధవ్‌తో ఇదివరకు ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ సినిమా నిర్మించాను. తను చాలా భిన్నంగా ఆలోచిస్తాడు. ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వాలనుకునే దర్శకుడు. ఈ సినిమా కథానుసారమే నలుగురు హీరోయిన్స్‌ని తీసుకున్నాం. రాశీ ఖన్నా పాత్ర బోల్డ్‌గా, ఐశ్వర్యారాజేశ్ పాత్ర న్యాచురల్‌గా ఉంటాయి. కేథరీన్ సపోర్టింగ్ రోల్లో కనిపిస్తుంది. ఇజబెల్లాది కూడా మంచి పాత్రే. ► ఈ సినిమాను 2018 అక్టోబర్‌లో ప్రారంభించాం. అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువే ఆలస్యం అయింది. అయినా కరెక్ట్ సమయానికే వస్తున్నాం. ప్రేమ అనే ఫీలింగ్‌ను ఆస్వాదించేవారందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ► ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ అంటూ ప్రేక్షకుడి చేతిలోకి వినోదం వచ్చేసింది. అందులో బోల్డ్ కంటెంట్ వస్తోంది. అయినా బిగ్ స్క్రీన్ మీద సినిమా ఆనందించాలనే ఆడియన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లు బోల్డ్ కంటెంట్‌ను బిగ్ స్క్రీన్ మీద చూడడానికి హర్షించరు. అందాన్ని సభ్యతతో చూపించేదే సినిమా. ► సినిమాల ఖర్చులు పెరిగాయి. దాంతో ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. దీని వల్ల వేరే సినిమాకు థియేటర్స్ కొరత ఏర్పడుతోంది. ఆ సినిమా నిలదొక్కుకొని టాక్ తెచ్చుకునేసరికి మరో పెద్ద సినిమా వస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి ఓ ప్రణాళికను తీసుకురావాలి. కంటెంట్‌ను తయారుచేసే నిర్మాత కన్నా కంటెంట్‌ను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే వాళ్లే ఎక్కువ డబ్బు చేసుకుంటున్నారు. నిర్మాత లేకపోతే ఏమీలేదు. ► సినిమాను పంపిణీ చేసే విధానంలో మార్పులు వచ్చాయి. మెల్లిగా మోనోపోలీ వ్యవస్థకు వెళ్లిపోయేలా ఉంది. థియేటర్స్ అన్నీ కొందరి దగ్గరే ఉండటం వల్ల కొందరి నిర్మాతలకు మంచి జరుగుతుంది.. ఇంకొందరికి మంచి జరగదు. థియేటర్స్ ఉన్నవాళ్లు వాళ్ల సినిమా ఉంటే థియేటర్స్ అన్నీ వాళ్ల సినిమాకే ఉంచుకుంటున్నారు. దీని వల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. -
‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా స్టిల్స్
-
‘వరల్డ్ ఫేమస్ లవర్’ వచ్చేశాడు
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’... ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ‘ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కాదు’ అన్న హీరోయిన్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్లో విజయ్ దేవరకొండ డిఫరెంట్ షేడ్స్‌తో కనిపించాడు. మిడిల్ క్లాస్ భర్తగా, లవర్‌గా, బైక్ రైడర్‌గా, పైలట్‌గా, భగ్న ప్రేమికుడిగా విజయ్ను విభిన్నమైన వెరియేషన్స్‌లో చూపిస్తూ టీజర్ సాగింది. ఇందులో రాశీకన్నా, క్యాథరిన్, ఇజాబెల్లా లీటే, ఐశ్వర్యా రాజేశ్‌లతో లవ్, రొమాన్స్‌తోపాటు ఇంటెన్స్ ఎమోషన్స్ చూపించారు. ఇక, విజయ్ ఏ సినిమా తీసినా ‘అర్జున్‌రెడ్డి’తో పోలిక రావడం సహజమే. ఈ సినిమా టీజర్లో భగ్న ప్రేమికుడిగా విజయ్ ఇంటెన్స్ ఎమోషన్స్, యామిని అంటూ చివర్లో చెప్పిన డైలాగులు ‘అర్జున్‌రెడ్డి’ని తలపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి-2’నా అని కామెంట్ చేయడం కనిపిస్తోంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్లు సాధించి టాలీవుడ్లో సెన్సెషన్ అండ్ క్రేజీ స్టార్‌గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. అయితే డియర్ కామ్రెడ్‌తో అభిమానులను ఈ రౌడీ కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. -
శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు
