Lagadapati Rajagopal Survey
-
ఒట్టు..ఇక సర్వేలు చేయను: లగడపాటి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చిలుక జోస్యం చెప్పి బొక్కబోర్లాపడ్డ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఇక జీవితంలో సర్వేల జోలికి వెళ్లనని ప్రతినబూనారు. ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఏపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు..సైకిల్ విజయం తథ్యం అంటూ బీరాలు పలికిన ఆయనకు ఫలితాల అనంతరం దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఫ్యాన్ ప్రభంజనంతో సైకిల్ కొట్టుకుపోవడంతో ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి అభాసుపాలయ్యారు. ఫలితాల అనంతరం మీడియా ముందుకు వస్తానని బీరాలు పలికిన లగడపాటి...ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌కి మొహం చాటేసి...చివరకు ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలం అయినందుకు చింతిస్తున్నానంటూ అధికారికంగా ఓ లేఖ విడుదల చేశారు. కారణాలు ఏమైనప్పటికీ తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజల నాడి పసిగట్టడంలో వరుసగా రెండుసార్లు విఫలం అయినందుకు ఇక భవిష్యత్‌లో సర్వేలకు దూరంగా ఉండదలచుకుంటున్నట్లు చెప్పారు. తన ఫలితాల వలన ఎవరైనా, ఏ పార్టీ అయినా నొచ్చుకుని ఉంటే మన్నించాలంటూ లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నేతగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పాలంటూ లగడపాటి ఆకాంక్షించారు. చదవండి: బాబు కోసం బోగస్ సర్వేలు సరికొత్త నాటకానికి తెరలేపిన లగడపాటి విదూషకుల విన్యాసాలు -
లగడపాటిది పనికిమాలిన సర్వే: టీడీపీ మంత్రి
నర్సీపట్నం: ‘ప్రజల నాడి లగడపాటికి ఏమి తెలుసు.. ఆయన సర్వే వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని’ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌లో లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన సర్వేపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లగడపాటి ప్రకటించిన ఎగ్జిట్‌పోల్స్ వలన అనేకమంది కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు కట్టి వీధిన పడ్డారన్నారు. ప్రజల నాడి తెలియని ఇలాంటి పనికిమాలిన సర్వేల వల్ల కోట్లలో బెట్టింగ్‌లు కాసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోకుండా ఢిల్లీ వంటి నగరాల్లో కూర్చుని చేసే సర్వేల్లో వాస్తవికత ఉండదన్నారు. ప్రజలనాడి తెలిసిన వారే ఎగ్జిట్‌పోల్స్ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం నవ్వులాటగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. కౌటింగ్ కేంద్రంలో అభ్యర్థి వద్ద సెల్‌ఫోన్ ఉండేందుకు అంగీకరించని ఎన్నికల కమిషన్.. కేంద్ర అబ్జర్వర్‌కు సెల్‌ఫోన్ అనుమతించడంపై అయ్యన్న అనుమానం వ్యక్తం చేశారు. -
‘లగడపాటి ఓ జోకర్’
సాక్షి, రామగుండం(పెద్దపల్లి): తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసినా.. నాయకుల మధ్య మాటల యుద్దం ఆగటం లేదు. విజయంపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మినహా అన్ని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌ఫోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే లగడపాడి రాజగోపాల్ మాత్రం మహాకూటమి అధికారంలోకి రాబోతోందని, పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని తన సర్వేలో తేలినట్లు వివరించారు. రామగుండంలో టీఆర్ఎస్ రెబల్ కోరుకంటి చందర్ విజయం ఖాయమని అభిప్రాయపడ్డారు. లగడపాటికి సోమారపు సవాల్ దీంతో లగడపాటి సర్వేపై రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ నిప్పులు చెరిగారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన లగడపాటి ఒక జోకర్ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామగుండంలో కూడా టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ‘నీవిచ్చిన సర్వే నిజమైతే హైదరాబాద్‌లో బట్టలు విప్పుకొని తిరుగుతా? నీ సర్వే అబద్దమైతే నువ్వు బట్టలిప్పుకొని తిరగాలి’అంటూ లగడపాటికి సోమారపు సత్యనారాయణ సవాల్ విసిరారు. -
లగడపాటి సర్వే అంతా బోగస్: షబ్బీర్ అలీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన ఎన్నికల సర్వే అంతా బోగస్ అని కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కొట్టిపారేశారు. తన ఆస్తులను కాపాడుకునేందుకు టీడీపీతో లగడపాటి కుమ్మక్కయ్కారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 50 నుంచి 55 సీట్లు వస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కామారెడ్డిని సిద్దిపేటలో కలవనివ్వబోమని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. కామారెడ్డిని జిల్లాగా మార్చి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. మెదక్ జిల్లా రామాయంపేటను కామారెడ్డిలో కలుపుతామన్నారు. -
లగడపాటి ఓ జోకర్: లక్ష్మీపార్వతి
అనంతపురం: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఓ జోకర్ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో లగడపాటి కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. రాయదుర్గంలో ఆమె విలేకరలుతో మాట్లాడుతూ... లగడపాటి అసత్య సర్వేలు వెల్లడిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు లగడపాటి సహకరించారని ఆరోపించారు. ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆమె పేర్కొన్నారు.