నిజామ్ షుగర్స్ కథ కంచికి
హైదరాబాద్: నష్టాలను సాకుగా చూపుతూ 2015-16 క్రషింగ్ సీజన్లో చెరుకు గానుగను నిలిపివేసిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ యాజమాన్యం.. ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో లే ఆఫ్‌ను ప్రకటించిన యాజమాన్యం.. కార్మికుల వేతనాలు కూడా చెల్లించడం లేదు. చెరుకు తరలింపులో భాగంగా రవాణాకు సంబంధించిన మొత్తం ప్రభుత్వం నుంచి విడుదల కావడం లేదు. ఇదిలావుంటే.. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి, వరుస నష్టాలతో ఫ్యాక్టరీని నడిపించే పరిస్థితిలో లేనందున ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్చాలంటూ ఎన్డీఎస్ఎల్ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం) ఇటీవల పారిశ్రామిక, ఆర్దిక పునర్నిర్మాణ మండలిని (బీఐఎఫ్ఆర్) ఆశ్రయించింది.
అయితే బీఐఎఫ్ఆర్ వద్ద పేరుకు పోయిన ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాను పరిశీలిస్తే.. ఎన్డీఎస్ఎల్ వ్యవహారం కొలిక్కి వచ్చేందుకు కనీసం నాలుగేళ్లు పడుతుందని చక్కెర పరిశ్రమ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పేరుకు పోయిన వేతన బకాయిలు చెరుకును గానుగ ఆడించలేమని ప్రకటించిన ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం.. గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన లే ఆఫ్ ప్రకటించింది. దీంతో ఎన్డీఎస్ఎల్ పరిధిలోని మూడు యూనిట్లలో పనిచేస్తున్న 307 మంది కార్మికులు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.2.27 కోట్ల బకాయిలతో పాటు, పీఎఫ్ వంటి ఇతర చెల్లింపులు మరో రెండు కోట్ల రూపాయల మేర వుంటాయని అంచనా.
వేతన బకాయిలు రూ.4.27 కోట్లు చెల్లించడంతో పాటు, ఫ్యాక్టరీని తిరిగి తెరవాలంటూ ఉద్యోగులు ఆందోళన బట్టినా అటు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. ఎన్డీఎస్ఎల్ పరిధిలో రైతులు సాగు చేసిన సుమారు 1.80లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును ప్రైవేటు ఫ్యాక్టరీలకు తరలించి గానుగ ఆడించారు. రవాణా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వగా.. మెట్రిక్ టన్నుకు రూ.300 నుంచి రూ.450 వరకు దూరాన్ని బట్టి చెల్లించాలని నిర్ణయించారు. అయితే క్రషింగ్ ముగిసినా.. ప్రభుత్వం ప్రకటించిన రవాణా వ్యయం రూ.6 కోట్లు విడుదల కాకపోవడంతో.. ప్రైవేటు ఫ్యాక్టరీల నుంచి రైతులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగడం లేదు.