Ladies Only
-
ఉమెన్–ఓన్లీ: స్టార్ ట్రావెలర్
‘ప్రయాణం అంటే కొత్త ప్రదేశానికి వెళ్లి సెల్ఫీ దిగడం కాదు. మనలోకి మనం ప్రయాణించడం. కొత్త వెలుగుతో తిరిగి రావడం. కొత్తగా జీవించడం’ అంటున్న సజ్నా అలి ‘ఉమెన్–ఓన్లీ ట్రావెల్ గ్రూప్’తో గెలుపు జెండా ఎగిరేసింది. రెండు ఊళ్లు దాటి బయటికి వెళ్లని మహిళలకు కూడా ప్రయాణాలలో ఉండే మజాను పరిచయం చేసింది. వారిని ప్రయాణ ప్రేమికులుగా మార్చింది.... సజ్నా అలి (తిరువనంతపురం, కేరళ)కి ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఏజెన్సీని మొదలు పెట్టేలా చేసింది. గతంలోకి వెళితే... సజ్నా నాన్న ట్రక్‌డ్రైవర్. తన వృత్తిలో భాగంగా ఎన్నో ఊళ్లు, ప్రదేశాలు తిరిగేవాడు. తాను చూసిన విశేషాలను రాత్రి పడుకునే ముందు పిల్లలకు కథలుగా చెప్పేవాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఆసక్తి తనతోపాటు ప్రయాణిస్తూనే ఉంది. ‘ఈ ప్రపంచం అంతా చుట్టి రావాలి’ అనే ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుంది గానీ, ఆర్థికపరిమితుల వల్ల అది సాధ్యం కాక ఒక్క దేశాన్ని కూడా చూడలేకపోయింది. తిరువనంతపురం టెక్నోపార్క్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తన మనసంతా ప్రయాణాల చుట్టే తిరిగేది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఉమెన్–వోన్లీ ట్రావెల్ గ్రూప్’కు శ్రీకారం చుట్టింది. ‘ఇదేం చోద్యమమ్మా’ అన్నారు చాలామంది. ‘బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఏజెన్సీ నడపాలనుకోవడం తెలివైన పని కాదు’ అన్నారు. ‘ట్రావెల్ ఏజెన్సీ రంగంలో మహిళలు విజయం సాధించలేరు’ అని నిరాశ పరిచారు. కట్ చేస్తే... సజ్నా ట్రావెల్ ఏజెన్సీ కేరళలో అగ్రస్థానంలో ఉంది. తమ ట్రావెల్ ప్లాన్స్, ప్రత్యేకతలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా వాడుకుంటుంది సజ్నా. 22 వాట్సాప్ గ్రూప్‌లకు తాను అడ్మినిస్ట్రేటర్. ‘నా యాభై ఏళ్ల జీవితంలో విందువినోదాలు, ఇతర శుభకార్యాలకు పక్కఊళ్లకు వెళ్లడం తప్ప, జిల్లా దాటింది లేదు. సోషల్ మీడియాలో సజ్నా పోస్ట్‌లు ఆసక్తి కలిగించేవి. అలా నాకు ప్రయాణాలపై ఆసక్తి మొదలైంది. తొలిసారిగా సోలో ట్రావెల్ చేసినప్పుడు ఎంత గర్వంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆ ప్రయాణం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటుంది చందన. ఇప్పటివరకు సజ్నా ట్రావెల్ గ్రూప్ తరపున వందలాది మంది మహిళలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేశారు. ఈ సంవత్సరం చివరిలోపు ట్రావెల్ ఏజెన్సీ 400 ట్రిప్ మైలురాయిని చేరుకోనుంది. ‘సంవత్సరం తిరక్కుండానే మీ ట్రావెల్ కంపెనీ మూత పడుతుంది... లాంటి మాటలను పట్టించుకోలేదు. నాపై నాకు ఉన్న నమ్మకమే తిరుగులేని విజయానికి కారణం అయింది. దీనిద్వారా ఎంతోమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి ఉపకరిస్తుంది’ అంటుంది సజ్నా. ‘మా ప్రథమ ప్రాధాన్యత మహిళా ట్రావెలర్స్ భద్రత. ఈ విషయంలో రాజీపడం’ అని చెబుతున్న సజ్నా రకరకాల సేఫ్టీ యాప్‌లను సమకూర్చుకోవడంతో పాటు ఆత్మ–రక్షణ పరికరాలను కూడా ట్రావెలర్స్‌కు అందిస్తుంది. బడ్జెట్–ట్రిప్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి ముందు ఆ ప్రదేశాలకు స్వయంగా వెళ్లి పరిశీలించి రావడం సజ్నా అలవాటు. దీని ద్వారా ప్రయాణికులకు ఏవిధమైన ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుంది. ‘మనవంతుగా సమాజానికి ఇవ్వాలి’ అనే ఆదర్శ భావనతో ‘గివ్–బ్యాక్–టు–ది–కమ్యూనిటీ’ట్రిప్‌కు స్వీకారం చుట్టింది. ఇది ప్రయాణమే కాని సేవాప్రయాణం. ఇందులోని సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్లి అట్టడుగు వర్గాల ప్రజలకు లాంగ్వేజ్ స్కిల్స్ నుంచి లైఫ్‌స్కిల్స్ వరకు ఎన్నో నేర్పిస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. -
స్వల్ప బడ్జెట్‌తో స్త్రీలకు లోకం చూపిస్తోంది!
