బాలలతో పనిచేయిస్తే కఠిన చర్యలు
ఉప కార్మిక కమిషనర్ శ్రీనివాస్
నెల్లూరు (సెంట్రల్): 18 ఏళ్లలోపు వారితో పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప కార్మిక కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన కార్మిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో 14 ఏళ్లలోపు బాలలతో పనిచేయిస్తే బాలకార్మిక చట్టాన్ని అనుసరించి చర్యలు తీసుకోవడం జరిగేదన్నారు. 1986 చట్టాన్ని అనుసరించి చేసిన కొత్త సవరణల ప్రకారం 18 ఏళ్ల లోపు వారితో పనులు చేయించడం నేరమన్నారు. జిల్లాలో బాల కార్మికుల గుర్తింపునకు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖతో పాటు మహిళా శిశుసంక్షేమ శాఖ, బాలకార్మికుల నిర్మూలన సంస్థ, రాజీవ్ విద్యామిషన్ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించనున్నట్లు వివరించారు. బాలకార్మికులతో పనిచేయిస్తుంటే 0861–2323114, 1098 నంబర్లకు సమాచారాన్ని అందించాలని కోరారు.