కర్షకుల పాలిట ఖర్మాగారం !
బొబ్బిలి: లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలోని రైతులు మరో సారి ఆందోళనకు సిద్ధమయ్యారు. శనివారం ఫ్యాక్టరీ ఎదుట మహాధర్నా చేయనున్నారు. 16 మండలాలకు చెందిన 15 వేల మంది రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం దాదాపు రూ 50 కోట్ల బకాయి పడింది. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నప్పుడు హామీలు ఇచ్చి తరువాత పట్టించుకోవడం లేదు. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఏకబిగిన 15 రోజుల పాటు భారీ ఎత్తున ఆందోళనలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేశారు. బకాయిల కోసం ఇప్పటికి 52 సార్లు రైతులు రోడ్డెక్కారు.
గత ఏప్రిల్ 24న మండుటెండలో ఆందోళన చేశారు. ఇలా అందోళన చేసిన ప్రతిసారీ అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం హామీలు ఇస్తున్నారనే తప్ప సమస్య పరిష్కరించడంలేదు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం వాయిదా లు వేసుకుంటూ వస్తోంది. ఉన్నతాధికారులు కూడా స్పందించ డం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతుల పేరిట లచ్చయ్యపేట, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో బినామీ రుణాలు తీసుకుంది. వాటికి సం బంధించి ఇంకా 25 కోట్ల రూపాయల బకాయి ఉంది. వాటిని యాజమాన్యం చెల్లించకపోవడం వల్ల ఇప్పటికీ అప్పులు తీర్చాలని బ్యాంకులు రైతులకు నోటీసులు పంపుతున్నాయి. బినామీ అప్పుల బారిన పడిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ కూడా వర్తించని పరిస్థితి ఏర్పడింది.
అలాగే 2013-14 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన చెరకును సరఫరా చేసిన రైతులకు రూ.5.50కోట్ల బకాయి పడగా, గత ఏడాదికి సంబంధించి 12.70 కోట్ల బకాయి ఉంది. ఎన్సీఎస్ యాజమాన్యం నడిపితే బిల్లులు అందడం లేదని ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రషింగు జరగాలని గత ఏడాది నిర్ణయం తీసుకున్నా ఆ బకాయిలు కూడా నేటివరకూ అందలేదు. దిగుబడి అయిన పంచదారకు ధర లేదని ఫ్యాక్టరీలోనే నిల్వలు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాలు పెట్టి క్రషింగు చేసినా ఇంకా 12 కోట్ల వరకూ ైరె తులకు చెల్లించాల్సి ఉంది. ఇవి కాకుండా టన్నుకు మమ్ము చెరుకుకు వంద రూపాయలు, మొక్క చెరకుకు 2 వందల రూపాయలు విత్తన రాయితీ ఇవ్వాల్సి ఉంది. అయితే గత రెండేళ్లుగా ఇవి కూడా ఇవ్వకపోవడంతో దాదాపు ఆరు కోట్ల రూపాయల వరకూ బకాయి ఉంది. బకాయిలు కోసం రైతులు ఆందోళన చేయడానికి ప్రకటనలు జారీ చేస్తే అటు యాజమాన్యం, ఇటు అధికారులు స్పందించడం, వెంటనే సమావేశాలు ఏర్పాటు చేయడం, రైతులు ఆందోళన చేయకుండా కట్టడి చేయడం వంటివి చేస్తున్నారు.. ఆ సమయంలో అధికారులు హామీ ఇవ్వడం, అవి గడువు తీరినా నెరవేరకపోవడం సాధారణంగా మారింది.
దీంతో విసిగిపోయిన రైతులు శనివారం ఫ్యాక్టరీ ఎదురుగా మహాధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. రైతులు ధర్నాకు సిద్ధమవుతుండడంతో ఎన్సీఎస్ యాజమాన్యం బహిరంగ ప్రకటన ద్వారా చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించింది. అయితే దానిపై కూడా రైతు సంఘం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మా ఖర్మకాలి ఈఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేశామని, ఇప్పుడు పడరానిపాట్లు పడుతున్నామని, జిల్లా అధికారులు, ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నా సందర్భంగా ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.