అమ్మాయ్ వెళ్దామా... వదినా వెళ్దామా... పొరుగింటి పిన్నిగారూ వెళ్దామా.. ఇరుగింటి లక్ష్మిగారూ రెడీనా... కేవలం ఆడవాళ్లు మాత్రమే కలిసి పర్యటనలు చేస్తే ఎలా ఉంటుంది? మగవాళ్ల అదుపు, ఆజమాయిషీ, అనవసర కేరింగ్ లేకుండా స్వేచ్ఛగా తాము మాత్రమే రెక్కలు ధరిస్తే ఎలా ఉంటుంది? కేరళకు చెందిన సజనా అలీకి ఈ ఆలోచనే వచ్చింది. ‘అప్పూపత్తాడి’ (దూదిపింజె పురుగు) పేరుతో లేడీస్ ఓన్లీ ట్రావెల్ గ్రూప్న నడుపుతూ స్వల్ప బడ్జెట్‌తో స్త్రీలకు లోకం చూపిస్తోంది. ఆడవారి భ్రమణకాంక్షకు ఇది బెస్ట్ టూర్ టికెట్. కిచెన్లోనే ఉండిపోతున్నారా? ఆఫీస్ పనితోనే సరిపోతోందా? ఎక్కడికైనా కదులుదామంటే భర్తగారికి వీలవుతుందో కాదో. పిల్లలు పరీక్షలు అంటారో ఏమో. లేకుంటే ‘ఇప్పుడు ఏం అవసరం. ఓటిటిలో సినిమా చూసి పడుకోక’ అనొచ్చు కదా. ఏడ్చినట్టుంది. లోకం అంటే ఇదేనా. ఇంతేనా? ఉదాహరణకు వీటిలో ఎన్ని చూసి ఉంటారు మీరు? లక్నో, అలహాబాద్, గయా, పాట్నా, వారణాసి, గౌహతి, కోల్కటా ఆఖరున మేఘాలయా. వీటిలో నిజంగా ఎన్ని చూసి ఉంటారు మీరు. సజనా అలీని కలిస్తే ఇవన్నీ మిమ్మల్నో 15 రోజుల ట్రిప్పులో చూపించేస్తుంది. ఖర్చు? చాలా తక్కువ. తోడు? మొత్తం ఆడవాళ్లే. అక్కడా అక్కడా అక్కడా... లోకం చూడాలనుకుని తపించే స్త్రీలు... వారు గృహిణులు కావచ్చు, ఉద్యోగినులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు... ఒక గ్రూప్‌గా బయలుదేరి వెళతారు. సజనా అలీ మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. కొత్త దోస్తులు... కొత్త లోకం... ఇంతకు మించి ఆనందం ఏముంటుంది? లోకం చూడకుండా కళ్లుండి గంతలు కట్టుకుంటామా? ∙∙ దూదిపింజె పురుగును మనం చూసి ఉంటాం. తేలిగ్గా సన్నటి దారాల ఒంటితో గాలిలో అలా తేలుతూ వెళుతుంటుంది. గాలి ఎటు వీస్తే అటు దాని పయనం. హాయిగా వెళుతూ ఉండటమే. సజనా అలీ 2016లో మొదలెట్టిన ట్రావెల్ సంస్థ పేరు కూడా అదే... మలయాళంలో ‘అప్పుపత్తాడి’ అని. కోజికోడ్‌కు చెందిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఉద్యోగం మానేసి కేవలం టూర్ ఆపరేషన్స్‌తో ఉపాధి పొందుతోంది. ఇందులో రెండు సంతృప్తులు. ఒకటి తాను తిరగగలుగుతోంది. రెండు తన వంటి స్త్రీలను తిప్పగలుగుతోంది. ‘మా నాన్న లారీ డ్రైవర్. తాను వెళ్లిన చోటు గురించి వచ్చి ఇంట్లో చెబుతుండేవాడు. నేనూ వస్తాను అంటే తీసుకెళ్లేవాడు కాదు... ఆడపిల్లలకు వాష్‌రూమ్ సౌకర్యాలు ఉండవని. కాని ఎప్పుడైనా ఒకరోజు దూరం ట్రిప్పులు వెళుతుంటే తీసుకెళ్లి తెచ్చేవాడు. నాకు చాలా సంతోషం వేసేది. పెద్దదాన్నయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాక ఒకసారి అందరం విమెన్ కొలిగ్స్‌తో ఒరిస్సా టూర్ ప్లాన్ చేశాను. 