చెరగని చిరునవ్వు | Women's Day. The 'Ladies Only' event | Sakshi
Sakshi News home page

చెరగని చిరునవ్వు

Published Fri, Mar 6 2015 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

మహిళాశక్తి: డింపుల్ యాదవ్, జయాబచ్చన్     (ప్రతీకాత్మక చిత్రం)

మహిళాశక్తి: డింపుల్ యాదవ్, జయాబచ్చన్ (ప్రతీకాత్మక చిత్రం)

వండర్ జెండర్

రేపు (మార్చి 8) మహిళా దినోత్సవం. పూర్తిగా ‘లేడీస్ ఓన్లీ’ ఈవెంట్. ఇందులోక్కూడా మగాళ్లు దూరేసి, మహిళల గొప్పదనం గురించి మాట్లాడ్డం వారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. ‘ఇందులో ఇబ్బందేముందీ, వాళ్ల వైపే కదా మాట్లాడబోతాం’ అని మనం అనుకోవచ్చు. లేడీస్ వాష్ రూమ్‌ని లేడీసే క్లీన్ చెయ్యాలి. ‘క్లీన్ చెయ్యడం మీ కోసమే కదా’ అని చీపురుకట్ట, బకెట్ పట్టుకుని మగాళ్లు వచ్చేస్తే  స్త్రీలు ఇబ్బంది పడడంలో అసహజత్వం ఏముంటుంది? మేల్ ఫెమినిస్టుల్లా మగాళ్లు మాట్లాడడమూ ఇలాంటిదే. పైగా మగవాడి అహంకారంలో, ఆధిక్యంలో ఉండే సహజత్వం...  అతడిలోని ‘స్త్రీ సానుకూల ధోరణి’లో కనిపించదు. ఏడ్చే మగాణ్ణయినా నమ్ముతుంది కానీ, యావత్ మహిళాలోకం తరఫున ఏడ్చే సగటు మగాణ్ణి స్త్రీ అస్సలు నమ్మదు.

మరేం చేద్దాం? చాలా చెయ్యొచ్చు... ప్రశంసా పత్రాలు ఇవ్వడం కాకుండా! ఉమెన్స్ డే సెలబ్రేషన్స్‌కి రంగురంగుల కాగితాలు కట్టి రావచ్చు. పింక్ కలర్ బెలూన్లు ఊది ఇవ్వొచ్చు. మహిళలు కట్ చేయబోతున్నది ప్రపంచ పటమంత భారీ కేక్ అయితే కనుక దాన్ని మోయడానికి చొక్కా చేతులు పైకి మడిచి వెళ్లొచ్చు. ఏదైనా కాస్త దూరం నుంచే చేయాలి. ఏం చేసినా సహాయం చేస్తున్నట్టుగా కాకుండా చెయ్యాలి. ఎందుకింతగా ఒళ్లు దగ్గరపెట్టుకోవడం? ఎందుకంటే, మగాళ్లకి ఏమంత మంచి పేరు లేదు. అయినా మగాళ్ల మంచితనం గురించి మాట్లాడుకోడానికి మహిళా దినోత్సవమే దొరికిందా మనకి?! ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. అబ్బే... ఈ ఇడియమ్ మనకి సెట్ అయ్యేలా లేదు. మేల్ ఛావనిస్ట్ పిగ్ లము కదా. ఈ రకం పిగ్గులకేమైనా డేస్ ఉన్నాయేమో వెతుక్కోవాలి.

మహిళల ప్రయత్నాలను ప్రశంసిస్తూ, అభినందిస్తూ, వాళ్ల ప్రతిభను చూసి అబ్బురపడుతూ, నివ్వెరపోతూ... ఎన్ని విధాలుగా మనం మన శౌర్య వినమ్రతను (షివల్రీ) ప్రదర్శించినా పట్టించుకునే తీరిక, ముంద సలు మన మాటలపై వారికొక సదభిప్రాయం ఉండవని చెప్పి ఎంతసేపని మౌనంగా ఉండిపోగలం చెప్పండి? నిజం మాట్లాడుకుని తీరాలి. విమెన్ ఆర్ రియల్లీ వండర్‌ఫుల్... మన మాటకు వారి దృష్టిలో విలువున్నా, లేకున్నా! ప్రపంచమంతా మార్చి 8న మహిళా దినోత్సవం అంటోంది కానీ, ప్రతి రోజునూ మహిళ ఒక దినోత్సవంగా నెట్టుకొస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఉత్సవాన్ని ఎవరైనా సంతోషంగా జరుపుకుంటారు. ఈ ‘నెట్టుకురావడం’ ఏమిటి? నెట్టుకురావలసిన పరిస్థితులనే స్త్రీ ఎప్పటికప్పుడు ఒక ఉత్సవంగా మలచుకుంటూ ఉంటుందని! ఇదిగో ఇందుకే నమ్మరు మహిళలు మన మగాళ్లను. ఉబ్బేయడానికీ ఒక హద్దూపద్దూ ఉండొద్దా అని వారి ఉద్దేశం కావచ్చు. కానీ కొన్ని నిజాలనైనా వాళ్లు గొప్ప సహానుభూతితో అంగీకరించాలి.


 ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ నిశ్చలమైనవి, నిర్జీవమైనవీ! మరి అద్భుతాలు ఎలా అయ్యాయి? మనిషిలోని జీవం వల్ల, చలనశీలత వల్ల. నిజానికి ఆ ఏడు అద్భుతాలను మించిన అద్భుతం... మహిళ! వాటిలా ఆమెది నిశ్చలమైన, నిర్జీవమైన స్వభావం కాదు కనుక. మరి ఎందుకని ఆమె అద్భుతం కాకుండా పోయింది? ఆమె పట్ల మగవాళ్ల నిశ్చలత్వం వల్ల, జీవరాహిత్యం వల్ల.
 స్త్రీలోని అద్భుతం ఆమె క్రియాశీలత లో కనిపిస్తుంది.

పడిపోతున్నా, పైకి లేవడానికి ఆమె చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది. ఆమెలోని అద్భుతాలు లెక్కలేనన్ని. ప్రపంచంలో జరుగుతున్న పనిలో 66 శాతం ఆమెదే. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో 50 శాతం ఆమె చేస్తున్నదే. కానీ ఆమె పొందుతున్న ప్రతిఫలం 10 శాతం మాత్రమే. ఆమె పేరున ఉన్న సంపద 1 శాతం మాత్రమే. ఇలాంటి శాతాలు చాలానే ఉన్నాయి. శ్రమ ఎక్కువ. గుర్తింపు తక్కువ. అయినా నిరుత్సాహపడకుండా అన్ని రంగాల్లోనూ మహిళ ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోంది.

 

అదీ అద్భుతం! సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా నెలకు లక్ష రూపాయల జీతాన్ని తెచ్చుకునే హడావుడిలో కూడా ఇంట్లో పూలకుండీకి నీళ్లు పోయందే క్యాబ్ ఎక్కని అద్భుతం మిహ ళ! తరగని ఇంటిపనిలో చెరగని చిరునవ్వుతో ‘గృహిణి’గా జీవితాంతం పనిచేసే అన్ పెయిడ్ అద్భుతం మహిళ! ఎందుకు అంత అద్భుతం అంటే... మగాళ్లం మనం అలా చేయలేం. ఎందుకని చేయలేం అంటే ఏమో చెప్పలేం.  ‘హ్యాపీ ఉమెన్స్ డే’ అని చెప్పడమంత తేలిక కాదేమో... మనకు మనం ఒక క్యారెక్టరైజేషన్‌ను ఇచ్చుకోవడం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement