లక్ష్మి హత్య కేసులో కీలకమలుపు
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్: మండలంలోని పెదనల్లబల్లిలో ఇటీవల హత్యకు గురైన లక్ష్మి కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించినట్లు తెలుస్తోంది. లక్ష్మిని సొంత మరిదే మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ నలుగురిని గురువారం పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పెదనల్లబల్లికి చెందిన బోడా లక్ష్మి(50)ని గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకా రం హత్య చేసిన విషయం విదితమే. తొలుత ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు భావించారు. కానీ విచారణ చేపట్టిన పోలీసులు మాత్రం లక్ష్మి హత్యకు గురైనట్లు నిర్ధారించారు.
అందులో భాగంగా గ్రామానికి చెంది న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి విచారణ చేపట్టినట్లు తెలిసింది. హత్య జరిగిన రోజు రాత్రి ఇంటికి ఎవరెవరు వచ్చారు... ఆమె గుడుంబా తయారు చేసేప్పుడు అక్కడ ఎ వరెవరు ఉన్నారు..? అనే విషయాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. లక్ష్మి చెల్లె భర్తే పథకం పన్ని ముగ్గురు అనుచరులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. లక్ష్మి చెల్లెలు భర్త ఇటీవల వరికోత యంత్రం కొనుగోలు కోసం లక్ష్మి వ ద్ద డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బు కోసం లక్ష్మి ఒత్తిడి చేస్తున్న క్రమంలో హత్యకు ప్రణాళిక రచించినట్లు వి చారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. లక్ష్మి చెల్లెలిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.