ఎక్సైజ్ స్టేషన్ ముట్టడి
పిఠాపురం రూరల్, న్యూస్‌లైన్ : ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసిన వ్యవహా రం వివాదాస్పదంగా మారింది. ఆమెను అన్యాయంగా అరెస్టు చేసి, నిర్బంధించారం టూ ఆరోపిస్తూ ఆందోళనకారులు స్థానిక జగ్గయ్యచెరువులో ఉన్న ఎక్సైజ్ స్టేషన్‌ను ముట్టడించారు. అయితే ఎక్సైజ్ పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చారు. వివరాలిలా ఉన్నాయి. పి.దొంతమూరులో సారా విక్రయిస్తున్నారన్న సమాచారంతో గొల్లప్రోలుకు చెందిన మద్యం వ్యాపారులతో కలిసి ఎక్సైజ్ అధికారులు గురువారం దాడి చేశారు. ఈ దాడిలో కోశెట్టి సీతమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆమెపై అక్రమ కేసు బనాయించారని, సారాతో ఆమెకు సంబంధం లేదని చెప్పారు. మహిళను అదుపులోకి తీసుకునేటప్పుడు మహిళా పోలీసు ఉండాలనే కనీస నిబంధనను పాటించలేదని ఆరోపించారు.
మహిళా పోలీసు లేకుండా రాత్రంతా ఆమెను ఎక్సైజ్ స్టేషన్లో ఉంచారన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, ఎక్సైజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. ఇలాఉండగా పది లీటర్ల సారాతో పట్టుబడ్డ సీతమ్మను ప్రత్తిపాడు సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చినట్టు ఎక్సైజ్ సీఐ రమణ తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ లేరని, అందుబాటులో ఉన్న మహిళా వాచ్‌మన్ సమక్షంలో సీతమ్మను ఉంచినట్టు చెప్పారు.
నిర్భయ కేసు నమోదు
ఇలాఉండగా తన భార్యను అన్యాయంగా సారా కేసులో అరెస్టు చేసి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సీతమ్మ భర్త గౌరేష్ పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితులు ఎక్సైజ్ సీఐ రమణ, టాస్స్ఫోర్స ఎస్సై అశోక్, గొల్లప్రోలుకు చెందిన బస్సా రాజా, గాదం శ్రీనులపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేసినట్టు శుక్రవారం రాత్రి రూరల్ ఎస్సై శివగణేష్ తెలిపారు.