2015లో. ఎనిమిది మంది వస్తామన్నారు. తీరా బయల్దేరే సమయానికి ఎవరూ రాలేదు. నేనొక్కదాన్నే మిగిలాను. కాని నేను ఆగలేదు. ఒక్కదాన్నే బయలుదేరి 8 రోజుల పాటు తిరిగి ఆ విశేషాలు ఫేస్బుక్లో పెట్టాను. అవి చూసి ఎవరైతే రాము అన్నారో వాళ్లంతా ఈసారి పిలూ వస్తాం అన్నారు. ఆ ఉత్సాహంతో కేరళలోనే కొల్లం జిల్లాలో ఉండే రోసెమలా అనే ట్రెక్కింగ్‌కి ప్లాన్ చేశాను. 20 మంది వస్తామని ఎనిమిది మంది తేలారు. ఆ 8 మందిమే ఒక జీప్ తీసుకుని వెళ్లాం. వచ్చిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన– ఎందుకు కేవలం స్త్రీల కోసమే ట్రిప్స్ ప్లాన్ చేయకూడదు? అని. ఇక ఉద్యోగం మానేసి ‘అప్పుపత్తాడి’ ట్రావెల్ సంస్థను ప్రారంభించాను’ అంటుంది సజనా అలీ. ∙∙ సజనా అలీ చేసిన ఈ ఆలోచనలో ఒక మేలు, ఒక ఇబ్బంది ఉన్నాయి. మేలు ఏమిటంటే కుటుంబంతో మాత్రమే ప్రయాణం చేయాలనుకునే స్త్రీలు ఆ తప్పనిసరిని వదులుకుని ‘తోడు మహిళలు ఉన్నారు’ అని చెప్పి టూర్లకు రాగలగడం. ఇబ్బంది ఏమిటంటే.. అందరూ ఆడవాళ్లే అయితే సేఫ్టీ సంగతి ఏమిటి? అనే ప్రశ్న తలెత్తడం. ‘సేఫ్టీ గురించి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ బస చేయాలో ఏ రూట్లో వెళ్లాలో పక్కా ప్లాన్ చేసుకుంటాం. స్త్రీలకు తమ జాగ్రత్త తమకు తెలుసు. ఏ ఇబ్బందీ లేదు’ అంటుంది సజనా అలీ. అయితే ఈ జాగ్రత్త కంటే కూడా ఆమె శ్రద్ధ పెట్టే విషయం– బడ్జెట్. ‘ఎక్కువ మంది స్త్రీలు మిడిల్ క్లాస్ నుంచి ఉంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తిరగడం వారికి వీలు కాదు. అందుకే వీలైనంత తక్కువ ఖర్చులో వారిని తిప్పి చూపించడానికి నేను ప్రాధాన్యం ఇస్తాను. ఆ మేరకు రూములు, రెస్టరెంట్లతో టై అప్ చేసుకుంటాను’ అంటుంది సజనా అలీ. సజనా అలీ కేరళ కేంద్రంగా పని చేస్తూ దేశమంతా విమెన్ ఓన్లీ టూర్లు నిర్వహిస్తోంది. తాజాగా తన ఫేస్బుక్ పేజీలో ధనుష్కోటికి వెళ్లిన బృందం ఫొటో పెట్టి ‘338వ ట్రిప్’ అని పోస్ట్ చేసింది. అంటే గత ఐదేళ్లలో ఆమె 338 విమెన్ ఓన్లీ టూర్లు ఆపరేట్ చేసింది. ఎంత లేదన్నా ఐదు వేల మంది స్త్రీలు దేశంలోని రంగు రంగుల ప్రాంతాలను, సంస్కృతులను