ఎలుకజాతి ఏనుగు!
ప్లే టైమ్: క్యాపిబరా... ప్రస్తుతం సృష్టిలో ఉన్న మూషిక జాతుల్లోకెల్లా పెద్దది. చూడటానికి ఏదో జంతువులా ఉన్నా ఎలుక పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. కనీసం 40 కేజీల బరువు, ఒకటిన్నర అడుగు, ఎత్తు, బారుగా నాలుగడుగుల పొడవు ఉండే ఇది పందికొక్కు అనే మాటకు సిసలైన నిదర్శనంలా ఉంటుంది. క్యాపిబరాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల్లో కనిపిస్తాయి. సవన్నా గడ్డిభూములు వీటికి ఆవాసాలు. చెరువులు, నదులు, సరస్సుల ప్రాంతంలో జీవిస్తాయి.
నీటిలో ఈదగల, భూమిమీద బతికే సామర్థ్యం వీటిది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏదైనా పెద్ద జంతువు నుంచి తమకు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు నీళ్లలోకి వెళ్లి దాక్కోవడం వీటి ప్రత్యేకత. అలా కొన్ని నిమిషాల పాటు నీళ్లలో దాక్కొని లోలోపలే ఈదుకొంటూ వెళ్లి ఇవి క్రూరజంతువుల బారి నుంచి బయటపడుతూ ఉంటాయి. సంఘటితంగా ఉండటం వీటి జీవనశైలి. ఒక్కో సమూహంలో వంద వరకూ ఉంటాయి. వాటిలో అవి జతకడుతూ సంతానోత్పత్తి చేసుకొంటాయి. ఇవి ఎనిమిది నుంచి పది సంవత్సరాల పాటు బతకగలవు. గడ్డిభూముల్లో పెరిగే దుంపలు, గడ్డి, ఆకులే వీటి ఆహారం. ఒక్కో క్యాపిబరా రోజుకు కనీసం మూడున్నర కేజీల ఆహారాన్ని తీసుకొంటుంది.