Sabdham Review: ‘శబ్దం’ మూవీ రివ్యూ
టైటిల్: శబ్దంనటీనటులు: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులునిర్మాణ సంస్థ: 7G ఫిల్మ్స్ నిర్మాత: 7G ఫిల్మ్స్ శివ దర్శకత్వం: అరివళగన్సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: అరుణ్ బత్మనాభన్ఆది పినిశెట్టికి (Aadhi Pinisetty) సోలో హిట్ పడి చాలా కాలమైంది. తెలుగు సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. కానీ హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో తనకు ‘వైశాలి’ లాంటి బిగ్ హిట్ అందించిన దర్శకుడు అరివళగన్‌తో మరో మూవీ చేశాడు. అదే ‘శబ్దం’. (sabdham movie) ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌లో లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్ అవంతిక(లక్ష్మీ మీనన్) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా (Shabdam Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..హరర్ చిత్రాలన్ని ఓకే ఫార్మాట్లో సాగుతాయి. భయపెట్టే దెయ్యాలు.. వాటికి ఓ ఎమోషనల్ నేపథ్యం.. చివరకు వారి చావులకు కారణమైన వారికి శిక్ష పడడం..దాదాపు అన్ని హారర్ థ్రిల్లర్ సినిమాల కథ ఇలానే ఉంటుంది. శబ్దం కథ కూడా ఇలాంటిదే.కానీ కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టేందుకు దర్శకుడు అరివళగన్ రొటీన్ జిమ్మిక్కులను వాడుకోకుండా కొత్తగా ట్రై చేశాడు. టైటిల్‌కి తగ్గట్టే డిఫరెంట్ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారు. ఫస్టాఫ్ మొత్తం డిఫరెంట్‌గా ఉంటుంది. హారర్ జానర్లో ఇదొక ప్రయోగంలా అనిపిస్తుంది. హీరో పాత్ర పరిచయం మొదలు.. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం వరకు ప్రతీదీ సైంటిఫిక్ మెథడ్‌లో చెప్పారు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం మళ్లీ రోటీన్ హారర్ చిత్రాలను గుర్తు చేస్తుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్ది సాధారణ సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. 42 దెయ్యాల నేపథ్యం, వాటి లక్ష్యం తెలిసిన తర్వాత కొన్ని సందేహాలు కలుగుతాయి. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే కొంతమేర కొత్తగా అనిపిస్తుంది. ఓ సీన్లో తెరపై బొమ్మ కనిపించకుండా చేసి కేవలం సౌండ్‌తోనే ప్రేక్షకుడిని భయపెట్టాడు. టెక్నికల్ అంశాలపై కొంత అవగాహన ఉంటే ఈ సినిమా బోర్ కొట్టదు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. పారానార్మల్ ఇన్వెస్టగేటర్ వ్యోమ వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టి ఒదిగిపోయాడు. డిఫరెంట్ లుక్‌తో తెరపై కొత్తగా కనిపించాడు. నటన పరంగా ఆయనకు వంక పెట్టడానికేమి లేదు. ఇంటర్వెల్ వరకు ఆమె పాత్రతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సిమ్రాన్ కూడా ఓ కొత్త రోల్ ప్లే చేసింది. డయానా పాత్రలో ఆమె చక్కగా నటించింది. నాన్సీగా లైలా తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. రిడిన్ కింగ్స్లే కొన్ని చోట్ల నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమాను నిలబెట్టాడు. కొన్ని సన్నివేశాలలో నటన కంటే బ్యాగ్రౌండ్ స్కోరే ఎక్కువ భయపెడుతుంది. డిఫరెంట్ బీజీఎంతో ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.