ఆమె పుణ్యాన దర్శించి ఉంటారు. రోజువారీ రొడ్డకొట్టుడు నుంచి బయటపడటానికి కొద్ది మంది గృహిణులు కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం ఇటీవలి సినిమాల్లో కనిపిస్తోంది. ఆ సినిమాల కంటే ముందే సజనా అలీ స్త్రీలకు ప్రకృతి సినిమా చూపిస్తోంది. అలాంటి వారి స్ఫూర్తితో ఈ కోవిడ్ గోల తగ్గాక మీరూ రెక్కలు కట్టుకుని తోటి మిత్రులతో ఎగిరెళ్లిపోండి. హ్యాపీ జర్నీ. -
చెరగని చిరునవ్వు
వండర్ జెండర్ రేపు (మార్చి 8) మహిళా దినోత్సవం. పూర్తిగా ‘లేడీస్ ఓన్లీ’ ఈవెంట్. ఇందులోక్కూడా మగాళ్లు దూరేసి, మహిళల గొప్పదనం గురించి మాట్లాడ్డం వారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. ‘ఇందులో ఇబ్బందేముందీ, వాళ్ల వైపే కదా మాట్లాడబోతాం’ అని మనం అనుకోవచ్చు. లేడీస్ వాష్ రూమ్‌ని లేడీసే క్లీన్ చెయ్యాలి. ‘క్లీన్ చెయ్యడం మీ కోసమే కదా’ అని చీపురుకట్ట, బకెట్ పట్టుకుని మగాళ్లు వచ్చేస్తే స్త్రీలు ఇబ్బంది పడడంలో అసహజత్వం ఏముంటుంది? మేల్ ఫెమినిస్టుల్లా మగాళ్లు మాట్లాడడమూ ఇలాంటిదే. పైగా మగవాడి అహంకారంలో, ఆధిక్యంలో ఉండే సహజత్వం... అతడిలోని ‘స్త్రీ సానుకూల ధోరణి’లో కనిపించదు. ఏడ్చే మగాణ్ణయినా నమ్ముతుంది కానీ, యావత్ మహిళాలోకం తరఫున ఏడ్చే సగటు మగాణ్ణి స్త్రీ అస్సలు నమ్మదు. మరేం చేద్దాం? చాలా చెయ్యొచ్చు... ప్రశంసా పత్రాలు ఇవ్వడం కాకుండా! ఉమెన్స్ డే సెలబ్రేషన్స్‌కి రంగురంగుల కాగితాలు కట్టి రావచ్చు. పింక్ కలర్ బెలూన్లు ఊది ఇవ్వొచ్చు. మహిళలు కట్ చేయబోతున్నది ప్రపంచ పటమంత భారీ కేక్ అయితే కనుక దాన్ని మోయడానికి చొక్కా చేతులు పైకి మడిచి వెళ్లొచ్చు. ఏదైనా కాస్త దూరం నుంచే చేయాలి. ఏం చేసినా సహాయం చేస్తున్నట్టుగా కాకుండా చెయ్యాలి. ఎందుకింతగా ఒళ్లు దగ్గరపెట్టుకోవడం? ఎందుకంటే, మగాళ్లకి ఏమంత మంచి పేరు లేదు. అయినా మగాళ్ల మంచితనం గురించి మాట్లాడుకోడానికి మహిళా దినోత్సవమే దొరికిందా మనకి?! ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. అబ్బే... ఈ ఇడియమ్ మనకి సెట్ అయ్యేలా లేదు. మేల్ ఛావనిస్ట్ పిగ్ లము కదా. ఈ రకం పిగ్గులకేమైనా డేస్ ఉన్నాయేమో వెతుక్కోవాలి. మహిళల ప్రయత్నాలను ప్రశంసిస్తూ, అభినందిస్తూ, వాళ్ల ప్రతిభను చూసి అబ్బురపడుతూ, నివ్వెరపోతూ... ఎన్ని విధాలుగా మనం మన శౌర్య వినమ్రతను (షివల్రీ) ప్రదర్శించినా పట్టించుకునే తీరిక, ముంద సలు మన మాటలపై వారికొక సదభిప్రాయం