‘‘సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా సక్సెస్ సాధించడం కూడా అవసరం. అప్పుడే ఇంకా మంచి సినిమాలు రావడానికి స్కోప్ ఉంది. సినిమా చూసినవారు ‘శంకరాభరణం, మాతృదేవోభవ’ లాంటి గొప్ప సినిమా అని అభినందిస్తున్నారు. ఇకపై కూడా మా బ్యానర్లో మా గత సినిమాల్లానే క్వాలిటీతో పాటు మంచి పర్పస్ ఉన్న సినిమాలే అందిస్తాం’’ అన్నారు కేయస్ రామారావు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో పాటు కలెక్షన్లూ సాధిస్తోందని చిత్రబృందం తెలిపింది. శనివారం సక్సెస్ మీట్లో ఐశ్వర్యా రాజేశ్ మాట్లాడుతూ – ‘‘తమిళంలో ఎలా ఆదరించారో తెలుగులోనూ ఈ సినిమాను అలానే ఆదరిస్తున్నారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి ఈ ప్రశంసలను సపోర్ట్‌గా భావిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాకు పునాది కథ. మంచి కథ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాం. ఈ బ్యానర్లో గతంలో వచ్చిన గొప్ప సినిమాలకు దీటుగానే ఈ సినిమా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘ఒక గొప్ప సినిమాకు పాటలు రాసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాంబాబు గోసాల. ‘‘కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి సినిమాయే ‘కౌసల్య కృష్ణమూర్తి’’ అన్నారు బీఏ రాజు. ‘ఇండియన్ 2’ నుంచి తప్పుకున్నాను కమల్‌హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌ది ఓ కీలక పాత్ర. డేట్స్ క్లాష్ కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు. ఇలాంటి సినిమా వదులుకోవడం బాధగా ఉందని ఐశ్వర్య తెలిపారు. -
రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా
‘‘నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. 25 తమిళ్, 2 మలయాళం, ఒక హిందీ సినిమా చేశా. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారని చాలామంది అడుగుతుంటారు. మా నాన్న రాజేష్‌గారు ‘మల్లె మొగ్గలు, రెండు జళ్ల సీత, ‘అలజడి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. మా అత్త శ్రీలక్ష్మిగారు కమెడియన్‌గా అందరికీ సుపరిచితురాలు. మా తాత అమర్‌నాథ్‌గారు కూడా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. మేం తెలుగువాళ్లమే’’ అని ఐశ్వర్యా రాజేష్ అన్నారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’. కె.యస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్ చెప్పిన విశేషాలు. ► తమిళ్లో నా పాత్రలన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. తెలుగులో కూడా మంచి సినిమాతో పరిచయం అవ్వాలని తాపత్రయపడేదాన్ని. ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఓ మంచి సినిమాతో పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో నేను లీడ్ రోల్ చేసిన ‘కణ’కి ఇది రీమేక్. తమిళ ప్రేక్షకుల్లా తెలుగు ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకం ఉంది. ► రాజేంద్రప్రసాద్‌గారు మా నాన్నగారికి మంచి ఫ్రెండ్. ఆయనతో నటిస్తున్నప్పుడు మా నాన్నగారి గురించి చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. కె.యస్. రామారావుగారు పట్టుబట్టి ఈ సినిమా బాగా రావడానికి తోడ్పాటునందించారు. ఈ సినిమా మా అందరికీ ఒక మంచి తీపిగుర్తుగా నిలుస్తుంది. ► క్రికెట్‌కి మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ఆ ఫీల్ పోకూడదని ఫీమేల్ కోచ్‌ని పెట్టుకొని ప్రాక్టీస్ చేశాను. అలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నేర్చుకున్నాను. తమిళ్లో ఎలాగైతే రోజుకి ఎనిమిది గంటలు ఎండలో కష్టపడ్డానో.. తెలుగుకి కూడా రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డాను. ఇంత కష్టపడ్డాను కాబట్టి తెలుగులో మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ప్రస్తుతం ‘కౌసల్య కృష్ణమూర్తి’ కోసం ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లోనే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నాను. అలాగే నేను నటించిన మరో చిత్రం ‘మిస్ మ్యాచ్’ త్వరలో విడుదలవుతుంది. -
‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’ ప్రెస్‌మీట్
-
‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
మా సినిమా కొనని.. కొన్న మిత్రులకు ధన్యవాదాలు
‘‘కేయస్ రామారావుగారిని మేము ‘పప్పా’ (డాడీ) అని పిలుస్తాం. ఆయన ప్రతిరోజూ సెట్లో ఉంటారు. మీరు రిలాక్స్ అవ్వండి.. మేం చూసుకుంటాం అంటే.. నాకు నచ్చింది, వచ్చింది సినిమా.. ఇదే నా లైఫ్. ఇది చేయకపోతే ఇంకేం చేస్తాం అంటారు. ఇన్ని సినిమాలు చేసినా ఆయన ఇప్పటికీ సినిమాలను ప్రేమిస్తారు’’ అన్నారు విజయ్ దేవరకొండ. ఐశ్వర్యా రాజేష్, డా. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’. నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్ సార్.. మీరు ఈ లైఫ్‌లో చేసినన్ని సినిమాలు నా లైఫ్‌టైమ్‌లో చేయలేనేమో? మీరు చేసిన సినిమాలు, పాత్రలు, అనుభూతులు ఇప్పుడు మా వల్ల కాని పని.. మీలాంటి వారే మాకు స్ఫూర్తి. ఐశ్వర్య నటించిన కొన్ని తమిళ చిత్రాలు చూశాం.. చాలా బాగా చేసింది. మీరు (ఫ్యాన్స్) అన్ని సినిమాలను సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. మన సినిమాలు వస్తున్నాయ్.. త్వరలోనే దింపుతున్నాం. నీటిని వృథా చేయకండి. 2022కి తాగునీటికి ఇబ్బందులు తప్పవని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నీటి లీకేజీలను అరికడదాం. ఓ రోజు నీళ్లు లేకుంటే పరిస్థితి ఏంటో ఆలోచించండి. పెట్రోల్లా నీళ్లు కూడా లిమిటెడ్‌గా ఉన్నాయి.. పొదుపుగా వాడండి’’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – ‘‘క్రియేటివ్ కమర్షియల్స్‌లో 40 ఏళ్ల క్రితం ‘ఛాలెంజ్’ అనే సినిమాలో తొలిసారి నటించా. ఆ తర్వాత అనుకోకుండా నేను కామెడీ హీరోగా బాగా సక్సెస్ అయ్యాక కూడా నాతో ‘ముత్యమంత ముద్దు’ అని అద్భుతమైన సినిమా చేయించారాయన. ఈ సంస్థ ఇంతకాలం ఈ సంస్థ అద్భుతమైన స్థానంలో ఎందుకుంది అంటే.. మంచి సినిమాలు, గుర్తుండే సినిమాలు, సామాజిక సృహ ఉన్న సినిమాలు అందించింది కాబట్టి. నాలుగు మంచి సినిమాలు వెనకేసుకున్న బ్యానర్ కాబట్టి ఇప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంది. ఒరిజినల్ కంటే రీమేక్‌లు బాగా తీశాడు కాబట్టి భీమనేని శ్రీనివాస్‌కి ఇంత మంచి పేరుంది. ‘కణ’ సినిమా కంటే ‘కౌసల్య కృష్ణమూర్తి’ బాగుంటుంది. నా జీవితంలో ఓ 10 సినిమాలుంటే వాటిలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నేను ఎప్పుడూ రీమేక్‌ని రీమేక్‌లా చేయలేదు. ఫ్రెష్ స్టోరీలా భావించి మన నేటివిటీకి తగ్గట్టు చేసుకుంటూ వచ్చా.. అందుకే హిట్స్ సాధించా. ఈ మధ్య క్రికెట్ నేపథ్యంలో వచ్చినవి మేల్ సెంట్రిక్ ఫిల్మ్స్.. కానీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలి. కౌసల్య పాత్రలో ఐశ్వర్య అద్భుతంగా నటించింది’’ అన్నారు. కేయస్ రామారావు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా తీయడానికి ముఖ్య కారణం క్రాంతి మాధవ్. విజయ్ దేవరకొండతో మేం చేయనున్న సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఓ హీరోయిన్గా ఐశ్వర్యా రాజేష్ గురించి చెప్పాడు. ఆ సమయంలో ఐశ్వర్య నటించిన ‘కణ’ టీజర్ చూసి బాగుందని రీమేక్ చేశాం. ‘కణ’ కంటే ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాకి తెలుగులోనే తను ఎక్కువ కష్టపడింది. ఎందుకంటే ఇక్కడ మొదటి సినిమా కాబట్టి. నా సినిమాల్లో కథ బాగుందంటే అవి తయారు చేసిన వారి గొప్పదనం అది. వారందరూ గొప్ప రచయితలు, దర్శకులు, నటులు.. ఎంతో గొప్పగా చేయబట్టి, అవి నాకు నచ్చబట్టి.. ఓ నిర్మాతగా నేను కూడా వ్యాపారం చేసుకోవచ్చని భావించా. సినిమా వ్యాపారం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఏడాదికి 200 సినిమాలు రిలీజ్ అయితే వాటిల్లో మన సినిమా గొప్పగా ఉండాలనుకుంటే తప్ప ఆ సినిమా బతికి బట్టకట్టలేని పరిస్థితి. అలాంటి సినిమాలు చేయడానికి కోదండ రామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కె.విశ్వనాథ్, అజయ్... ఇలా ప్రతివాళ్లూ కష్టపడ్డారు. నా గురించి, నా బ్యానర్ గురించి వారంతా కష్టపడితేనే గొప్ప సినిమాలొచ్చాయి. 2019లో ఓ మంచి సినిమా చూశామని సంతృప్తిగా చెప్పుకునే చిత్రమిది. మా సినిమాని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్న నా స్నేహితులకు థ్యాంక్స్.. కొనటానికి రాని, పెద్ద సినిమాలే కొనే మిత్రులకు కూడా థ్యాంక్స్.. ఎందుకంటే శాటిలైట్, డిజిటల్ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని నేనే రిలీజ్ చేస్తున్నా. ఈ సినిమాని అమ్మటానికి నేను ప్రయత్నించా.. కానీ, ఐశ్వర్యారాజేష్ ఏమైనా అమితాబ్ బచ్చనా? చిరంజీవినా? అనుకొని ఉండొచ్చు. సినిమా చూస్తే ఆవిడేంటో తెలుస్తుంది’’ అన్నారు. ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ – ‘‘నా తొలి చిత్రం క్రాంతి మాధవ్‌గారి దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో సైన్ చేశా.. అదే ఫస్ట్ సినిమా అవుతుందనుకున్నా. కానీ ‘కౌసల్య కృష్ణమూర్తి’ అయింది. తమిళ్లో 25 సినిమాలు చేశా.. ఆ తర్వాత ‘కణ’ నాకు వచ్చింది. ఆ సినిమా నా కల. అది బ్లాక్‌బస్టర్ అవడంతో వెనుతిరిగి చూసుకోలేదు. ఇలాంటి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం లక్కీ. ఈ సినిమాకి బెస్ట్ నటిగా తమిⶠంలో 10 అవార్డులు తీసుకున్నా. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనుకుంటున్నా’’ అన్నారు. కెమెరామేన్ ఆండ్రూ, ఏషియన్ సినిమాస్, నిర్మాత నారాయణ్‌దాస్, హీరోయిన్ రాశీ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది
‘‘క్రికెట్ నేపథ్యంలో విభిన్న కథాంశంతో వస్తున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఆటల నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించింది. ఆ కోవలోనే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది’’ అని చిరంజీవి అన్నారు. ఐశ్వర్యా రాజేష్, డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. ‘ది క్రికెటర్’ అన్నది ఉపశీర్షిక. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఎ.వల్లభ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను మంగళవారం చిరంజీవి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే కథతో ఈ సినిమా ఉంటుంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. ఐశ్వర్యా రాజేష్ నాలుగైదు నెలలు క్రికెట్లో శిక్షణ తీసుకొని నటించారంటే, ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్ అది. తను ఎవరో కాదు.. మా కొలీగ్ రాజేష్ కూతురు.. కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్ రావడం శుభపరిణామం. భీమనేనికి ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘క్రీడల నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినా, స్క్రీన్‌ప్లే, సబ్జెక్ట్ పరంగా మా సినిమా విభిన్నమైంది. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు భీమనేని శ్రీనివాసరావు. కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘40 సంవత్సరాలుగా చిరంజీవికి, మా సంస్థకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెల్సిందే. ఒక గొప్ప సినిమా అయిన మా ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను లాంచ్ చేసిన చిరంజీవిగారికి ధన్యవాదాలు. ఇప్పుడున్న యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎనర్జిటిక్‌గా ఉంటూనే మంచి ఎమోషనల్‌గా ఉండే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన కథ. ఈ సంవత్సరం రాబోయే గొప్ప సినిమాల్లో కచ్చితంగా మా సినిమా ఒకటి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.సునీల్‌కుమార్, లైన్ ప్రొడ్యూసర్: వి.మోహన్‌రావు. ∙కేయస్ రామారావు, చిరంజీవి, భీమనేని శ్రీనివాసరావు -
అందరూ కనెక్ట్ అవుతారు
‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ‘కణా’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దర్శకునిగా భీమనేని శ్రీనివాసరావు అయితే కరెక్ట్ అనిపించింది. తనను సంప్రదించగానే ఇష్టంతో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమా చేశాడు’’ అని చిత్ర సమర్పకులు కేయస్ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేశ్ టైటిల్ రోల్లో, రాజేంద్రప్రసాద్, కార్తీక్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని భీమనేని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ– ‘‘అందరూ కనెక్ట్ అయ్యే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్గార్ల టైమ్‌లో ‘అమరసందేశం’ వంటి మంచిసినిమాలో హీరోగా నటించిన దివంగత హీరో అమర్నాథ్ మనవరాలు, హీరో రాజేశ్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమా ద్వారా తెలుగుకి పరిచయం అవుతున్నారు. తను చాలా మంచి నటి. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి హీరోయిన్ వస్తోంది. తనతో మరో సినిమా కూడా చేయబోతున్నా. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావస్తోంది. జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కథలు కోరుకుంటారు. అలాంటి వాటికోసం వెతుకుతున్న టైమ్‌లో ‘కణా’ సినిమా చూశా. ఈ చిత్రం తెలుగు రీమేక్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటే నా వరకూ వస్తుందా? అనుకున్నా. ఓ రోజు రామారావుగారు ఫోన్ చేసి ‘కణ’ రీమేక్ హక్కులు కొన్నాను, మనం చేద్దామనగానే చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే ఆయన్ని కలిసి ‘ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం సార్ చేద్దా’మన్నాను. ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అమ్మాయి క్రికెట్ నేర్చుకుని, అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణించింది? అన్నదే చిత్రకథ. ఇందులో తండ్రి, కూతురు మధ్య మంచి ఎమోషన్స్ ఉంటాయి. కథానాయిక తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారు నటించారు. తెలుగమ్మాయి అయిన ఐశ్వర్యారాజేష్ ఇతర భాషల్లో నటిగా నిరూపించుకుని మా సినిమాతో తెలుగుకి పరిచయం అవుతున్నారు. తనలో చాలా ప్రతిభ ఉంది. ఎమోషనల్ సీ¯Œ ్స తీస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా గ్లిజరిన్ వాడలేదు. తను పిలిస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి’’ అన్నారు. కెమెరామెన్ ఆండ్రూ, ఆర్ట్ డైరెక్టర్ శివ శ్రీరాములు పాల్గొన్నారు. -
ప్రేమకథ
‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ చిత్రాల ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతిమాధవ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ‘ఓనమాలు, మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు, ఉంగరాల రాంబాబు’ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు క్రాంతిమాధవ్. వీరి కాంబినేషన్లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ సంస్థ ప్రొడక్షన్ నెం.46గా నిర్మించనున్న కొత్త సినిమా ఈనెల 18న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని కేఏ వల్లభ నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం రోజునే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రయూనిట్ తెలియజేయనుంది. ప్రేమకథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లెడి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: జేకే. -
ప్రేక్షకుల ఈలలే గొప్ప కాంప్లిమెంట్స్
‘‘నా ప్రతి సినిమాలో ‘తొలిప్రేమ’ హ్యాంగోవర్ కనిపిస్తుంటుందని అంటుంటారు. ఎందుకంటే నేను కరుణాకరన్‌ని కాబట్టి. అది నా స్టైల్. జనాలకు ఏది నచ్చుతుందో అది చేయడం డైరెక్టర్ పని. ‘తొలిప్రేమ’ని ఇప్పటికీ గుర్తు చేస్తుంటే భయంగా అనిపిస్తుంటుంది. ఫస్ట్ క్లాస్‌లో స్టేట్ ఫస్ట్ వచ్చాం. ఆ నెక్ట్స్ మళ్లీ స్టేట్ ఫస్ట్ ఎందుకు రాలేదు? అని అడిగితే స్టూడెంట్స్‌కు ప్రెషర్గా ఉంటుంది. నాక్కూడా సేమ్’’ అన్నారు కరుణాకరన్. సాయిధరమ్ తేజ్, అనుపమ జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన ‘తేజ్ ఐ లవ్ యు’ శుక్రవారం రిలీజైంది. శనివారం కరుణాకరన్ మీడియాతో మాట్లాడారు. ► ‘సినిమా బావుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంద’ని రిలీజైన రోజు నుంచి ఫోన్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఏ సినిమాకైనా ప్రేక్షకుల ఈలలే బెస్ట్ కాంప్లిమెంట్స్. ‘తేజ్’ సినిమా ఏ హాలీవుడ్ సినిమాకు ఇన్స్పిరేషన్ కాదు. నా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘ఎందుకంటే ప్రేమంట’, ఇప్పుడు ‘తేజ్’లో హీరోయిన్లు గతం మర్చిపోతారన్నది కావాలని రిపీట్ చేయలేదు. అది స్క్రీన్ ప్లేలో ఒక భాగం. ‘డార్లింగ్’లో ‘ఫస్ట్ హాఫ్ అబద్ధం’ అనే స్క్రీన్‌ప్లేతో నడుస్తుంది. అలా ఒక్కొక్క లవ్ స్టోరీని ఒక్కో స్టైల్లో చెప్పడానికి ప్రయత్నిస్తుంటా. ► లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇంపార్టెంట్. అందుకని నా సినిమాలో హీరోలకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సినిమా చూడటానికి ఆడియన్స్ వచ్చినప్పుడు మంచి విజువల్స్, మ్యూజిక్, రొమాన్స్ ఉంటేనే ఎంటర్టైన్ అవుతారు. ఆండ్రూ విజువల్స్ చాలా బాగా చూపించారు. గోపీ సుందర్ అద్భుతమైన సంగీతం అందించారు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడ్డారు. వీళ్లంతా లేకపోతే నేను లేను. ► ఇప్పటివరకు ఆడియన్స్ నన్ను గుర్తు పెట్టుకున్నది ‘తొలిప్రేమ’ వల్లనే. ఒక స్టాండర్డ్ సెట్ చేసింది ఆ సినిమా కాబట్టి నా ప్రతి సినిమాను అదే సినిమాతో కంపేర్ చేస్తుంటారు. వణుకు వచ్చేస్తుంటుంది. నేను కూడా ‘తొలిప్రేమ’ కంటే మంచి సినిమా తీయడానికి ప్రయత్నిస్తుంటాను. నా కథకు తగ్గట్టు సాయిధరమ్ తేజ్, అనుపమ అద్భుతంగా చేశారు. ► మా ఫ్యామిలీ మొత్తం 32మంది ఉంటారు. బాబాయిలు, మావయ్యలు, ఇలా చాలా మంది ఉంటాం. మా పిన్ని కూడా నన్ను కొడుకులానే చూస్తుంటారు. అదే నా సినిమాల్లో చూపిస్తాను. నా సినిమాకు వెళ్తే అందరూ ఎంజాయ్ చేయాలి. నా లైఫ్‌లో జరిగే బెస్ట్ మూమెంట్స్‌ని నా సినిమాలో వాడేస్తాను. అందులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’లో ‘వద్దు సరోజా...’ ఎపిసోyŠ ఒకటి. మంచి మూమెంట్స్ అన్ని డైరీలో రాసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటాను (నవ్వుతూ). నా ఫస్ట్ లవ్ స్టోరీ డిజాస్టర్. నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు మేమిద్దరం లవ్‌లో ఉన్నాం. ► కేయస్ రామారావుగారు లెజెండ్. ఆయనతో సెకండ్ టైమ్ వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. 45 సినిమాలు చేశారు. ఎప్పటినుంచో సినిమాలు తీస్తున్నారు. కథ విని మంచి సలహాలు ఇస్తారు. నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏం అనుకోలేదు. -
