'శ్రీవారి' సబ్సిడీ లడ్డూలకు ఎసరు?
ధర్మకర్తల మండలి సభ్యుల కమిటీ భేటీలో చర్చ
ప్రతి భక్తునికీ 100 గ్రాముల ఉచిత లడ్డూ ఇవ్వాలనే యోచన
తోమాల, అర్చనతోపాటు వీఐపీ ఎల్-1,2 టికె ట్ల రుసుం పెంపు ప్రతిపాదన
తిరుమల : శ్రీవారి భక్తులకు అందిస్తున్న సబ్సిడీ లడ్డూలకు ఎసరు పెట్టాలని టీటీడీ భావిస్తోంది. శుక్రవారం ఇక్కడ భేటీ అయిన ధర్మకర్తల మండలి సభ్యుల కమిటీ ప్రధానంగా దీనిపైనే చర్చించింది. తోమాల, అర్చనతోపాటు వీఐపీ-1,2 టికెట్ల ధరలను కూడా భారీగా పెంచే ప్రతిపాదన దిశగా ఆలోచిస్తున్నారు.
శ్రీవారి లడ్డూ తయారీకోసం టీటీడీకి రూ.30 ఖర్చవుతోంది. అయినప్పటికీ కాలిబాట భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇస్తున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో ప్రస్తుతం రోజుకు 15 వేల నుంచి 20 వేల వరకు భక్తులు వస్తున్నారు. ఈ లెక్కన వీరికి ఇచ్చే ఉచిత లడ్డూ కోసం రోజుకు రూ. 4.5 లక్షల నుంచి రూ.6 లక్షలు, ఏడాదికి రూ.16.20 కోట్ల నుంచి 21.60 కోట్ల వరకు అదనపు భారం పడుతోంది. వారపు రద్దీ, పర్వదినాల్లో నడచివచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా చూస్తే టీటీడీపై రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు పడే అవకాశం ఉంది.
ఇదే తరహాలోనే కాలిబాట భక్తులతోపాటు సర్వదర్శన భక్తులకు సబ్సిడీ ధరతో ఒక లడ్డూ రూ.10 చొప్పున రూ.20కి రెండు ఇస్తున్నారు. ఇలా ఏడాదిలో సుమారు రూ.20 నుంచి రూ.25 కోట్ల మేర భారం పడుతోంది. మొత్తంగా ఏడాదికి టీటీడీ సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు పెడుతోంది.
ధరల పెంపుకే మొగ్గు..
శ్రీవారి లడ్డూ ధరల పెంపు భావనలో టీటీడీ ధర్మకర్తల మండలి ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు నెలలుగా చర్చ కొనసాగిస్తూనే ఉంది. పనిలోపనిగా ఉచిత లడ్డూ, సబ్సిడీ లడ్డూలు ఇచ్చే పథకానికీ మంగళం పాడాలని చూస్తోంది.
వీటి స్థానంలో ప్రతి భక్తునికీ సుమారు 100 గ్రాముల లడ్డూను ఉచితంగా అందించాలనే అంశాన్ని పరిశీలిస్తోంది. పోటును మరింత విస్తరించి లడ్డూ తయారీ సంఖ్యను పెంచి భక్తులు కోరినన్ని లడ్డూలు ఇవ్వాలని యోచిస్తోంది. శుక్రవారం నిర్వహించిన ధర్మకర్తల మండలి సభ్యుల భేటీలో సభ్యుల్లో కొందరు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సేవల ధరల పెంపు ప్రతిపాదన
శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించే భాగ్యం తోమాల, అర్చన సేవల్లో పాల్గొనే భక్తులకు దక్కుతుంది. సోమ, మంగళ, బుధ, గురువారాల్లో జరిగే ఈ అరుదైన సేవా టికెట్లు ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చేవారితోపాటు ప్రముఖులకు మాత్రమే తక్కువ సంఖ్యలో లభిస్తాయి. ప్రస్తుతం ఒక టికెట్టు బ్యాంకు కోటాలో రూ.220, సిఫారసు కోటాలో రూ.440గా ఉంది.
ఈ ధరను కూడా భారీగా పెంచాలని భావిస్తున్నారు. అలాగే హారతి, తీర్థం, శఠారి మర్యాదలతో కూడిన వీఐపీ -1, 2 టికెట్ల ధరను పెంచడం వల్ల వాటిని కోరే వారి సంఖ్యను తగ్గింవచ్చన్న భావనతో ఉన్నారు. కల్యాణ మండపాల అద్దెలు, తిరుమలలోని పలు అతిథిగృహాల అద్దెల పెంపు దిశగా లెక్కలు వేశారు.