ఉండవని చెప్పి ఎంతసేపని మౌనంగా ఉండిపోగలం చెప్పండి? నిజం మాట్లాడుకుని తీరాలి. విమెన్ ఆర్ రియల్లీ వండర్ఫుల్... మన మాటకు వారి దృష్టిలో విలువున్నా, లేకున్నా! ప్రపంచమంతా మార్చి 8న మహిళా దినోత్సవం అంటోంది కానీ, ప్రతి రోజునూ మహిళ ఒక దినోత్సవంగా నెట్టుకొస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఉత్సవాన్ని ఎవరైనా సంతోషంగా జరుపుకుంటారు. ఈ ‘నెట్టుకురావడం’ ఏమిటి? నెట్టుకురావలసిన పరిస్థితులనే స్త్రీ ఎప్పటికప్పుడు ఒక ఉత్సవంగా మలచుకుంటూ ఉంటుందని! ఇదిగో ఇందుకే నమ్మరు మహిళలు మన మగాళ్లను. ఉబ్బేయడానికీ ఒక హద్దూపద్దూ ఉండొద్దా అని వారి ఉద్దేశం కావచ్చు. కానీ కొన్ని నిజాలనైనా వాళ్లు గొప్ప సహానుభూతితో అంగీకరించాలి. ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ నిశ్చలమైనవి, నిర్జీవమైనవీ! మరి అద్భుతాలు ఎలా అయ్యాయి? మనిషిలోని జీవం వల్ల, చలనశీలత వల్ల. నిజానికి ఆ ఏడు అద్భుతాలను మించిన అద్భుతం... మహిళ! వాటిలా ఆమెది నిశ్చలమైన, నిర్జీవమైన స్వభావం కాదు కనుక. మరి ఎందుకని ఆమె అద్భుతం కాకుండా పోయింది? ఆమె పట్ల మగవాళ్ల నిశ్చలత్వం వల్ల, జీవరాహిత్యం వల్ల. స్త్రీలోని అద్భుతం ఆమె క్రియాశీలత లో కనిపిస్తుంది. పడిపోతున్నా, పైకి లేవడానికి ఆమె చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది. ఆమెలోని అద్భుతాలు లెక్కలేనన్ని. ప్రపంచంలో జరుగుతున్న పనిలో 66 శాతం ఆమెదే. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో 50 శాతం ఆమె చేస్తున్నదే. కానీ ఆమె పొందుతున్న ప్రతిఫలం 10 శాతం మాత్రమే. ఆమె పేరున ఉన్న సంపద 1 శాతం మాత్రమే. ఇలాంటి శాతాలు చాలానే ఉన్నాయి. శ్రమ ఎక్కువ. గుర్తింపు తక్కువ. అయినా నిరుత్సాహపడకుండా అన్ని రంగాల్లోనూ మహిళ ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోంది. అదీ అద్భుతం! సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా నెలకు లక్ష రూపాయల జీతాన్ని తెచ్చుకునే హడావుడిలో కూడా ఇంట్లో పూలకుండీకి నీళ్లు పోయందే క్యాబ్ ఎక్కని అద్భుతం మిహ ళ! తరగని ఇంటిపనిలో చెరగని చిరునవ్వుతో ‘గృహిణి’గా జీవితాంతం పనిచేసే అన్ పెయిడ్ అద్భుతం మహిళ! ఎందుకు అంత అద్భుతం అంటే... మగాళ్లం మనం అలా చేయలేం. ఎందుకని చేయలేం అంటే ఏమో చెప్పలేం. ‘హ్యాపీ ఉమెన్స్ డే’ అని చెప్పడమంత తేలిక కాదేమో... మనకు మనం ఒక క్యారెక్టరైజేషన్‌ను ఇచ్చుకోవడం.