మెగా న్యూస్ : గ్యాంగ్‌లీడర్ రీమేక్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా గ్యాంగ్ లీడర్. మాంగటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణంలో విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించి ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంది. అయితే మెగా వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి గ్యాంగ్ లీడర్ రీమేక్‌కు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ అద్భుతమైన టైమింగ్‌తో అలరించిన రాజారామ్ పాత్రలో రామ్ చరణ్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల కల నేరవేరబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన తేజ్ ఐ లవ్ యు ఆడియో రిలీజ్ వేడుకలో మాట్లాడిన చిరు, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా సినిమా ఉంటుందన్న హింట్ ఇచ్చారు. అయితే అది గ్యాంగ్ లీడర్ రీమేకే అన్న ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ కథను ఈ జనరేషన్‌కు తగ్గట్టుగా మార్పులు చేసిన తెరకెక్కించేందుకు కేయస్ రామారావు ప్రయత్నిస్తున్నారట. రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ తరువాత చరణ్ చేయబోయే సినిమా ఇదే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై మెగా టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
కేఎస్ vs ఎంవీ
20న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలు బరిలో కేఎస్ రామారావు, ఎంవీ చౌదరి బంజారాహిల్స్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ) కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 20న జరుగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు కేఎస్రామారావుతో పాటు శ్రీమిత్ర రియల్టర్స్ అధినేత మేడికొండూరి వెంకటచౌదరి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ రెండు ప్యానెళ్లు హోరాహోరీగా పోటీ పడుతుండగా గెలుపు కోసం అభ్యర్థులు వ్యూహరచన చేస్తున్నారు. క్లబ్లో అందరూ బడాబాబులు, సినీ దిగ్గజాలు ఉండటంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది. క్లబ్లో మొత్తం 2100 మంది సభ్యులుండగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి, కె.రాఘవేందర్రావు, అల్లు అర్జున్, రాంచరణ్‌తేజ్, శ్రీకాంత్, మోహన్‌బాబు, మంచు విష్ణు, దాసరి నారాయణరావు, వెంకటేష్, మహేష్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి రానా, కోట శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, బి.గోపాల్, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, వైవి.రెడ్డి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ మాగంటి బాబు, ఎంపీ మురళీమోహన్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. కేఎస్ రామారావు ప్యానెల్ కె.ఎస్.రామారావు అధ్యక్షుడిగానే పోటీ పడుతున్నారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కేవీ.రావు, కార్యదర్శిగా బి. రాజశేఖర్‌రెడ్డి,కోశాధికారిగా సిహెచ్.శ్రీనివాసరాజు, సంయుక్త కార్యదర్శిగా తుమ్మల రంగారావు, కార్యవర్గ సభ్యులుగా రవీంద్రనాథ్, రఘునందన్‌రెడ్డి,సూర్యనారాయణరాజు, మదన్మోహన్ రావు ఉన్నారు. ఎంవీ చౌదరి ప్యానెల్ ఎంవీ.చౌదరి అధ్యక్షుడిగా పోటీ చేస్తుండగా ఉపాధ్యక్షుడిగా నందమూరి తారకరత్న, సెక్రటరీగా యలమంచిలి సురేష్‌కుమార్, కోశాధికారిగా శివాజీరాజా, జాయింట్ సెక్రటరీగా జితేందర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సురేష్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి,భూపాల్వర్మ,శ్రీనివాస్‌రావు ఉన్నారు. -
ప్రేమ కోసం పోరాటం
వైజాగ్ ఏరియా పంపిణీదారునిగా చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న రాజు తనయుడు సత్య కార్తీక్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘టిప్పు’. వారియర్ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. జగదీష్ దానేటి దర్శ కత్వంలో ఆదిత్య ఫిలింస్ పతాకంపై డీవీ సీతారామరాజు ఈ చిత్రం నిర్మించారు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. వైజాగ్ సత్యా నంద్గారి దగ్గర శిక్షణ పొందిన సత్య కార్తీక్‌కి హీరోగా మంచి భవిష్యత్తు ఉందని ఈ సందర్భంగా కేయస్ రామారావు అన్నారు. సత్య కార్తీక్ మన పక్కింటి అబ్బాయిలా ఉన్నాడు కాబట్టి, అందరికీ దగ్గరవుతాడనీ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఈ ప్రచార చిత్రం చాలా బాగుందని సి. కల్యాణ్ చెప్పారు. సినిమాలంటే సత్య కార్తీక్‌కి చాలా ఇష్టమని దర్శకుడు వీయన్ ఆదిత్య పేర్కొన్నారు. హీరోగా తన పరిచయ చిత్రానికి మంచి కథ కుదిరినందుకు సత్య కార్తీక్ సంతోషం వెలి బుచ్చారు. ఈ నెలాఖరున పాటలనూ, వచ్చే నెల చిత్రాన్నీ విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రా నికి కెమెరా: రాజ శేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివరామి రెడ్డి. -
అల్లు శిరీష్‌కి జోడీగా...
డబ్బు, స్టార్డమ్... వీటి గురించి ఆలోచించకుండా, మంచి పాత్రల కోసం తాపత్రయపడే కథానాయికలు ఇప్పట్లో అరుదు. నిత్యామీనన్ ఆ కోవకు చెందిన వారే. అందుకు తగ్గట్టే అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందారామె. ప్రస్తుతం కేఎస్‌రామారావు నిర్మిస్తున్న చిత్రంలో శర్వానంద్‌కి జోడీగా నటిస్తూ బిజీగా ఉన్నారు నిత్య. ఇదిలావుంటే... రీసెంట్గా మరో సినిమాకు నిత్య పచ్చజెండా ఊపారట. అల్లు శిరీష్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఆమె కథానాయికగా నటించనున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్ర దర్శకుడు పవన్ సాదినేని ఈ సినిమాకు దర్శకుడు. కథ, అందులోని పాత్ర నిత్యామీనన్‌కి బాగా నచ్చడంతో వెంటనే ‘ఓకే’ చెప్పేశారట. జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
లవ్ యు బంగారం అంటున్న రాహుల్
సీనియర్స్‌తో జూనియర్స్ ఫ్రెండ్షిప్పా.. కుద రదంటూ ‘హ్యాపీ డేస్’ చిత్రంలో సోనియా ఆటపట్టించిన టైసన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఆ చిత్రంలో టైసన్ పాత్రలో రాహుల్ ఒదిగిపోయిన వైనం చాలామందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘రెయిన్బో’, ‘ప్రేమ ఒక మైకం’లో నటించిన రాహుల్ ప్రస్తుతం ‘లవ్ యు బంగారం’లో నటించారు. కేఎస్ రామారావు సమర్పణలో కె. వల్లభ, మారుతి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. గోవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రవిశేషాలను రాహుల్ చెబుతూ - ‘‘పేరున్న బేనర్, మంచి దర్శకులతో సినిమా చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నా గురువు శేఖర్ కమ్ముల చెప్పారు. ఆయన చెప్పిన అంశాలున్న సినిమా ఇది. హీరోగా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. నటుడిగా నిరూపించుకోవడానికి ఆస్కారం లభించింది’’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్, మారుతి టాకీస్లకే మరో సినిమా చేయనున్నానని, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని రాహుల్ అన్నారు. కథానాయకుడిగానే నటించాలని నియమం పెట్టుకోలేదని, నటుడిగా నిరూపించుకోవడానికి ఆస్కారం ఉన్న ప్రధాన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాహుల్ చెప్పారు.